జనజీవన శ్రవంతిలోకి రావాలని భూపతి పిలుపు (వీడియో)
తనను సంప్రదించేందుకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన భూపతి
సాయుధ పోరాటాన్ని తాము విరమించామని లొంగిపోయిన మావోయిస్టు కీలకనేత భూపతి వీడియోలో వివరించారు. భూపతి నుండి ఒక వీడియో ఆదివారం మధ్యాహ్నం ‘తెలంగాణ ఫెడరల్’ కు వచ్చింది. ఆ వీడియోలో తనతో పాటు సహచరులు లొంగిపోయిన విధానాన్ని వివరించారు. ‘‘మావోయిస్టు పంథాలో ఉన్న సహచరులందరు కూడా పోలీసులకు లొంగిపోవాల్సింది’’గా విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు కూడా సాయుధపోరాటమార్గం వదిలేసి ప్రజాస్వామికంగా ప్రజల్లో పనిచేసేందుకు రావాల’’ని పిలుపిచ్చారు. ‘‘మేం ఆయుధాలను విసర్జించినపుడు దాన్ని కొందరు విమర్శించారు, ద్రోహం అన్నారు, కోవర్టు అన్నార’’ని ఆవేధనతో చెప్పారు. ‘‘దేశంలో పరిస్థితులు మారాయని, సాయుధపోరాట పంథాకు కాలం చెల్లి’’నట్లు భూపతి అభిప్రాయపడ్డారు. దీనిని తమ సెంట్రల్ కమిటీ అంగీకరించే పరిస్థితిలో లేదన్నారు.
తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తున్నట్లు వీడియోలో చెప్పారు. ‘‘తనకన్నా ముందు లొంగిపోయిన కామ్రేడ్ రూపేష్ ఇలాంటి విమర్శలకు చాలా వివరంగా సమాధానం ఇచ్చార’’ని గుర్తుచేశారు. అందువల్ల తాను ఆవిషయాల్లోకి వెల్లదల్చుకోలేదన్నారు. ‘‘ఇపుడు పరిస్థితులు మారిపోయాయి కాబట్టి మిగిలిన వాళ్ళుకూడా ఆయుధాలు వదిలేసి జన జీవనస్రవంతిలో కలవాల’’ని సూచించారు. ‘‘చట్టంపరిధిలో ప్రజల్లో ఉండే పనిచేద్దామ’’ని ఉద్యమంలో పనిచేస్తున్న వారికి ప్రతిపాదించారు. ‘‘అందువల్ల తమ నిర్ణయాన్ని అర్థంచేసుకుని, తమకు మద్ధుతీనీయాలని మేధావులు, ప్రజస్వామిక ప్రేమికులు, ఆదివాసీ ప్రమేకులకు తాను విజ్ఞప్తి చేస్తున్న’’ట్లుభూపతి చెప్పారు. ‘‘ఆయుధాలు వదిలేసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారు, ప్రజల ముందుకు వచ్చి పనిచేయాలనుకుంటున్నవాళ్లు తనను సంప్రదించవచ్చ’’ని ఫోన్ నెంబర్ 8856038533 ఇచ్చారు. ఈ నెంబర్ కు ఎవరైనా సంప్రదించవచ్చని కూడా చెప్పారు. లేకపోతే రూపేష్ నంబర్ కు కూడా సంప్రదించవచ్చని ఆ నెంబర్ 6267138163 కూడా వీడియోలో చెప్పారు.