పింఛన్ల పంపిణీపై ఈసీ ఏం సూచనలు ఇచ్చిందంటే!

పింఛన్ పంపిణీపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని తేల్చి చెప్పింది.

Update: 2024-04-27 07:05 GMT

నెల మారుతోంది. ఏప్రిల్ పోయి మే వస్తోంది. పింఛన్ లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టింది. ఈ నెలైనా పింఛన్లు సరైన సమయానికి వస్తాయా? రావా? అని. ఈ నేపథ్యంలోనే వారికి స్వాంతన కలిగేలా ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోయిన నెల అంటే ఏప్రిల్ ప్రారంభంలో ఇచ్చిన పింఛన్ల పంపిణీలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి అలా జరగకూడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఆ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, పింఛన్ల పంపిణీ అంశంలో నిర్లక్ష్యం పనికిరాదని ఈసీ ఆదేశించింది.

ఇప్పుడూ అలానే చేయండి

ఏది ఏమైనా ఈనెల లబ్దిదారులకు సరైన సమయంలో పింఛన్లు అందాలని ఈసీ వెల్లడించింది. అందుకోసం గత నెల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని, ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని సూచించింది. అది కుదరి పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో పింఛన్‌ను అందించాలని సూచించింది. అదే విధంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎన్నికల కోడ్ సాకు కాకూడదు

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించడంలో అవాంతరాలు ఎదురయితే అందుకు ఎన్నికల కోడ్ ఒక సాకుగా ఉండకూడదని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకుండా పింఛన్లు అందజేయాలని ఈసీ వివరించింది. వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ అధికారులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.

ఎండలను దృష్టిలో పెట్టుకోండి

ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత తీవ్రస్థాయిలో ఉందని కావున పింఛన్ లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పింఛన్ తీసుకోవాలన్న నిబంధన ఎక్కడా ఉండకూడదని ఈసీ తేల్చి చెప్పింది. ఎక్కడైనా ఇంటికి వెళ్లే లబ్దిదారులకు పింఛన్‌ను అందించాలని తెలిపింది. అంతేకాకుండా పింఛన్ల పంపిణీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పలు జాగ్రత్తలు పాటించాలని, ఎండ తీవ్రతను తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో పింఛన్ల పంపిణీకి కావాల్సిన డబ్బును ముందుగానే అమర్చుకోవడం కూడా ఒకటని వివరించింది.

సంతోషంలో లబ్దిదారులు

గత నెల పింఛన్ల ఆలస్యం వల్ల ఈసీని తెగ తిట్టిపోసిన లబ్దిదారులు.. ఈ నెల మాత్రం ఈసీ ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న సమ్యను పసిగట్టి తగిన చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఇబ్బంది పడకుండా నిర్ణయాలు తీసుకుందని అభినందిస్తున్నారు లబ్దిదారులు. మరి పింఛన్ల పంపిణీకి ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా.. లేదా గత నెల మాదిరిగానే ఈ నెల కూడా లబ్దిదారులను ఇబ్బంది పెడుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News