కే‌ఏ పాల్ పార్టీకి ఎన్నికల గుర్తు వచ్చేసింది..

కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తును ఖరారు చేసింది. తానూ ఒక కుమ్మరి మాదిరిగా ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతానని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Update: 2024-04-12 12:26 GMT

(శివరామ్)

తన రాజకీయంతో కడుపుబ్బా నవ్వించే కేఏ పాల్ పార్టీకి గుర్తు వచ్చేసింది. ప్రజా శాంతి పార్టీకి ఎన్నికల సంఘం.. మట్టి కుండను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. ఈ వేసవిలో మట్టి కుండతో ఇక పాల్ హడావుడికి అంతా సిద్ధం కావాల్సిందే. తమ పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే‌ఏ పాల్ చెప్పారు. ఆయన విశాఖ రైల్వే న్యూ కాలనీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

 

తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతామన్నారు. ఇక ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోతారని, గ్లాసులు పగిలి పోతాయని, సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. కోర్టులో కేసు వేసి మరీ కుండ గుర్తు సాధించానని చెప్పారు . ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి, స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా వెయ్యి కంపెనీల ద్వారా ఉపాధి తమ పార్టీ విధానాలని చెప్పుకొచ్చారు.

ప్రజలు మోడీ, కేసీఆర్, జగన్‌కు అవకాశం ఇచ్చారని, ప్రజా శాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రాని వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని అన్నారు. జగన్ రుషి కొండలో కొండ మాయం చేశారని ఆయన వస్తే ఇంక ఏమీ మిగలవని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.

స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారని, కంపెనీలు అహ్మదాబాద్ తరలి పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికంగా ప్రజల బటన్లు తన వద్ద ఉన్నాయని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం విజయగనరంలో దోచుకుని ఇప్పుడు విశాఖకు వచ్చిందని ఆరోపించారు.

Tags:    

Similar News