చంద్రబాబుపై యనమల ఎందుకు తిరుగుబాటు చేశారో తెలుసా?

లక్షల కోట్లకు అధిపతిగా మారిన కె వెంకటేశ్వరావును పెంచి పోషించింది ఎవరు? యనమలా? చంద్రబాబా? ఎస్ఈజడ్ ద్వారా రైతుల భూములు లాక్కునేలా చేసింది ఎవరు?;

Update: 2024-12-12 11:03 GMT

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అక్కసు ఏమిటి? ఎందుకు బీసీ జపం ఎత్తుకున్నారు? అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఎప్పుడైనా పోరాడారా? అధికారంలో లేనప్పుడైనా టీడీపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, పార్టీ బయట ఉన్న ప్రజల్లో ఒకరైన బీసీల గురించి గానీ మాట్లాడారా? ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకుని చంద్రబాబును యనమల ఎందుకు బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన పెద్దల్లో యనమల మొదటి వరుసలో ఉంటారు. అలాంటి యనమలను రాజకీయాలకు చంద్రబాబు ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారనేది కూడా చర్చగానే మారింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పాత్ర బలంగా ఉంది. చంద్రబాబు చెప్పినా జరగని పనులు చాలా వరకు లోకేష్ చెబితే జరుగుతున్నాయి. లోకేష్ రాజకీయ ప్రాబల్యం, పలుకు బడి ఎంత వరకు పోయిందంటే మంత్రులు సైతం లోకేషన్ ఫొటోలు పెట్టి అడ్వర్ టైజ్మెంట్ లు ఇస్తున్నారు. గురువారం ఈనాడు మొదటి పేజీలో క్వార్టర్ పేజీ అడ్వర్ టైజ్ మెంట్ వచ్చింది. ఈ యాడ్ ఇచ్చింది రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. గేమ్ ఛేంజర్ లోకేష్ అన్న అంటూ యాడ్ ఇచ్చారు. లోకేష్ నిలువెత్తు ఫొటో పెట్టి గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప పరిణామమంటూ కొనియాడారు. చంద్రబాబు కొడుకుకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీలో సీనియర్ లకు ఇవ్వడం లేదని, లోకేషన్ తన అనుచరులకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీలోని సీనియర్ లకు ఇవ్వడం లేదనే అసంతృప్తి పార్టీ సీనియర్ లలో ఉంది.

ఈ విషయాలను చెప్పడంతో పాటు తన అసంతృప్తిని నిరసన రూపంలో లేఖ ద్వారా యనమల వ్యక్తం చేశారు. ఎన్టీ మారావుకు పట్టిన గతి పార్టీలో యనమలకు పడితే తప్పేంటని కొందరు అనటం విశేషం. పైగా యనమల కుమార్తెను పార్టీ ఎమ్మెల్యేగా చేసింది. అల్లుడి తమ్ముడైన పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ అయ్యారు. యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే అయ్యారు. అంటే వియ్యంకుని ఇంట్లో వారంతా ఎంపీ, ఎమ్మెల్యేలు అయ్యారు. అది చంద్రబాబు చేసిన సాయం కిందకు రాదా అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్‌ భూములపై తీర్మానం చేసింది టీడీపీ సర్కారే. 2002–03లో కాకినాడ సెజ్‌ కోసం భూ సేకరణ ప్రారంభమైంది. అప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. 2014లో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల ఎందుకు కాకినాడ సెజ్‌ రైతుల పక్షాన నిలబడలేదనేది చర్చగా మారింది. సెజ్‌కు ముందుగా భూములిచ్చింది యనమల రామకృష్ణుడు. తానే ముందుగా భూములిచ్చి తక్కిన రైతులంతా భూములిచ్చే విధంగా యనమల మోటివేట్ చేశారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. సెజ్‌ రైతులపై యనమలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం చంద్రబాబుతో విచారణ జరపించాలన్నారు. వేల కోట్లు దోచుకున్న కేవీ రావు చౌదరి నుంచి సొమ్మును తిరిగి వెనక్కి తీసుకొని రైతులకు ఎకరాకు రూ. 40లక్షలు చెల్లించాలని అన్నారు. సెజ్‌ భూములను జగన్‌ తిరిగి రైతులకు ఇచ్చిన విధంగానే చంద్రబాబు కూడా తిరిగి రైతులకు భూములు ఇచ్చే విధంగా చంద్రబాబుతో యనమల మాట్లాడాలని డిమాండ్ చేశారు.

తనకు రాజ్యసభ ఇవ్వాలని చంద్రబాబును యనమల కోరుతూ వచ్చారు. అయితే నారా లోకేష్ అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. కాకలు తీరిన రాజకీయవేత్త చేసేది ఏమీ లేక తన 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్ట మొదటి సారిగా బిసి మంత్రాన్ని జపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణడు మూడు రోజుల క్రితం ఓ లేఖ రాశారు. ఆ లేఖలో యనమల అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది. కాకినాడ సెజ్‌లో మత్స్యకారులు, చిన్న రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొన్న పెద్ద కంపెనీలు లాభపడ్డాయని, రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాల్సిందిగా ఆ లేఖలో యనమల విన్నవించారు. లోకేశ్‌ పెత్తనం బాగా పెరిగిపోయందన్న అభిప్రాయం యనమలలో ఉంది.

కాకినాడ సెజ్‌లో కేవీ రావుకు చెందిన బ‌డా కంపెనీలు త‌క్కువ ధ‌ర‌కే భూమిని పొంది, ఆ త‌ర్వాత జీఎంఆర్‌కు వంద‌ల కోట్లుకు అమ్మారు. ఈ విషయం కూడా యనమల తన లేఖలో ప్రస్తావించారు. ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి రూ. 4 వేల కోట్లు వారు లబ్ది పొందారు. కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు పెట్ట‌డానికి ముర‌ళీ చౌద‌రికి చెందిన‌ దివీస్ కంపెనీతో సహా పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూముల పొందటం ద్వారా పెట్టుబడి దారులు భారీగా లాభాలు పొందారు. పేద‌ల‌కు తిప్ప‌లు అని ఆయ‌న పేర్కొన్నారు. సముద్ర కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు భూములు భూములు కోల్పోయిన పేదలకు మాత్రం తిప్పలు తప్పలేదు. ఇందుకు కారణం ఒక విధంగా యనమల రామకృష్ణుడే. ఆయన భూములు ముందుగా అమ్మినందున తన బంధువులు, ఇతరులు అమ్మారనేది వాస్తవం.

రాజ్యసభ సభ్యులుగా మంగళవారం నామినేషన్ లు దాఖలు అవుతాయనగా సోమవారం చంద్రబాబుకు లేఖరాయడంతో పాటు బీసీలకు అన్యాయం జరుగుతుందనే విషయం ప్రస్తావించారు. అప్పటికే రాజ్యసభ సీటు సానా సతీష్ బాబుకు ఖరారైంది. దీంతో అక్కసు ఆపుకోలేక ఈ విధంగా యనమల చేశారనే విమర్శలు ఉన్నాయి. సానా సతీష్ భారీ స్థాయిలో పార్టీ కోసం ఖర్చు పెట్టారని, అందుకే ఆయనకు రాజ్యసభ ఇచ్చారనేది వాస్తవం. ముందుకు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. తరువాత రాజ్యసభకు పంపించారు. రాజ్య సభకు సతీష్ వెళితే ఢిల్లీ ఉన్నతాధికారుల వద్ద కావాల్సినవి సాధించుకునేందుకు చక్రం తిప్పగలిగే సత్తా ఉన్నవాడనే భావనతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తనయుడి నిర్ణయాన్ని తండ్రి చంద్రబాబు కాదలనలేక పోయారని పార్టీ వారు చెబుతున్నారు.

Tags:    

Similar News