నాగబాబుకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారో తెలుసా?

మంత్రివర్గంలోకి తీసుకోనున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఏ మంత్రిత్వ శాఖ అప్పగిస్తారనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది;

Update: 2024-12-15 04:30 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి ప్రస్తుతం 24 మంది ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్న నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 9న ప్రకటించారు. ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. రాజ్యసభ అయినా దక్కుతుందని జనసేన వారు భావించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి ముఖ్యమంత్రి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు సానా సతీష్ బాబుకు రాజ్యసభ కేటాయించాల్సి రావడంతో రాజ్యసభ నాగబాబుకు దక్కలేదు. పవన్ కల్యాణ్ కోర్కె మేరకు రాష్ట్రంలో ఉన్నతమైన మంత్రి పదవిని నాగబాబుకు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆరు రోజులైంది. దీంతో నాగబాబు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి ఆయనకు కేటాయిస్తారనే చర్చగా తీవ్రంగా జరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో బాగా ఆదాయం వస్తున్న శాఖలు రెండు ఉన్నాయి. ఈ రెండు శాఖలు కొల్లు రవీంద్ర వద్ద ఉండటం విశేషం. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, గనుల శాఖల మంత్రిగా ఆయన ఉన్నారు. ఈ రెండు శాఖల్లో నుంచి గనుల శాఖను వేరు చేసి నాగబాబుకు ఇస్తే బాగుంటుందనే ఆలోచన సీఎం చేసినట్లు సమాచారం. ఈ శాఖను కేటాయించడం ద్వారా పవన్ కల్యాణ్ లో కూడా సంతృప్తి ఉంటుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. పవన్ కల్యాణ్, నాగబాబులు సినీ రంగానికి సంబంధించిన వారు కావడంతో సినిమా టోగ్రఫీ మంత్రిగా ఇస్తారని, దాదాపు ఈ శాఖ ఖాయమైందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఈ శాఖ ఉంది. సినిమా టోగ్రఫీ మంత్రిత్వ శాఖతో పాటు టూరిజం శాఖ కూడా దుర్గేష్ వద్ద ఉంది. ఈ రెండు శాఖలను వేరు చేసి సినిమా టోగ్రఫీ నాగబాబుకు ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా సీఎం చేశారనే ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ వారి వద్దనే సినిమా టోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఉన్నందున దానిని జనసేనలోని మరొకరికి తీసుకోవడం పవన్ కల్యాణ్ కు ఇష్టం లేదని పలువురు జనసేన నాయకులు చెబుతున్నారు.

అన్ని కోణాల్లో పరిశీలించి గనుల శాఖను నాగబాబుకు ఇవ్వాలనే ఆలోచనకు సీఎం వచ్చినట్లు సమాచారం. పలు రకాల క్వారీలు అన్ని పార్టీలకు సంబంధించిన వారివి ఉన్నాయి. లీజులకు ఇచ్చే విషయంలోనూ, తవ్వకాల విషయంలోనూ మనిషిని బట్టి పోవాలే తప్ప ఏకపక్షంగా పోతే బాగుండదనే ఆలోచన కూడా చంద్రబాబులో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు క్వారీల యజమానులు చందాలు ఇస్తారనే విషయం మరిచి పోకుండా ఉండాలని, అందుకే గనుల శాఖను కొల్లు రవీంద్ర వద్ద ఉంచినట్లు సమాచారం. నాగబాబుకు గనుల శాఖను కేటాయిస్తే మంత్రిత్వ శాఖ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండాలనే అంశాలను ముందుగానే ఆయనకు చెప్పి భవిష్యత్ లో ఎటువంటి సమస్యలు రాకుండా అడుగులు వేయాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడైనా గనులకు లీజులు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి నోటీస్ కు తీసుకొస్తే సరిపోతుందని, ఒక మంచి శాఖను నాగబాబుకు ఇచ్చారనే అభిప్రాయం కూడా జనసేన అభిమానుల్లో తీసుకు వచ్చిన వారం అవుతామని టీడీపీ వారు ఆలోచిస్తున్నారని సమాచారం. నాగబాబుకు మరో నాలుగు రోజుల్లో మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశం ఉంది.

Tags:    

Similar News