కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ వంతెన పొడవెంతో తెలుసా?

కృష్ణా నది బ్యారేజీ పై భాగాన 5.22 కి.మీ పొడవున ఐకానిక్ తీగెల వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం నమూనాను ఆమోదించింది.

Update: 2025-09-18 13:27 GMT

అమరావతి అభివృద్ధి ప్రక్రియలో భాగంగా కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెన డిజైన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి-హైదరాబాద్ మధ్య దూరం 35 కిలోమీటర్లు తగ్గనుంది. ప్రాజెక్టు వ్యయం రూ. 2,500 కోట్లుగా అంచనా వేశారు. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా, అమరావతిని ఒక టూరిజం హబ్‌గా మార్చే సామర్థ్యంతో ఉంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఆర్థిక కార్యకలాపాలను పెంచడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

స్పెషల్ పర్పస్ వెహికిల్ లో భాగంగా...

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 19న సీఆర్‌డీఏ అధికారులకు ఇచ్చిన సూచనల మేరకు ఐకానిక్ బ్రిడ్జ్‌తో పాటు ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడుతుంది. సెప్టెంబరు 3న సీఆర్‌డీఏ సమావేశంలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ వంటి ప్రాజెక్టులకు నిధులు, నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగ పడుతుంది.

ప్రజా ఓటింగ్ తో వంతెన డిజైన్ ఎంపిక

ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ఓటింగ్‌కు పెట్టింది. అన్నింటి కంటే ఎక్కువగా దాదాపు 14 వేల వరకు రెండో ఆప్షన్‌కు ఓట్లు పడ్డాయి. దీనివైపే సీఎం కూడా మొగ్గు చూపారు. ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధమైంది. అమరావతిలోని ఎన్‌13 రోడ్డును ఎన్‌హెచ్‌65 (విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి)తో అనుసంధానించనున్నారు. రూ.2,500 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.

కూచిపూడి నృత్య భంగిమతో..

ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీని నమూనా రూపొందించారు. స్వస్తిక హస్త రూపంలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్‌ ఇది. నమూనాలో స్థానికతకు పెద్దపీట వేశారు. నిప్పన్‌ కోయి లిమిటెడ్‌.. డీపీఆర్‌ను తయారు చేసింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనను ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు వైపులా కాలి బాటలు ఉంటాయి. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల ఎన్‌హెచ్‌-65 వద్ద ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు వరకు 5.22 కి.మీ. పొడవున కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 2019లో అప్పటి తెదేపా ప్రభుత్వం రూ. 1,387 కోట్లతో ఎన్‌10 నుంచి పవిత్ర సంగమం వరకు ఐకానిక్‌ వంతెనకు శంకుస్థాపన చేసింది. తర్వాత వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం స్థలం మార్చింది. పశ్చిమ బైపాస్‌ నిర్మాణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్‌హెచ్‌-65 వద్ద ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌

ఎన్‌హెచ్‌-65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కి.మీ. మేర దూరం ప్రయాణించాలి. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మీదుగా రావాల్సి ఉంది. ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఐకానిక్‌ వంతెన రాకతో ట్రాఫిక్‌ సమస్యలు తప్పుతాయి. మూలపాడు నుంచి 5 కి.మీ. దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి అడుగుపెట్టొచ్చు. దీని వల్ల 35 కి.మీ. దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి వద్ద వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు, ఇటు హైదరాబాద్‌ వైపు మారేందుకు ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మించనున్నారు.

Tags:    

Similar News