తిరుమలలో ఇదేనా.. మాకు ప్రాధాన్యత? ఉత్తరాది యాత్రికుల అసంతృప్తి

అన్ని పారదర్శకంగానే చేశాం. పది రోజుల్లో ఎప్పుడైనా రావచ్చన్న టీటీడీ ఈఓ

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-05 10:07 GMT

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల జారీలో ప్రాధాన్యత ఇవ్వలేదని ఉత్తరాది రాష్ట్రాల యాత్రికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ డిప్ పద్ధతిలో రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల యాత్రికులకే మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. వివక్ష ప్రదర్శించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీటీడీకి ఈ-మెయిల్స్ (E-mails), కాల్ సెంటర్ కు ఫోన్లు కూడా చేస్తున్నారు.

"ఈ అభిప్రాయం సరైంది కాదు. పారదర్శకంగా టోకెన్లు జారీ చేశాం" అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ మెయిళ్లు, ఫోన్లు వచ్చిన విషయాన్ని తిరుమలలో శుక్రవారం ఉదయం నిర్వహించిన "డయల్ యువర్ ఈఓ" కార్యక్రమంలో సింఘాల్ స్వయంగా వెల్లడించారు.

వైకుంఠ ద్వారా దర్శనం..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి గత నాలుగేళ్లుగా పది రోజులపాటు దర్శనాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగానే 2025 డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, 2026 జనవరి ఒకటో తేదీ కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ సంవత్సరం జనవరిలో కూడా తిరుపతి తో పాటు తిరుమల లో 10 కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేశారు. 300 రూపాయల ఎస్ఎస్డీ టికెట్లతో పాటు శ్రీవాణి కోటాలో 10,500 టికెట్ కూడా ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీ వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటుచేసిన కౌంటర్లలో ప్రధానంగా బైరాగిపట్టెడ, టిటిడి శ్రీనివాసం యాత్రికుల సముదాయం వద్ద జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మరణించిన విషాద ఘటన నేపథ్యంలో టీటీడీ అధికారులు దీనిపై సుదీర్ఘంగా సమీక్షించారు.
పారదర్శకత కోసమే ఆన్లైన్
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో తొక్కిసలాట, గంటల పాటు నిరీక్షణకు ఆస్కారం లేకుండా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సారధ్యంలోని పాలకమండలి మూడు రోజుల దర్శనాలకు మాత్రమే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చింది. దీంతో సుమారు 24 లక్షల మంది యాత్రికులు పేర్లు నమోదు చేసుకున్నారు. లక్కీ డిప్ ద్వారా 1.70 లక్షల మందికి ఈ నెల 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు టోకెన్లు జారీ అయ్యాయి. టోకెన్లు దక్కని యాత్రికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జరిగింది ఇదీ.
ఉత్తరాదిన అసంతృప్తి ఎందుకు?
తిరుమలలో మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు తమకు ప్రాధాన్యత దక్కలేదని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యాత్రికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాటల ద్వారా వెల్లడైంది. మూడు రోజుల దర్శనాలకు జారీ చేసిన 1.70 లక్షల టోకెన్లలో ఏపీ, తెలంగాణా, తమిళనాడు ఆ తరువాత కర్ణాటక ప్రాంత యాత్రికులే ప్రాధాన్యం ఇచ్చారనేది ఉత్తరాది రాష్ట్రాల యాత్రికుల అభియోగం. 
ఇది కాస్త పక్కకు ఉంచితే.. టీటీడీ చరిత్రలో మొదటిసారి 1993 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే నెల నుంచి 2020 వరకు ఈఓగా పనిచేశారు. 2022 డిసెంబర్ లో కూడ 12 రోజులు అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2025 సెప్టెంబర్ ఎనిమిదో తేదీ మూడోసారి ఆయన ఈఓగా బాధ్యతలు చేపట్టారు.
ఈ చర్చ ఎందుకంటే..
టీటీడీ ఈఓగా 2017లో సింఘాల్ నియమితులైనప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మొదట విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అభ్యంతరం లెవనెత్తారు. ఆగమ శాస్త్రాలు తెలియని, నియమాలు తెలియని వారిని ఎలా నియమిస్తారనేది ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
టీటీదీ ఈఓగా ఉత్తరాది అధికారిని నియమించడంపై జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్ కూడా అభ్యంతరం చెప్పడం అగ్నికి ఆజ్యం పోసింది. స్వరూపానంద స్వామికి పరోక్షంగా మద్దతు తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడం మరింత రగిలింది.
"ఉత్తరాదిలోని ఏ ప్రముఖ ఆలయంలో దక్షిణాది అధికారులు లేరు.. అమరనాథ్, వారణాసి, మధుర చరిత్రలో ఒక్కసారైనా దక్షిణాది అధికారికి అవకావం ఇచ్చారా?" అలాంటప్పుడు బీహార్ కు చెందిన ఏపీ క్యాడర్ అధికారిని ఎలా నియమించారని  ఆ నాటి టీడీపీ ప్రభుత్వాన్ని వన్ కల్యాణ్ ట్వీట్ లో ప్రస్తావించిన నేఫథ్యంలో  అనవసర వివాదం తెరమీదకు తెచ్చారు. దీంతో టిటిడి ఉద్యోగులు కూడా అభ్యంతరాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఐఏఎస్ అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రాష్ట్రంలో ఆయన స్థానికుడుగానే పరిగణించాలి. ఇందులో వివాదాలకు ఆస్కారం ఉండకూడదు. ఈ విషయాలపై గతంలో ప్రభుత్వం స్పందించడంతో అనిల్ కుమార్ సింగల్ నియామకంపై ఏర్పడిన వివాదం చల్లబడింది. ఆయన కూడా టీటీడీ ఈవో గా మొదట్లో సమర్థవంతమైన అధికారి గానే పేరు తెచ్చుకున్నారు.

 కూటమి పాలనలో..

టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ అనిల్ కుమార్ సింగాల్ రెండోసారి (రెగ్యులర్) టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఆన్లైన్ టికెట్ల జారీ ప్రక్రియ నిర్వహించారు. ప్రాంతం, రాష్ట్రం అనే తారతమ్యాలు ఏమాత్రం లేకుండా టీటీడీ వెబ్సైట్, వాట్సాప్, ఏపీ గవర్నమెంట్ వాట్స్అప్ లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి దరఖాస్తుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో కూడా తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ కన్నడ భాషల్లో దరఖాస్తు చేసుకునేందుకు కూడా వెబ్ సైట్లు అందుబాటులో ఉంచారు.
మా ప్రాంతీయుడే కదా..
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సాధారణంగానే ఆ ప్రాంత ప్రజలకు ఆయన మా అధికారి అనే ఒక ప్రత్యేక గౌరవం, తమకు ప్రాధాన్యత దక్కవచ్చు అనేది సగటు మనిషిలో ఉండే ఆలోచనే ఉత్తరాది వారికి కూడా ఉండడంలో అభ్యంతరం ఏమీ లేదు. సొంత ప్రాంతానికి మరింత మేలు చేస్తారని ఊహ కూడా ఉండడంలో తప్పులేదు. ప్రాంతీయ అభిమానం ఉండడం సహజం.
సమస్య ఏమిటి?
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి దరఖాస్తు చేసుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యాత్రికులకు టోకెన్లు తక్కువగా వచ్చాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
"ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రాల యాత్రికులకు మాత్రమే ఎక్కువ టోకెన్లు దక్కాయి" అనేది ఉత్తరాది రాష్ట్రాల యాత్రికుల ఆవేదన, ఆరోపణ కూడా.
తిరుమలలో మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో 1.78 లక్షల మందికి మాత్రమే వాట్సప్ మెసేజ్ లు అందాయి. ఇందులో నాలుగు రాష్ట్రాల వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యాత్రికుల ఆరోపణ.
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పిన మాటల ప్రకారం..
"ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్దగా సంఖ్యలో ఈ మెయిల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. ఆ ప్రాంతం వారికి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు తక్కువ దక్కాయి" అని వినతులు వస్తున్నాయి అని ఏవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
ఈ విషయాలపై ఆయన వివరణ ఇస్తూ,

"దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో లింకులు అందుబాటులో ఉంచాం. అందిన దరఖాస్తుల్లో రాండమ్ (Random ) గా డిప్ ద్వారా మాత్రమే ఎంపిక జరిగింది. ఇందులో ఎలాంటి వివక్ష, కొందరికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పడం ఏమాత్రం వాస్తవం కాదు" అని ఈవో సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలో సాధారణంగా వైకుంఠ ఏకాదశి నాడు రెండు రోజుల మాత్రమే ద్వారాలు తెరిచి ఉంచేవారని ఆయన గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి పది రోజులపాటు అందుబాటులో ఉంచుతున్నాం అని చెబుతూ,
"వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు మాత్రమే కాదు. శ్రీవారు కొలువైన క్షేత్రంలో పది రోజుల్లో కూడా శుభ ఘడియలే" అని సూచన చేసిన ఈఓ అనిల్ సింఘాల్ అపోహలు పెట్టుకోవద్దని ఆయన హితవు పలికారు.
నిరీక్షణ లేకుండా..
"2026 జనవరి రెండవ తేదీ నుంచి సామాన్య యాత్రికులకు భారీగానే వచ్చిన గంటల తరబడి నిరీక్షించకుండా త్వరగా దర్శనం చేయించడానికి ఏర్పాటు చేశాం. టీటీడీ యంత్రాంగం కూడా అందుకు సంసిద్ధమయింది" అని ఈవో సింఘాల్ స్పష్టం చేశారు. శ్రీవారి సన్నిధిలో భక్తులందరూ సమానమే అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుపతిలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని యాత్రికుల భద్రత, శ్రీవారి చెంత మంచి దర్శనం, టోకెన్ల జారీ చేయడానికి పారదర్శక విధానం అమలులోకి తెచ్చామని ఆయన స్పష్టం చేశారు.
ఇదేనా స్థానికులకు ప్రాధాన్యత..?
వైకుంఠ ద్వార దర్శనాల్లో తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని స్థానికులకు ttd ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఆధార్ కార్డు ఆధారంగా టోకెన్ గతంలో జారీ చేశారు. ఈ సంవత్సరం మాత్రం 2026 జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాల వారికి 4,500, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఇవి జనవరి 10వ తేదీన ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఒక్కో వ్యక్తికి వన్ ప్లస్ త్రీ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.
ఈ విధానం పైన కూడా తిరుమలలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవోలో తిరుపతికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక సీనియర్ సిటిజన్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. తిరుపతి, తిరుమల స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
"వైకుంఠ ఏకాదశికి లోకల్ వ్యక్తులకు ప్రాధాన్యత లేకుండా చేశారు. తరతరాలుగా ఇక్కడ పుట్టి, ఇక్కడ జీవిస్తున్న వారంతా శ్రీవారి సేవ చేస్తున్నారు. స్వామి చెంత బతుకుతున్నాం. దేశవిదేశాల్లోని వారికి ప్రాధాన్య ఇచ్చే టిటిడి తిరుమల, తిరుపతి స్థానికులకు ఎందుకు ఇవ్వడం లేదు" అని కూడా చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.
"వైకుంఠ ఏకాదశి కాకుండా చివరి మూడు రోజులు కేటాయించడం చాలా అన్యాయం. స్థానికులకు ప్రాధాన్యతలు లేకుండా చేయడమే" అని చంద్రశేఖర్ రెడ్డి అసంతృప్తి చెందారు.
164 గంటలు సామాన్యులకే..
తిరుమల శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశాల్లో సామాన్యులు, స్థానికులకు 164 గంటల సమయం కేటాయించామ అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చంద్రశేఖరరెడ్డి, ఆ తరహా ఆలోచనలు ఉన్న వారికి సమాధానం చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు అంటే పది రోజులు 182 గంటలపాటు శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు సమయం ఉంటుంది. అందులో 164.15 గంటల సమయాన్ని సామాన్య యాత్రికులకే కేటాయించిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు.
"వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే కాదు. పది రోజులు శుభ ఘడియలే. కాబట్టి సామాన్య యాత్రికులు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం" అని ఈవో సింఘాల్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News