టీడీపీ సీనియర్లలో అలజడి

నామినేటెడ్‌ పదవులు దక్కడం లేదనే ఆందోళనలు టీడీపీ సీనియర్‌ నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

Update: 2024-07-30 09:54 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుల్లో అలజడి నెలకొంది. నామినేటెడ్‌ పదవులు త్వరలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో సీనియర్లు తమకు పదవులు దక్కుతాయో, దక్కవో అనే ఆందోళనల్లో ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి నామినేటెడ్‌ పోస్టులను విభజించుకున్నారు. ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలో మాట్లాడి ఫైనల్‌ చేశారు. ఏ క్షణంలోనైనా నామినేటెడ్‌ పదవులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలనుకునే వారి జాబితాను పార్టీకి అందజేయాల్సిందిగా పార్టీ అధి నాయకత్వం ఆదేశించింది.

పార్టీలో చాలా మంది కొత్త వారికి ఎన్నికల్లో అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పదిహేడు మంది నూతనంగా ఎన్నికైన నాయకులకు మంత్రి పదవులు దక్కాయి. ఎమ్మెల్యేల్లోను యువకులైన కొత్త వారు ఎక్కువుగా ఉన్నారు. వీరంతా సీనియర్లను పట్టించుకోవడం లేదని, వారి సహచరులు, మిత్రులకు మాత్రమే అన్నింటిల్లోను అవకాశాలు కల్పిస్తున్నారనే ఆవేదన సీనియర్లలో ఉంది.
పార్టీ టిక్కెట్లు దక్కపోయినా, నామినేటెడ్‌ పోస్టులైనా దక్కుతాయని చాలా మంది సీనియర్‌ నాయకులు ఆశతో ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి తమ పేర్లను నామినేటెడ్‌ పోస్టులకు సిఫార్సు చేయలేదని సమాచారం అందుకున్న నాయకులు నేరుగా సీఎం చంద్రబాబు వద్ద తమ ఆవేదనను వెలుబుచ్చినట్లు తెలిసింది.
ప్రతి శనివారం సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి హాజరవుతున్నారు. మంత్రులు కూడా రోజుకు ఒకరు చొప్పున పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. పార్టీలో ఇంత కాలం పని చేసిన తమకు కనీసం నామినేటెడ్‌ పోస్టులు కూడా ఇవ్వకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. తమ పేర్లు మీడియాలో రావడానికి ఇష్ట పడని ఇద్దరు సీనియర్‌ నాయకులు ఫెడరల్‌తో మాట్లాడుతూ దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నామని, తమకు ఎమ్మెల్యేలుగా అవకాశం రాక పోయినా, కనీసం నామినేటెడ్‌ పోస్టుల్లో చాన్స్‌ వస్తుందని ఆశపడ్డామని, ఇప్పుడు అది కూడా అందే అవకాశం కనిపించడం లేదని ఆవేదన వెలుబుచ్చారు.
ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకొని ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో సంబంధం లేకుండా కొంత మందికైనా నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని నేరుగా పార్టీ అధిష్టానమే బయోడేటాను తీసుకొని పరిశీలించి అర్హులైన వారికి అవకాశం కల్పిస్తే పార్టీలోని సీనియర్‌ నాయకులకు ఖచ్చితంగా నామినేటెడ్‌ పోస్టులు దక్కుతాయని చెబుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సీనియర్ల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారా? లేక ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులకే అవకాశం కల్పిస్తార అనేది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News