కూటమిలో కొట్లాట..రాయుడు హత్య వెనుక కుట్రా? రాజకీయమా?
శ్రీకాళహస్తి టీడీపీ, జనసేన నేతల మధ్య ఏమి జరిగింది? డ్రైవర్ హత్య వెనుక కారణం ఏమిటి?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-13 08:26 GMT
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో టీడీపీ, జనసేన నేతల ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరింది.
శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన బహిష్కృత ఇన్చార్చి వినూత కోట మధ్య రాజకీయ శత్రుత్వం బయటపడింది.
ఒంటికాలిపై యుద్ధానికి సిద్ధం అన్నట్లు వ్యవహరించిన కోట వినూత దంపతులకు ఇంటా, బయట కూడా మద్దతు దక్కని స్థితిలో ఒంటరి అయినట్లే కనిపించింది.
కారు మాజీ డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య ఘటన నేపథ్యంలో కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తోపాటు మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన వెనుక విస్తుపోయే విషయాలు తెరమీదకు వచ్చాయి. ఈ ఘటనను కాస్త పక్కకు ఉంచితే..
చెన్నైలో కోర్టు వద్ద వినూత, ఆమె భర్త చంద్రబాబు
హత్య వెనుక విభిన్న కథనాలు
"వినూతతో సన్నిహితంగా ఉన్నకారణంగానే హత్య జరిగింది" అనేది ప్రత్యర్థుల ఆరోపణ
"తమ వద్ద పనిచేస్తూ మరో వ్యక్తికి శ్రీనివాసులు సమాచారం చేరవేస్తున్నాడు"
"కొన్ని వీడియోలు, ఫోటోలు రాజకీయ విరోధికి పంపించిన శ్రీనివాసులు ద్రోహం చేశాడు" అనేది వినూత అభియోగం.
చెన్నె పోలీసులు అరెస్టు చేసిన తరువాత వినూత, చంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ ద్వారా అందులో కొన్ని మాటలు ధృవీకరిస్తున్నాయి.
దీనికి ఊతం ఇచ్చే విధంగా..
"కారు డ్రైవర్ శ్రీనివాసులు పాడె మోస్తా" అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎందుకు అన్నట్లు?
ఎఫ్ఐఆర్, నిందితుల ఫోటోలు మీడియా సమావేశంలో విడుదల చేసిన ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లేనా?
కూటమిలో కొట్లాట ఎందుకు?
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటకు చెందిన కోట వినూత, బంగారుపాలెంకు చెందిన ఎన్నారై చంద్రబాబుతో వివాహం జరిగింది. అప్పటికే చంద్రబాబుకు జనసేన పవన్ కళ్యాణ్ తో పరిచయం ఉండడం వల్ల ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా మారారు. పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా వెనుకడుగు వేయలేదు. రేణిగుంటలోని వారి నివాసం పై దాడి జరిగిన నేపథ్యంలో
"జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చారు. వినూత దంపతులను పరామర్శించారు. తిరుపతికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు"
ఈ సంఘటనతో వారి పాపులారిటీ పెరగడమే కాదు. ధైర్యం కూడా పెంచారు. మరింత ఉత్సాహంగా పనిచేసిన వినూత చంద్రబాబు దంపతులు అనేక నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నారు.
2019 ఎన్నికల్లో ఎన్ఆర్ఐ కోటా కింద చంద్రబాబు తన భార్య వినూతకు జనసేన టికెట్ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5000 ఓటు లభించాయి.
2024 ఎన్నికల్లో టిడిపి కూటమిలో భాగస్వామిగా మారిన జనసేన తిరుపతి తో పాటు శ్రీకాళహస్తి, మదనపల్లి అసెంబ్లీ స్థానాల కోసం పట్టు పట్టింది. శ్రీకాళహస్తి నుంచి కోట వినూత పేరు ప్రముఖంగా వినిపించింది. బిజెపికి కేటాయిస్తే కోలా ఆనంద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కొడుకు కూడా తనకే టికెట్ దక్కుతుందని ధీమాతో ఉన్నారు. దీంతో టికెట్ ఎవరికి ఇవ్వాలని విషయంలో ప్రతిష్ట ఏర్పడింది. జనసేన నుంచి పోటీ చేయాలని చివరి వరకు కోట వినూత ప్రయత్నించారు.
"బొజ్జల సుధీర్ రెడ్డి (ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే) కి టికెట్ ఇస్తే పనిచేసేది లేదు" అని కూడా ఓ సందర్భంలో కోటా వినూత దంపతులు స్పష్టం చేశారు. టిడిపి టికెట్ కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే scv నాయుడుతో వారు గొంతు కలిపారు. దీంతో స్థానిక జనసేన, టిడిపి నాయకుల మధ్య అంతరం ఏర్పడింది. చివరికి టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ రావడంతో గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనసేన బహిష్కృత నేతలు కోట వినుత -చంద్రబాబు దంపతుల మధ్య సఖ్యత కుదరలేదు. రోజురోజుకు మరింత అంతరం పెరిగింది.
తండ్రి పదవి కోసం పట్టు
ఈ పరిస్థితుల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవికి టిడిపి నేత పేరును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
దీనికి అడ్డుపడిన కోట వినూత ఆ పదవి తన తండ్రి ల్యాబ్ భాస్కర్ కు ఇవ్వాలని జనసేన ద్వారా ఒత్తిడి తెప్పించారు. ఇప్పటికీ ఆ పదవి భర్తీ కాలేదు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి పనికి కోట వెనుక అడ్డుపడి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం కాస్త పార్టీలకంటే వ్యక్తుల మధ్య పోరాటంగా మారిపోయింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వినుత దంపతుల మధ్య వివాదాలు రోజురోజుకు పెరిగిపోయాయి.
డ్రైవర్ బలి
వెంకటగిరి నియోజకవర్గానికి సమీపంలోని తోలుమెట్ట గ్రామానికి చెందిన వెంకట రాముడు , గీత దంపతుల కొడుకు శ్రీనివాసులు (రాయుడు). ఇతనికి ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో
శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ రాజేశ్వరి వద్దకు సోదరితోపాటు శ్రీనివాసులు చేరారు.
ఆ తర్వాత లోకజ్ఞానం తెలిసే యువకుడిగా ఎదిగిన శ్రీనివాసులుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. శ్రీనివాసులు అభిమానాన్ని గమనించిన జనసేన బహిష్కృత నేత కోట వినూత దంపతులు శ్రీనివాసులును చేరదీశారు.
శ్రీనివాసులను కారు డ్రైవర్ గానే కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా ప్రతి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తూ వారి వద్ద 15 సంవత్సరాలుగా నమ్మిన బంటుగా మారాడు.
మలుపు తిరిగిన వ్యవహారం
జనసేన బహిష్కృత నేతలు కోట వినూత, చంద్రబాబు దంపతులు శ్రీనివాసులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారిని కాళహస్తి ప్రాంతంలో ప్రచారం ఉంది. అతని వాలకంపై సందేహం రావడంతో పక్కకు ఉంచేశారు.
శ్రీకాళహస్తిలో వినిపిస్తున్న మాట ఏందంటే
"తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి శ్రీనివాసులు స్పైగా మారాడు. డబ్బు ఆశ చూపడంతో మా సమాచారం ఎమ్మెల్యేకి అందిస్తున్నాడు" అని కూడా కోట వినూత ఆరోపించారు.
కారు మాజీ డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో చెన్నై పోలీసులు కోట వినుత, చంద్రబాబుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసింది. వారిని కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో కూడా..
"దీని వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహారం తేలుతుంది" అని కోట వినూత వ్యాఖ్యానించారు.
హత్య కేసులో అరెస్టు అయిన వారు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఆరోపించారు
చెన్నై పోలీస్ కమిషనర్ ఏ. అరుణ్ మీడియాతో మాట్లాడుతూ..
"గుర్తుతెలియని యువకుడి శవం ఎవరిదని విషయంలో దర్యాప్తులో తేలింది. నిందితులు కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు మాటల ప్రకారం న్యూడ్ ఫోటోలు వీడియోలు బ్లాక్ మెయిలింగ్ కు గురయ్యారు" అని చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ చెప్పారు.
హత్యతోపాటు దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే వ్యవహారంలో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎమ్మెల్యే సుధీర్ ఎందుకు స్పందించారు?
శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేతలు కోట వినూత, చంద్రబాబు దంపతుల అరెస్టుపై టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.
పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోలు. ఎఫ్ఐఆర్ కాపీ మీడియాకు ఎమ్మెల్యే విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
"శ్రీనివాసులు భౌతిక కాయం కాళహస్తికి తీసుకురాగానే గ్రామానికి నేను వెళతా. స్వయంగా పాడే మోస్తా" అని ప్రకటించారు.
టిడిపి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన బహిష్కృత నేతలపై అక్కసు వెళ్ళగక్కడం ద్వారా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అకారణంగా కీలక అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
తిరుపతి జనసేన ఎమ్మెల్యేఆరణి శ్రీనివాసులు, సీనియర్ నాయకుడు కూడా స్పందించలేదు. వినుతను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించడం ద్వారా చేతులు దులుపుకున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు టిడిపి కూటమిలో ఎలా పరిణమించబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే.