PAWAN KALYAN | కల్యాణ్ సలహా ఇచ్చారా? చురకలు వేశారా?

విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాల్సిన అవసరాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆయన మళ్లీ మాటల తూటాలు పేల్చారు.;

Update: 2024-12-08 06:17 GMT

దేశం బాగుండాలంటే పెట్టుబడి పెట్టాల్సింది కాంట్రాక్టర్లపై కాదు. అధ్యాపకులపై, విద్యారంగంపై శ్రద్ధ చూపించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. "ఉపాధ్యాయులకు అధిక జీతాలు రావాలనేది నా ఆశ ఆకాంక్ష. దీనికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉండాలి" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

"ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నా ప్రయత్నం మాత్రం చేస్తా అని పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ లోకానికి హామీ" ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కడప పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు కూటమి ప్రభుత్వంలో మళ్లీ ప్రకంపనలు సృష్టించే వాతావరణ కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై కొరడా పట్టినట్టే కనిపిస్తోంది.
కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

విద్యా రంగానికి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ ఉండాలని వామపక్ష విద్యార్థి సంఘాలు నిత్యం డిమాండ్ చేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలకు అనుకోని అస్త్రం దొరికినట్లే కనిపిస్తోంది.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకముందు, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటలను యధాలాపంగానే చెబుతుంటారు. అనేది ఆయనను దగ్గరగా గమనించే రాజకీయ పరిశీలకులు కానీ, విమర్శకులు చెప్పే మాట. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ అనేక సభల్లో తనదైన శైలిలోనే సాధారణంగా మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు.
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయి. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయ వృత్తులోని వారికి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలని కూడా విద్యార్థులకు పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
ఆ మాటలు కొరడా దెబ్బేనా
వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని ఎన్డీఏ కూటమితో పాటు రాష్ట్రంలోని టిడిపి కూటమికి కూడా సంకటంగా మారే పరిస్థితి కల్పించారు. ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉండవచ్చు. కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నోటి నుంచి వెలువడే మాటలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారుతున్నాయి. ఆయన ఏమన్నారంటే..
"ఇంట్లో అమ్మానాన్న ఇద్దరు బిడ్డలను చూసుకోవాలంటే కష్టపడతారు. అలాంటిది ఓ తరగతి గదిలో 20, 30 మంది విద్యార్థులను సముదాయించి పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు ఎంత ఒత్తిడి తీసుకుంటారో గమనించాలి" అందుకని అధ్యాపకులకు మనం (విద్యార్థులు) సహకరించాలి అని సూచించారు.
పెట్టుబడి కాంట్రాక్టర్లపై కాదు
"అధ్యాపక వృత్తి చాలా కష్టతరమైనది. ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లకు కాదు మనం పెట్టుబడి పెట్టాల్సింది. అధ్యాపకులపై" అని ప్రభుత్వాలకు చురక వేసినట్లే మాట్లాడారు. "విలువలతో కూడిన అధ్యాపకులను బయటకు తీసుకురాగలిగితే ఈ దేశం అద్భుతంగా ఉంటుంది" అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హై పెయిడ్ జాబ్ గా మారాలి
"అధ్యాపక వృత్తి హైయెస్ట్ పెయిడ్ జాబ్ కావాలి" అనేది నా కోరిక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను చెప్పారు. " ఆ రోజు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. నా వంతు ప్రయత్నం చేయడంలో మాత్రం ఎలాంటి లోపం ఉండబోదు" అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. నా వంతు ప్రయత్నం మాత్రం ఉంటుందని ఉపాధ్యాయులకు ఆయన భరోసా ఇచ్చారు.
మొత్తం మీద ఆయన ఉపన్యాసం అనడం కంటే తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వ్యక్తం చేసినట్లు కనిపించింది. విద్యా రంగానికి అధికంగా నిధులు కేటాయించాలనే విషయాన్ని సూటిగా చెప్పారు. తద్వారా మెరుగైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు కూడా శక్తివంతన లేకుండా కృషి చేయగలరనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది.
పవన్ కల్యాణ్ మాటల పర్యవసానం ఎలా ఉండబోతుంనేది చర్చకు తెరతీశాయి. రెండు నెలల కిందట కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా వాస్తవ పరిస్థితిని ఎత్తి చూపించారు. అప్పట్లో ఆయన మాటలు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ అస్త్రంగా వినియోగించుకున్నాయి. తాజాగా కడపలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యానాలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయనేది వేచి చూడాలి.
Tags:    

Similar News