అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు చంద్రబాబు మద్దతా?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసినట్టు చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారా?

Update: 2024-12-19 13:12 GMT
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసినట్టు చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారా? చంద్రబాబు చెప్పిన మాటలు అమిత్ షా వ్యాఖ్యలకు సపోర్ట్ చేసేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి పలు దళిత సంఘాలు. చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసే తరహాలో ఉన్నాయని దళిత సంఘాల నాయకులు పలువురు ఆక్షేపించారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
"సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడినా, వాటిని వక్రీకరించే వారుంటారు" అన్నారు చంద్రబాబు. ఇదే సమయంలో గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటను అన్నట్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. డిసెంబర్ 19న అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. "సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడినా, వాటిని వక్రీకరించే వారుంటారు" అని చంద్రబాబు రాష్ట్ర మంత్రులో అన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటను అన్నట్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారట. ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని చంద్రబాబు అన్నారని తెలిసింది. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ ‌కు తగిన గౌరవం లభించలేదని, అంబేడ్కర్ ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్‌ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేడ్కర్ కి ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబు నిజంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే అవి సమంజసం కాదన్నారు దళిత నాయకుడు విల్సన్. చంద్రబాబు ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా మోదీకి మద్దతు ఇచ్చే విషయమై పునరాలోచన చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంబేడ్కర్ పేరును కొందరు పదే పదే ఉచ్ఛరిస్తున్నారని, దానికి బదులుగా ఏదైనా దేవుడు పేరును ప్రస్తావిస్తే వాళ్లు నేరుగా స్వర్గానికి పోతారని అమిత్ షా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీన్ని బీజేపీ ఖండించింది.
పార్లమెంటు వద్ద కాంగ్రెస్ ఆందోళనలు..
పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేడ్కర్ ను అవమానించేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రతిగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని, అంబేడ్కర్ ను ఏ రోజూ అభిమానించని కాంగ్రెస్ ఈరోజు కపట ప్రేమ చూపిస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు అమిత్ షా అంబేడ్కర్ ను అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై బురదజల్లుతోందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అంబేడ్కర్ పై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదనే విషయం అమిత్ షా వ్యాఖ్యలు సృష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది. అంబేడ్కర్ పేరు ప్రస్తావిస్తూ అమిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరెన్ని మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.
అమిత్ షా రాజీనామా చేయాలంటూ..
అంబేడ్కర్ ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీల ఫిర్యాదుతో రాహుల్‌గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీలు తమపై దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇదే డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. అనేక దళిత సంఘాలు ధర్నాలు చేశాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని నినదించాయి.
Tags:    

Similar News