సీతారాముల వారికి 6 కోట్ల విలువైన వజ్రాల కిరీటాలు
ఒంటిమిట్టలో కోదండస్వామి ఆలయంలో కొలువైన సీతారాముల వారికి ఖరీదైన కిరీటాలను అందజేశారు.;
By : The Federal
Update: 2025-04-11 09:07 GMT
ఆంధ్రప్రదేశ్‌లో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో కొలువైన సీతారామ, లక్ష్మణులకు రూ.6.60 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలు అందజేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పెన్నా సిమెంట్స్ అధినేత పీ ప్రతాప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు కలిసి శ్రీరాముల వారికి ఈ కిరీటాలను విరాళంగా అందించారు. నూతనంగా 7 కేజీల బంగారంతో తయారు చేసిన 3 స్వర్ణ కిరీటాలను ఆలయంలో తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావులకు ఈ కిరీటాలను శుక్రవారం ప్రతాప్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు అందజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి, కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు.
ఒంటిమిట్ట కోదండస్వామి ఆలోయంలో సీతారాముల కళ్యాణ మహోత్సం శుక్రవారం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మహాత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వార్లకు సమర్పించనున్నారు. శుక్రవారం రాత్రి రాముల వారి సన్నిధిలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు స్వాముల వారికి అత్యంత ఖరీదైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాలను బహూకరించడం విశేషం.