అసెంబ్లీ విప్ లకు ఉపసభాపతి రఘు రామకృష్ణరాజు చురకలు

సభ ఆర్డరులో లేకపోవడంతో ఉప సభాపతి రఘు రామకృష్ణ రాజు అసహనం

Update: 2025-09-19 06:51 GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ఉపసభాపతి రఘు రామకృష్ణ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యులందరూ ఎన్డీఏ కూటమికి చెందిన వారే కావడం, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో సభ ఏకపక్షంగా సాగిపోతోంది. అయినప్పటికీ సభ ఆర్డరులో లేకపోవడంతో శుక్రవారం సభాపతి స్థానంలో ఉన్న రఘు రామకృష్ణ రాజు అసహనం వ్యక్తం చేశారు. సభ్యుల్ని పదేపదే ప్రశాంతంగా ఉండాలని హెచ్చరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ తరహా హెచ్చరికలు చేశారు. అయినా ఎవ్వరూ వినలేదు.

ఓ దశలో ఆయన ఒకరిద్దర్ని పేరు పెట్టి పిలిచి మరీ గ్రూపు సమావేశాలు, మీటింగులు ఆపమని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కొణతల రామకృష్ణ ల్యాండ్ బ్యాంకు ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడైతే రెండు మూడు సార్లు సభ్యులకు విప్తి చేశారు. సభలో ఒక సీటు నుంచి మరో సీటు వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారని, ఇది సభామర్యాద కాదన్నారు. అయినా వినలేదు. ఓ దశలో ముచ్చట్లు పెడుతున్న వారందరూ విప్ లేనని, సభ్యుల్ని ఆర్డరులో పెట్టడానికి విప్పులు ఉంటే, విప్పుల్ని అదుపు చేయడానికి ఎవరుండాలన్నారు. ఈ దశలో ఆయన వినుకొండ టీడీపీ సీనియర్ సభ్యుడు ఆంజనేయులు పేరును ప్రస్తావిస్తూ.. కావాలంటే బయటకు వెళ్లి మాట్లాడుకోమని అన్నారు. విప్పులు బయటికి వెళ్లి వ్యూహాల్ని ఖరారు చేసుకుని రమ్మని చెప్పారు.
దీనికి ముక్తాయింపుగా కొణతల రామకృష్ణ మాట్లాడుతూ.. సభ్యుల్ని అదుపు చేయడానికి విప్పులుంటే వాళ్లను అదుపు చేయడానికి అధ్యక్షుడు ఉన్నారంటూ సభా స్థానం వైపు చూడడంతో సభలో నవ్వులు విరిశాయి.
Tags:    

Similar News