వెంటనే వివరాలు ఇవ్వండి.. ఫైల్స్ దగ్దం చేయడంపై డిప్యూటీ సీఎం సీరియస్

విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై పీసీబీ ఫైళ్లు, రిపోర్టులను దగ్దం చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ ఘటనపై వెనక మాస్టర్‌మైండ్ ఎవరైనా వదలొద్దని ఆదేశించారు.

Update: 2024-07-04 13:46 GMT

విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఫైళ్లు, రిపోర్టులను దగ్దం చేయడంపై డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా దగ్దం చేసిన ఫైల్స్, రిపోర్ట్‌లకు సంబంధించిన వివరాలను తక్షణం తనకు అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఆ ఫైల్స్, రిపోర్ట్‌లను ఎవరు కరకట్టపైకి తీసుకెళ్లారని, ఈ ఘటన వెనక ఎవరున్నారన్న పలు అంశాలపై పవన్ కల్యాణ్.. అధికారులను ఆరా తీశారు. దీనికి బాధ్యులు ఎవరైనా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా కార్యాలయాల్లోని ఫైల్స్ భద్రతపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఒక కార్యాలయంలో ఫైల్స్ కరకట్టపైకి చేరి దగ్దమయ్యాయంటే ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత ఏమాత్రం ఉన్నట్లని, మిగిలిన కార్యాలయాల్లోనైనా ఫైల్స్ ఏమాత్రం భద్రంగా ఉన్నాయంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్.

ఏం చర్యలు తీసుకుంటున్నారు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫైల్స్, రిపోర్ట్‌లను భద్రంగా ఉంచడానికి అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలని కోరారు. ఒక్క ఫైల్ కూడా వెరిఫికేషన్ లేకుండా ఆఫీసు దాటకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ భద్రత చర్యలకు సంబంధించి అనుసరిస్తున్న విధానాలు ఏంటో వెల్లడించాలని ఆదేశించారు పవన్. అదే విధంగా ఫైల్స్ ఉండే గదిలోకి ఎవరెవరికి యాక్సెస్ ఉంది అన్న విషయాలను కూడా చెప్పాలని, వీటి భద్రతకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.

ఉద్యోగుల్లో చర్చ

కృష్ణానది కరకట్టపై జరిగిన ఫైళ్ల దగ్దం ఘటనలో సమీర శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉండటం ఎక్సైజ్ శాఖలో చర్చలకు దారితీసింది. ఉద్యోగులంతా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన రామారావు గురించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోని ప్రముఖులకు తాను ఓఎస్డీగా వెళ్తానంటూ ప్రచారం కూడా చేసుకున్నారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. పవన్ కల్యాణ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసుకుంటూ.. పవన్ ఒక్కరే కాకుండా మరికొందరు మంత్రులతో కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు. ముఖ్యుల తెర వెనక వ్యవహారాలను చెక్క బెట్టడంలో రామారావు దిట్ట అన్న ప్రచారం ఎక్సైజ్ శాఖ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. వీటితో పాటుగా శాఖ ఉద్యోగు బదిలీలు, ఆర్ఓఆర్ విషయాల్లో రామారావు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు కూడా రామావుపైన ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఫైళ్ల దగ్దం వెనక మాస్టర్ మైండ్ ఎవరు అనేది కీలకంగా మారింది. ఎవరు చెప్తే ఉద్యోగులు స్వయంగా కలుగజేసుకుని మరీ బస్తాల కొద్దీ ఫైళ్లను కరకట్టపై తగలబెట్టారన్నది కీలకంగా మారింది. ఈ అంశంలో మాస్టర్‌మైండ్ ఎవరనేది వీలైనంత త్వరగా కనుక్కోవాలని, అది ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, పరపతి ఉన్నావారైనా కోర్టు ముందు దోషులుగా నిల్చోబెట్టాల్సిందేనని పోలీసులకు ఆదేశించారు పవన్.

Tags:    

Similar News