జీతంపై మాట మార్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒక మంత్రిగా తనకు ప్రభుత్వం నుంచి చెల్లించే జీతం తీసుకోవడానికి తొలుత ఉవ్విళ్లూరారు. దాని కోసం ఎంతగానో ఎదురు చేశారు. కానీ..

Update: 2024-07-01 14:56 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరో సారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను అందరి లాంటి రాజకీయ నాయకుడిని కాదంటూ స్పష్టం చేశారు. ఎవరైన అధికారంలోకి వస్తే ఎలా సంపాదించాలనే దానిపై దృష్టి పెడుతారు. తాను ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దాని కంటే రెండింతలు ఎలా సంపాదించాలి, రెండు, మూడు ఎన్నికల వరకు దిగులు లేకుండా అయ్యే ఖర్చును ఎలా సంపాదించాలనే అంశంపై గెలిచిన నాటి నుంచి ఆలోచనలు చేస్తుంటారు. దీంతో పాటుగా తమకు వచ్చే జీతాన్ని కూడా వద్దనకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటుంటారు. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పష్టతనివ్వడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో శుభపరిణామని చెప్పొచ్చు.

తన తండ్రి ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి అని, ప్రభుత్వం నుంచి వచ్చే జీతవం విలువ, ప్రాధాన్యతలు ఎలాంటివో తనకు తెలుసని, నెలాఖరు వస్తే దాని కోసం ఎంతగా ఎదురు చూసేవాళ్లమో ఒక సినీనటుడి ఈ స్థాయిలో ఉన్న తనకు అంతా గుర్తుందని గతంలో అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జనసేన పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ సమావేశం నిర్వహించారు. అందులో ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎలా వ్యవహరించాలో తన ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెబుతూ.. తన తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని, ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వారని, దానికి మేము రుణపడి ఉంటామని, అందుకే తాను కూడా ప్రభుత్వం అందించే మొత్తం జీతం తీసుకుంటానని, తర్వాత ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తానని మాట్లాడారు. అంతేకాMýంండా జీతం ఎందుకు తీసుకుంటాననే విషయాన్ని కూడా స్పష్టంగానే వెల్లడించారు. ప్రభుత్వం నుంచి జీతం రూపంలో ప్రజల సొమ్ము తింటున్నాను.. ప్రజలకు బాధ్యతగా పని చేయాలి, జవాబుదారిగా ఉండాలని అనే బాధ్యతను ప్రతిక్షణం గుర్తు చేసుకోడానికి జీతం తీసుకుంటానని వివరించారు. దీంతో పాటుగా జీతం ద్వారా తాను తీసుకునే ప్రతి రూపాయికి ప్రజలకు న్యాయం చేయాలని, ఒక వేళ అలా చేయని పక్షంలో తనను చొక్కా పట్టుకొని నిలదీయాలని.. మా ట్యాక్స్‌ సొమ్ముతో జీతం ఇస్తున్నాం.. నువ్వు ఎందుకు పని చేయడం లేదని తనను నిలదీయాలని.. అందుకు తాను జీతం తీసుకుంటానని ప్రకటించారు. ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్నాను అనే భయంతో తాను ప్రజల కోసం పని చేయాలని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా తాను జీతం తీసుకోవాలా వద్దా అని చాలా సార్లు మధన పడ్డానని, ప్రజలు కష్టపడి ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు జీతం రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి.. జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతో జీతం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు.
నాడు జీతం తీసుకునే అంశంపై పక్కా క్లారిటీగా ఉన్న ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, వాటిపైన సమీక్షలు నిర్వహించే కొద్ది జీతం తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశాన్ని సోమవారం పిఠాపురంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజల సమక్షంలో వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాను మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు జీతం తీసుకోవాలని మనస్కరించడం లేదని వెల్లడించారు. మంత్రిగా జీతం తీసుకొని పని చేయాలని గతంలో అనుకున్నానని, కానీ తన శాఖల్లో నిధులు లేవని, అందుకే జీతం తీసుకోవడానికి మనసు అంగీకరించడం లేదన్నారు. గత నెల జీతానికి సంబంధించిన ఫైల్‌ అధికారులు రెడీ చేశారని, సంతకం పెట్టాలని అడిగారని, తనకు మాత్రం ఆ ఫైల్‌పై సంతకం పెట్టేందుకు మనస్కరించలేదని ప్రజలందరి ముందు వెల్లడించడం గమనార్హం.
Tags:    

Similar News