బుజ్జగించి..బుడ్డోడిని వెంటబెట్టుకొని..డీసీపీ సరిత స్టైలే వేరు

అస్తమానం ఫోన్ చూస్తున్నాడని కుటుంబసభ్యులు మందలించడంతో ఈశ్వర్ ఏడుస్తున్నాడు.

Update: 2025-10-31 06:24 GMT

మొంథా తుపాను సందర్బంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనల గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజయవాడ నగరంలో వీధి వీధి తిరుగుతూ మైక్ లు పెట్టుకొని జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ అడ్మిన్ డీసీపీగా పని చేస్తోన్న కె.జి.వి. సరిత కూడా మొంథా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మొంథా తుపాను నేపథ్యంలో  విజయవాడ గుణదలలోని కొండప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఏడుస్తున్న పదేళ్ల బాలుడిని గమనించి ప్రోత్సహించడం, విధులు నిర్వహిస్తూనే అమ్మతనాన్ని చాటుకోవడం, బాలుడు డీసీపీ సరితకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అటు ప్రజల్లోను, ఇటు అధికార వర్గాల్లోను ఇది చర్చనీయాంశమైంది.

ఈశ్వర్ అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. అస్తమానం ఫోన్ చూస్తున్నాడని కుటుంబసభ్యులు మందలించడంతో ఈశ్వర్ ఏడుస్తున్నాడు. అదే సమయంలో తమ విధుల నిర్వహణలో భాగంగా ఆ ప్రదేశంలో పర్యటిస్తున్న డీసీపీ సరిత ఏడుస్తున్న ఈశ్వర్ ను చూశారు. బాలుడి వద్దకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావ్.. ఎవరు కొట్టారు.. గుడ్ బాయ్ కదా..అని సముదాయించి, బుజ్జగించారు. నీ కోసం ఎంత మంది పోలీసులు వచ్చామో చూడు అని చెప్పడంతో ఆ బాలుడు తన ఏడుపును ఆపాడు. అలా ఆ బుడ్డోడిని దగ్గరు తీసుకొని భుజం తట్టి భవిష్యత్తులో ఏమవుతానని అడిగారు. తాను పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని ఆర్మీ అధికారి అవుతానని బాలుడు చెప్పాడు. దీంతో డీసీపీ సరిత ఆ బాలుడిని శభాష్ అని అభినందించి, కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టకూడదని, ధైర్యంగా ఉండాలని సచించడంతో ఈ బాలుడు పూర్తిగా తన ఏడుపును ఆపేశాడు. అంతటితో డీసీపీ సరిత ఆ బాలుడిని వదిలిపెట్టకుండా తర్వాత పిల్లాడిని తన వెంటపెట్టుకుని కొండప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి మొంథా తుపాను ప్రభావం, పరిస్థితుల గురించి చెబుతూ ఎలా ఉన్నాయో చూపించారు. దీంతో బాలుడు ఈశ్వర్ ఉప్పొంగిపోయాడు. పోలీసులు తనను మరింత ఎంకరేజ్ చేసినట్టు భావించాడు. భావోద్వేగానికి గురైన బాలుడు ఈశ్వర్ ఇక నుంచి ఫోన్ చూడను అని డీసీపీ సరితకి మాటిచ్చాడు. అంతేకాదు లేఖ కూడా రాశాడు. ఇక నుంచి ఫోన్ చూడనని, తన లక్ష్యంపై ఫోకస్ పెడుతానని లేఖ రూపంలో హామీ ఇచ్చాడు.  ఈ హృదయస్పర్శక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీసీపీ సరిత మానవత్వం అందరి మనసులను ఆకట్టుకుంటోంది. ఇది చూడటానికి, వినడానికి చిన్న విషయమే అయినా ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుందని నెటిజెన్లు ప్రశంల జల్లు కురిపిస్తున్నారు. 
ఐపీఎస్ అధికారిణి కె.జి.వి. సరిత ప్రస్తుతం విజయవాడలోని ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా పనిచేస్తున్నారు. ఆమె మహిళా, బాలల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే అధికారిగా ఇప్పటికే ప్రసిద్ధి చెందారు. ఆమె సైకాలజీలో ఎం.ఎస్సీ, లాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా టాపర్‌గా 4 బంగారు పతకాలు సాధించారు. ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ విద్యార్థినిగా అవార్డు అందుకున్నారు. 2010 బ్యాచ్: డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపికయ్యారు. బోధన్, నర్సంపేట, ఏలూరు, గుంటూరు పశ్చిమ ప్రాంతాలలో   SDPO గా సేవలందించారు.అడిషనల్ SP గా సీఐడీలో మహిళా రక్షణ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. ఇటీవలె ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా బాధ్యతలు స్వీకరించారు.
మోటివేషనల్ స్పీకర్ గా డీసీపీ సరిత ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆపరేషన్ స్వేచ్ఛ కింద బాల కార్మిక వ్యవస్థ , వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా దాడులు చేపట్టడంతో పాటుగా అనేక రెస్క్యూ మిషన్లు చేపట్టారు. మానవ అక్రమ రవాణా నివారణపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించారు. సైబర్ సేఫ్టీ గురించి, పిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్‌కు (CSAM) వ్యతిరేకంగా తీసుకున్న చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ మహిళా పోలీస్ అధికారి అవార్డు కూడా అందుకున్నారు.
Tags:    

Similar News