మొంథా తుపాను ముప్పు తప్పింది, గండం గడిచింది

రాష్ట్రాన్ని హడలెత్తించిన మొంథా.. స్కూళ్లకు సెలవుల పొడిగింపు

Update: 2025-10-29 03:10 GMT
తుపాను తీరం దాటిన ప్రాంతం
(కాకినాడ నుంచి జి.పి.వెంకటేశ్వర్లు)
బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా” తుపాన్‌ మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. మరో నాలుగైదు గంటలు అప్రమత్తంగానే ఉండాలి. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11.30 నుంచి 12.30 మధ్యలో ‘మొంథా’ తుపాను పూర్తిగా తీరం దాటినట్టు వాతావరణశాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుపానుగానే కొనసాగనుంది.

‘మొంథా’ ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం అంటే ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ వద్ద మరింత బలహీన పడనుంది. తుపాను ప్రభావంతో గాలుల ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో గాలుల వేగం కొనసాగుతోంది. తీరం దాటిన ప్రాంతాన్ని అంతర్వేదిపాలెంగా చెబుతున్నారు.
తీరందాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చెట్లు కూలిపోవడంతో, విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో అనేక ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి.
ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం ఈ తుపానులో ఒకరు మృతి చెందారు. 13 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. వందలాది ఇళ్లు, షెడ్లు, షాపులు దెబ్బతిన్నాయి. వర్షం తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేస్తారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో 2,500 హెక్టార్లకు పైగా పంటలు ముఖ్యంగా వరి, అరటి, పత్తి – దెబ్బతిన్నాయి. వందల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తీరప్రాంత రహదారులు పలు చోట్ల నీట మునిగి ఉన్నాయి.
సహాయక చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సహాయ పునరావాస కేంద్రాలకు తరలించింది. తుపాను తీరాన్ని తాకిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. ఇవాళ, రేపు కూడా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. 
సుమారు 38,000 మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సహాయక శిబిరాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఫీల్డ్‌లో పని చేస్తున్నాయి. మత్స్యకారులు మరో మూడు రోజులు సముద్రంలోకి వెళ్లొద్దని మరోసారి హెచ్చరించారు.
రవాణా వ్యవస్ధకు అంతరాయం...
తుపాన్‌ ప్రభావంతో 122 రైళ్లు రద్దు కావడమో లేక దారి మళ్లించడమో జరిగాయి. ఓడరేవుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. బస్సుల్ని నిలిపివేశారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో రాత్రి 7 గంటల నుంచే జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ భారీ వాహనాలను ఆపివేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రవాణా వ్యవస్థకు రూ. 800 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. తీరప్రాంత రోడ్లలో అనేక చోట్ల నీరు నిల్వవడంతో రాకపోకలు స్తంభించాయి.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే...
కాకినాడ నుంచి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కరస్పాంటెండెంట్ జీపీ వెంకటేశ్వర్లు అందించిన సమాచారం ప్రకారం.. తుపాన్‌ ప్రస్తుతం బలహీనపడింది సైక్లోనిక్ స్టార్మ్‌ స్థాయికి చేరింది. మరో 6–8 గంటల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాలలో వర్షం బాగా పడుతోంది. ఉధృతంగా గాలులు వీస్తున్నాయి.
గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలలో అతి భారీ వర్షాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, విద్యుత్‌ తీగలు, చెట్ల సమీపంలో తిరగవద్దని, సముద్రతీరానికి వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నట్టు మా ప్రతినిధి తెలిపారు.
తుపాను ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటి మీటర్లు, ఉలవపాడులో 17 సెం.మీ, చీరాలలో 15 సెం.మీ వర్ష పాతం నమోదు అయింది. బుధవారం కోస్తాంధ్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ తీరాల్లో రాత్రి పొడవునా గాలులు, వర్షాలు ప్రజలను వణికించాయి. వర్షం తగ్గినా, పలు గ్రామాలు, పంట పొలాలు నీటిలో మునిగి ఉన్నాయి. విద్యుత్‌ శాఖ బృందాలు పునరుద్ధరణ పనుల్లో బిజీగా ఉన్నాయి.
Tags:    

Similar News