ఉత్తరాంధ్రలో మహానటి సావిత్రికి సాంస్కృతిక నివాళి

ఆమె పేరిట ఆడిటోరియం నిర్మించి అభిమానం చాటుకున్న ఇద్దరు అభిమానులు. వివరాలు

By :  Admin
Update: 2024-10-26 02:00 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ఆ ఇద్దరు స్నేహితులకు మహానటి సావిత్రి అంటే మహా అభిమానం. చిన్నప్పట్నుంచి ఆమె సినిమాలు చూడడం అంటే మహదానందం. అలా వారికి వయసుతో పాటు ఆమెపై అభిమానమూ ముదురుతూ వచ్చింది. తీరిగ్గా ఎప్పుడు కలిసినా సావిత్రి నటనా కౌశలం గురించే ముచ్చటించుకునే వారు. సావిత్రి చనిపోయాక ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా చేయాలని అనుకునే వారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ ఆలోచనను అమలు చేయలేక పోయారు. కొన్నాళ్లకు ఇద్దరూ పదవీ విరమణ చేశారు. ఇంతలో ఓ మిత్రుడు కన్ను మూశాడు. అయితేనేమి? భర్త సంకల్పాన్ని నెరవేర్చడానికి అతని భార్య ముందుకొచ్చారు. దీంతో వారిద్దరూ సావిత్రి పేరిట ఓ సాంస్కృతిక కల్యాణ వేదిక నిర్మించాలని నిర్ణయించారు. ఆ లక్ష్యం ఇప్పుడు కళ్లెదుట సాక్షాత్కారమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సావిత్రి పేరిట మరెక్కడా లేని ఆ వేదిక ఎక్కడుందంటే..?

ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లికి చెందిన గెడ్డం వెంకటేశ్వర గాంధీ, పీఎలపురానికి చెందిన నాగం కామేశ్వరరావులు స్నేహితులు. గాంధీ విద్యా శాఖలో, కామేశ్వరరావు విద్యుత్ శాఖలోనూ పనిచేసే వారు. వీరికి మహానటి సావిత్రి అంటే చెప్పలేనంత పిచ్చి. సావిత్రి చనిపోయాక ఆమె పేరిట చిరస్థాయిలో నిలిచిపోయేలా ఏం చేస్తే బాగుంటుందని పదేపదే ఆలోచించే వారు. పదవీ విరమణ చేసిన కొన్నాళ్లకు కామేశ్వరరావు మరణించారు. ఆయన వర్ధంతికి వెళ్లిన గాంధీ కామేశ్వరరావు భార్య వెంకటలక్ష్మితో సావిత్రి గురించి కామేశ్వరరావు కన్న కలల గురించి గుర్తు చేశారు.

 

ఆమె కూడా తన భర్త అదే విషయాన్ని చెబుతుండే వారని చెప్పారు. తన భర్తకే కాదు.. తనకూ సావిత్రి అంటే బోలెడంత అభిమానం అని.. ఆయన ఆశయాన్ని బతికించడానికి సిద్ధమని పేర్కొన్నారు. దీంతో మహానటి సావిత్రి సాంస్కృతిక కల్యాణ వేదిక నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అందుకవసరమయ్యే స్థలం కోసం వెంకటలక్ష్మి తాము నివాసం ఉండే కొరుప్రోలులో అన్వేషించారు. కానీ అక్కడ లభ్యం కాలేదు. ఈసారి ఆ బాధ్యత గాంధీ తీసుకున్నారు. తాముంటున్న ఊరికి సమీపంలోని నామవరం గాంధీనగరంలో సుమారు 500 గజాల పంచాయతీ స్థలం కోసం ప్రయత్నించి సఫలీకృతం అయ్యారు.

2022లో వేదికకు ముహూర్తం...

మహానటి సావిత్రి సాంస్కృతిక వేదిక నిర్మాణానికి సుమారు రూ.36 లక్షలు అవసరమవుతుందని అంచనా వేశారు. 2022 జూన్ 10న ముహూర్తం పెట్టి శంకుస్థాపన చేశారు. వీరిద్దరూ తమ వంతు నిధులను సమకూర్చారు. మరికొంత సొమ్మును ఇతర దాతలు ఇచ్చారు. దీంతో సావిత్రి ఆడిటోరియం 80 శాతం పూర్తయింది. మిగిలిన నిధులు కూడా దాతలు సమకూరుస్తుండడంతో త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ వేదికను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

వేదిక నిర్మాణానికి దేనికెంత ఖర్చు?

+ కల్యాణ మండపానికి రూ.10 లక్షలు.

+ దీనికి అనుబంధంగా రెండు గదుల నిర్మాణానికి రూ.5 లక్షలు.

+ మండపం దక్షిణాన కార్యనిర్వహణ శాల నిర్మాణానికి రూ.12 లక్షలు + తూర్పున పూలవనం, భోజనశాల అంచనా వ్యయం రూ.4 లక్షలు + మండపం పైభాగంలో అంతస్తు నిర్మాణానికి రూ.5 లక్షలు

ఎక్కడుందంటే?

ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో నామవరం గ్రామంలో ఉంది ఈ గాంధీనగరం. జాతీయ రహదారి-16కి ఆనుకుని కొన్ని అడుగుల దూరంలోనే మహానటి సావిత్రి సాంస్కృతిక కల్యాణ వేదిక నిర్మాణం జరుగుతోంది.

గాంధీనగరానికి ఎన్నో ప్రత్యేకతలు: ..

+ గాంధీనగరంలో లక్ష్మమ్మ సతీ సహగమనంతో 'లక్ష్మమ్మ గుండం'గా వాసికెక్కి ఏటా సంక్రాంతి కనుమ పండుగ నాడు ఉత్సవం నిర్వహిస్తారు.

+ మాజీ ఎమ్మెల్యే గెడ్డం సన్యాసిరావు గాంధీనగరం సృష్టికర్త.

+ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కుమారస్వామి రాజా 1950లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

+ భూదానోద్యమ సారథి ఆచార్య వినోబా భావే 1956లో నడయాడిన ప్రదేశం.

+ అంతర్జాతీయ దివ్యజ్ఞాన సమాజ ప్రముఖుడు, అమెరికాకు చెందిన 'మిస్టర్‌ కోట్స్' 1974లో సందర్శించిన ప్రాంతం.

+ ఎకరాల భూమిని దానం చేసిన మాజీ ఎమ్మెల్యే గెడ్డం సన్యాసిరావు ఇక్కడి (గుంటపల్లి) వాసే.

 

సావిత్రి జన్మ చరితార్థం అవుతుందని..

'ఫంక్షన్ హాళ్లకు లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లించుకోలేని వారికి, నిరుపేద సామాన్య ప్రజల పెళ్లిళ్లు, శుభకార్యాలు, రంగస్థల కళాకారుల ప్రదర్శనలు, గాయనీ గాయకుల సరిగమలు, ఆధ్యాత్మిక సంకీర్తనల ఆలాపనలకు ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో మా అభిమాన మహా నటి సావిత్రి జన్మ చరితార్థం అవుతుందని భావిస్తున్నాం' అని మహానటి సావిత్రి సాంస్కృతిక కల్యాణ వేదికకు శ్రీకారం చుట్టిన గెడ్డం వెంకటేశ్వర గాంధీ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. త్వరలోనే ఈ వేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.

'ఆయన' ఆశయాన్ని బతికించాను..

మహానటి పేరిట కల్యాణ వేదిక నిర్మాణంతో సావిత్రి పేరిట ఏదైనా చేయాలన్న నా భర్త (కామేశ్వరరావు) ఆశయాన్ని బతికించానన్న, ఆయన కలను సాకారం చేశానన్న తృప్తి నాలో ఉంది. ఈ వేదిక నిర్మాణానికి పూనుకున్నాక మా తాపత్రయం ఎంత గొప్పదో తెలిసింది. నాకూ సావిత్రి అంటే చెప్పలేనంత అభిమానం. నా హైస్కూలు చదువుల నుంచి ఆమె సినిమాలు చూసేదాన్ని. ఆమె పాటలు వినేదాన్ని. ఈ వేదిక అందుబాటులోకి వస్తే చిరకాలం ఎందరికో ఉపయుక్తంగా ఉంటుంది' అని నాగం వెంకటలక్ష్మి చెప్పారు.

 

వెండితెర సామ్రాజ్ఞి.. దానశీలి..

తన అందచందాలు, నటనా చాతుర్యంతో తెలుగు వారితో పాటు కోట్లాది మంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి. నాటి తరం నటనలో తిరుగు లేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంది. వెండి తెర సామ్రాజ్ఞిగా మహోన్నత శిఖరాన్ని అధిరోహించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 252 సినిమాల్లో నటించి ఆమె లెక్కకు మిక్కిలి అభిమానుల మదిని లూటీ చేసింది. అంతేనా? దాతృత్వంలోనూ తన చేతికి ఎముక లేదని, మానవత్వంలో సాటిలేరని నిరూపించుకుంది. సావిత్రి అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డివారిపాలెం. అమ్మమ్మ ఊరిపై మమకారం పెంచుకున్న సావిత్రి 1962లో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆ ఊళ్లో ఓ స్కూలును స్థాపించింది.

 

ఆ తర్వాత ఈ పాఠశాల ఉపాధ్యాయులకు సరిగా వేతనాలు అందలేదని తెలుసుకుని అప్పట్లో రూ.1,04,000 అందజేసి ఔదార్యాన్ని చాటుకుంది. ఆ స్కూలు ఇప్పుడు సావిత్రి గణేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అత్యున్నత ఫలితాలు, క్రమశిక్షణతో ఎంతో ఉన్నతంగా వెలుగొందుతోంది. అంతేనా? ఇంకా లెక్కలేనన్ని దానధర్మాలు చేశారామె. భారత్-పాకిస్తాన్ యుద్ధం వేళ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలకిచ్చిన పిలుపునకు స్పందించి సావిత్రి తన ఆభరణాలను విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు.

 

సావిత్రి పేరిట ఇంకేమి ఉన్నాయి?

సావిత్రి జ్ఞాపక చిహ్నంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2016లో మహానటి సావిత్రి సాహిత్య, సాంస్కృతిక కళాక్షేత్రం సంక్షేమ సంఘం ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సావిత్రి పేరిట భారత ప్రభుత్వం 2011లో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇంకా ఉత్తమ నటీమణులకు సావిత్రి మెమోరియల్ స్మారక అవార్డును ప్రదానం చేస్తున్నారు. 

Tags:    

Similar News