తిరుమల: శారదా పీఠం భవనం కూలుస్తారా? టీటీడీ అధికారుల్లో అంతర్మథనం!
విశాఖ శారదాపీఠం ప్రకంపనలు తిరుమలకు వ్యాపించాయి. కొండపై ఉన్న ఆ పీఠం భవన నిర్మాణ అనుమతిని రద్దు చేశారు. దీనిని కూలిస్తే, పర్యవసానమేమిటి?
By : SSV Bhaskar Rao
Update: 2024-10-25 13:56 GMT
తిరుమలలో విశాఖ శారదా పీఠం నిర్మించిన మఠం కూలుస్తారా? టీటీడీ స్వాధీనం చేసుకుంటుందా? ఇదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కూటమిలో భాగస్వామి అయిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఆ ధర్మంలో భాగమైన శారదా పీఠం భవన నిర్మాణ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని కూల్చి వేయడానికి సాసిస్తారా? దీనివల్ల పీఠాధిపతులు నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుంది? దీనిపై టీటీడీ అధికారుల పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా మారింది.
"తిరుమలలో ప్రతి అణువు శ్రీవారికే దక్కాలి. అక్రమ నిర్మాణాలు కూలగొట్టాలి" అని జనసేన డిమాండ్ చేస్తోంది.
మాజీ సీఎం వైఎస్. జగన్ ఐదేళ్ల పాలనలో సాగించిన వ్యవహారాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందులో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూములతో పాటు, తిరుమలలో ఆ పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహుళ అంతస్తుల సత్రం (భవనం) కూడా వివాదాల చిట్టాలోకి చేరింది. దీనిపై అధికార టీడీపీ నేతల కంటే, జనసేన పార్టీ నాయకులే పోరు సాగించారు.
"గత ycp పాలనలో అనేక అక్రమాలు జరిగాయి. వాటన్నిటినీ నిగ్గు తెలుస్తాం" అని అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత సీఎం ఎన్. చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి జనసేన పార్టీ నాయకులు కూడా గొంతు కలిపారు. మిగతా వ్యవహారాలను పక్కన ఉంచితే తాజాగా, విశాఖలో శారదా పీఠానికి గత ప్రభుత్వ కాలంలో చౌకగా అప్పగించిన భూముల స్వాధీనానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అదే పరంపరలో తిరుమలలో ఆ పీఠం నిర్మిస్తున్న సత్రంపై కూడా ప్రభుత్వం దృష్టి నిలిపింది.
ఈ సత్రం వ్యవహారం ఏంటి?
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు 2005లో విశాఖ శారదా పీఠానికి తిరుమలలో ఐదువేల చదరపు అడుగుల స్థలం లీజుకు ఇచ్చారు. తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉన్న గోగర్భం డ్యాం సమీపంలో పీఠానికి స్థలం కేటాయించారు. తీసుకున్న అనుమతికి భిన్నంగా సమీపంలో డ్యామ్ లోకి నీటిని అందించే కాలువను కూడా చదును చేసి ఆక్రమించారు. ఆ స్థలంలో నాలుగు అంతస్తుల భారీ భవన నిర్మాణం సాగిస్తున్నారు.
అనుమతి ఎలాగంటే..
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి తోపాటు అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచుతామని స్థలం తీసుకునే ముందు ప్రభుత్వం నుంచి శారదా పీఠం అనుమతి తీసుకుంది.
వాస్తవానికి తిరుమలలో సత్రాలు, పీఠాలు అనాదిగా శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సేవలు అందించేవి. అందులో తాత్కాలిక వసతి, సమయానుకూలంగా అన్నప్రసాదాలు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
విశాఖ శారదా పీఠం కూడా తిరుమలలో అదే మాట ఇచ్చి స్థలం తీసుకుంది. అనుమతి లభించిన తర్వాత 2007లో భవన నిర్మాణానికి సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడు అంతస్తులు నిర్మించడానికి అనుమతి తీసుకున్నారు. కాగా, విశాఖ శారదా పీఠం నిర్వాహకులు తిరుమలలో అనుమతి పొందిన స్థలంతో పాటు సమీపంలోని ఖాళీ స్థలం, కాలువ కూడా ఆక్రమించి 1906.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన అనుమతులను మఠం నిర్వాహకులు తోసిరాజని ఇష్టానుసారంగా వ్యవహరించారు.
ఆ తర్వాత ఏం జరిగింది
తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో నిర్మాణంలో ఉన్న విశాఖ శారదా పీఠం సత్రం భవన నిర్మాణం నత్తనడకన సాగింది. 2019లో వైఎస్. జగన్ సీఎం అయ్యాక, ఆయనకు గురువుగా వ్యవహరించిన విశాఖ శారద పీఠాధిపతి వ్యవహరించిన తీరుతో విమర్శలు మూటగట్టుకున్నారు. మఠం ప్రతినిధులు మరింతగా చెలరేగారు. నిర్మాణంలో ఉన్న సత్రానికి ముందు భాగంలో ఉన్న ఖాళీ స్థలం ఆక్రమించారు. నిర్మాణానికి భవన వెనుక ఉన్న కొండను అనుకుని ఉన్న కాలువను కూడా స్వాధీనం చేసుకుని నిర్మాణం సాగించారు. దీనిపై టీటీడీకి దరఖాస్తు చేసి, 2019లో అప్పటి టీటీడీ పాలకమండలి ఆమోదం కూడా తీసుకున్నారు.
భవన నిర్మాణంపై ఆరోపణ వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు కూడా ఆక్రమణలను నిర్ధారించారు. దీనిపై వివరణ కోరిన టీటీడీకి "వాస్తు దోషం నివారణకే అదనపు నిర్మాణాలు చేపట్టాం" అని విశాఖ శారదా పీఠం నుంచి సమాధానం లభించినట్లు తెలిసింది. దీనిని ఆసరాగా చేసుకున్న టీటీడీ పాలక మండలి 2023లో ఓ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో మెల్లగా భవన నిర్మాణాలు సాగుతుండగానే, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికే అనేక ఆరోపణలు విమర్శలతో వార్తల్లో నిలిచిన శారదాపీఠం వ్యవహార శైలిపై కూడా టీడీపీ కూటమి నాయకులు దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో..
స్వామీజీల ధర్నా..
ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలోని స్వామీజీలు తిరుమలలో ధర్నాకు దిగారు. దీనికి జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ తోపాటు నాయకులు మద్దతు పలికారు. ఆ సమయంలో.. "భవన నిర్మాణ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది" అని టీటీడీ అధికారులు ఓ ప్రకటనతో చేతులు దులుపుకున్నారు.
ఆ తర్వాత కూడా సాధు పరిషత్ ప్రతినిధులు, జనసేన నాయకులు ప వదలని విక్రమార్కుల్లా పోరాటం సాగించారు. "అక్రమంగా శారదాపీఠం నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని ఆపడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుపోయినట్లు ఆయన చెప్పారు. కాగా,
వైసీపీ పాలనలో దక్కించుకున్న విశాఖ శారదా పీఠం భూములపై సీఎం ఎన్ చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు. అందులో భాగంగా ఆ పీఠం తిరుమలలో సాగిస్తున్న నిర్మాణంపై కూడా ఆయన దృష్టి సారించడమే కాకుండా, "గతంలో టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాన్ని తిరస్కరించారు" ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం తిరుమలలో నిర్మాణ దశలో ఉన్న శారదాపీఠం సత్రం పరిస్థితి ఏమిటనేది చర్చకు దారి చేసింది. ఈ భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందా? అక్రమ నిర్మాణాల పేరిట కూలుస్తుందా? అనేది తేలని పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాల నేపథ్యంలో.. జనసేన నేత కిరణ్ రాయల్ శుక్రవారం తిరుమల శారదా పీఠం సత్రం వద్ద శ్రీవేంకటేశ్వర స్వామిపటం నుంచి పూజలు చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ,
"తిరుమలలో ప్రతి గజం స్వామివారిదే. స్వామి వారి అనుగ్రహంతో శారదా పీఠం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని జీవో వచ్చింది" అని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. "టీటీడీ ఈఓ (TTD EO), అడిషనల్ ఈఓ ( TTD Adfitional EO) స్పందించి, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి" అని కిరణ్ ((Kiran Royal) కోరారు. ఇక్కడి వ్యవహారంపై గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్ళాం" అని గుర్తు చేశారు.
తిరుమలలో విశాఖ శారదా పీఠం సత్రం నిర్మాణానికి అనుమతి కంటే ఎక్కువగా స్థలం ఆక్రమించారని సీఎం చంద్రబాబు గుర్తించారు. అనుమతి కూడా రద్దు చేశారు. టీటీడీ పాలకమండలి గతంలో చేసిన తీర్మానాన్ని కూడా తిరస్కరించారు. దీనిపై టీటీడీ ఈవో జే.శ్యామలరావు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. దీనిపై "రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల తరువాత కూడా టీటీడీ అధికారుల స్పందన లేదు" టీటీడీ సమాచార శాఖ అధికారులను 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి స్పందనగా కోరగా, "టీటీడీ తిరుమల ఎస్టేట్ అధికారి ఈ వ్యవహారం చూస్తారు" అని మాత్రమే వ్యాఖ్యానించారు. తిరుమల అనేది ఆధ్యాత్మిక కేంద్రంలో పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలతో వ్యవహారాలు ఆగమశాస్త్ర పద్ధతులు అనుసరిస్తారు. దీంతో అధికారుల పరిస్థితి కూడా ఇరకాటంలో ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.