కరణం బలరామ్‌ టీడీపీలో చేరడం ఖాయమైనట్లేనా?

బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే బలరామ్ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన చంద్రబాబును ఒక ఫంక్షన్ లో కలిసారు.

Update: 2024-10-26 02:38 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు మారే రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ పార్టీ వారు ఏ పార్టీలో చేరుతారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ మారాలంటే ఆ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామాలు చేసి రావాల్సిందేనని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ షరతులు విధించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఎవరైనా టీడీపీలో చేరాలంటే ముందుగా మీరున్న పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి చేరాలని షరతులు విధించారు. ఇటీవల టీడీపీలో చేరిన వారు తమ పదవులకు రాజీనామాలు చేశారు. గతంలో కొందరు పదవులకు రాజీనామాలు చేయకుండా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించారు.  2019 లో వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించిందో అదే విధానాన్ని దాదాపు 2024 లో టీడీపీ కూడా అనుసరించింది. ఇప్పుడు అధికార పార్టీ మాత్రం షరతులు వర్తిస్థాయని కరాఖండిగా చెప్పింది. అందుకే రాజ్యసభలో సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంటకరమణ, నెల్లూరుకు చెందిన మస్తాన్‌రావులు పదవులకు రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు.

బలరామ్‌ వ్యూహం ఏమిటి?
కరణం బలరామ్‌ కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చి ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన చేరిన పార్టీల్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. మొట్ట మొదట కాంగ్రెస్‌లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఒక దశలో అప్పటి ప్రదాన మంత్రి ఇందిరాగాంధీపై ఒంగోలులో దాడి జరిగితే తానే దగ్గరుండి వేరే కారులో వేరే ప్రాంతానికి సురక్షితంగా చేర్చారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. ఎన్‌టీఆర్‌కు, చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగారు. టీడీపీలో మార్టూరు, అద్దంకి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో టీడీపీలో గెలిచి వైఎస్ఆర్సీపీలో బలరాం చేరారు. ముందు వైఎస్సార్‌సీపీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో చీరాల నుంచి ఆయన కుమారుడు వెంకటేష్‌ వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. చీరాల నుంచి ఎంఎం కొండయ్య యాదవ్‌ టీడీపీ నుంచి గెలుపొందారు. ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో మాత్రం చీరాల నుంచి విజయం సాధించారు.
Delete Edit
వైఎస్సార్‌సీపీలో గెలుపు కష్టమనే...
2029 ఎన్నికల్లో ఎంత కష్టపడినా తన కుమారుడిని చీరాల నుంచి గెలిపించడం కష్టమనే ఆలోచనలో కరణం బలరామ్‌ ఉన్నారు. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నా గత ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోలేక పోయారు. దీంతో ఎలాగైనా పవర్‌ పార్టీలో ఉంటేనే తమ వర్గానికి చెందిన వారి పనులు సులువుగా చేసుకోవచ్చని, లేకుంటే ఇబ్బందులేనని బావించిన బలరామ్‌ తన కుమారుడిని జగన్‌కు టచ్‌లో ఉంచి, ఆయన మాత్రం చంద్రబాబునాయుడితో టచ్‌లోకి వెళ్ళారు. నాలుగు రోజుల క్రితం గుంటూరులో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి మనుమడి వివాహం గుంటూరులో జరిగింది. ఈ వివాహానికి హాజరైన కరణం బలరామ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. వారిద్దరి మధ్య ఏమి సంభాషణ జరిగిందనేది తెలియకపోయినా పవర్‌ పార్టీ అయిన టీడీపీలో ఉండేందుకు బలరామ్‌ సుముఖత చూపారనే సమాచారం అందింది. గుంటూరులోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకలో చంద్రబాబు పక్కనే బలరామ్‌ ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సీఎంతో బలరామ్‌ మాట్లాడారు.
త్వరలో వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై...
చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యపై టీడీపీ క్యాడర్‌ నుంచే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ప్రధానంగా ఇసుక, మద్యం, పరిశ్రమల్లో పర్సెంటేజీలు వంటి వారిపై రావడంతో ఆయనకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధాలని సీఎం వద్ద నిరూపించుకునే పనిలో ఎంఎం కొండయ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో చీరాల మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు రాజకీయాల్లో సమకాలికుడైన బలరామ్‌ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా బలరామ్‌కు నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్‌ వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరినట్లుగానే భావించొచ్చు.
Tags:    

Similar News