అమరావతి నిర్మాణంలో మళ్లీ కదలిక: 1,575 ఎకరాలకు నోటిఫికేషన్
అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాలపై సీఆర్‌డీఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందుకోసమే భారీ మొత్తంలో స్థలాన్ని నోటిఫై చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం అమరావతి కేంద్రంగా పాలనను పరుగులు పెట్టిస్తోంది. అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కూడా తీసుకుంటుంది. వాటిని యుద్ధప్రాతిపదికన అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో కేటాయించిన స్థలాలకు సంబంధించి సీఆర్‌డీఏ ఇటీవల ఫోన్లు కూడా చేసి సంప్రదింపులు చేసినట్లు సమాచారం అందించింది. తాజాగా ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సీఆర్‌డీఏ.
ఆ ప్లాన్ ప్రకారమే నిర్మాణం
ప్రభుత్వం భవనాలను పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మించనున్నారు. అందుకోసం అమరావతిలో 1,575 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ నోటిఫై చేసింది. సీఆర్‌డఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేసి బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల్లో ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పెట్టబడులపై ప్రత్యేక దృష్టి
వీటన్నింటితో పాటు అమరావతికి దేశ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో తొలి మెట్టుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతికి ఆహ్వానించారు సీఆర్‌డీఏ అధికారులు. 2014లో వారికి అమరావతిలో స్థలం కేటాయించబడిందని, ఆ స్థలాన్ని చూసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని సంస్థలు అతి త్వరలో అమరావతి వచ్చి తమకు కేటాయించిన స్థలం పరిశీలించుకుంటామని, ఆ తర్వాత అక్కడ ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో పెట్టుబడులు అధికం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
నిర్మాణాల కోసం కొత్త కమిషనర్
రాజధాని అమరావతిలో నిర్మాణాలు చేయడం కోసం ప్రభుత్వం సీఆర్‌డీఏకు కొత్త కమిషనర్‌ను నియమించింది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్, ఎండీగా మాజీ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని నియమించింది. ఈ విషయాన్ని పురపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. నిర్మాణాలు అన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం పూర్తయ్యేలా కమిషనర్ దగ్గరుండి చూసుకోవాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.