అలయ్ బలయ్ పై సీపీఐ నారాయణ నిరసన

ఢిల్లీ యూనివర్సిటి మాజీ ప్రొఫెసర్ మరణానికి కేంద్రప్రభుత్వమే కారణమన్న కారణంతో కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బండారు దత్తాత్రేయకు రాసిన లేఖలో స్పష్టంచేశారు.

Update: 2024-10-13 06:39 GMT

ప్రతి ఏడాడి బీజేపీ సీనియర్ నేత బండారు డత్తాత్రేయ నిర్వహించే అలయ్-బలయ్ కార్యక్రమాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బహిష్కరించారు. ఢిల్లీ యూనివర్సిటి మాజీ ప్రొఫెసర్ మరణానికి కేంద్రప్రభుత్వమే కారణమన్న కారణంతో నారాయణ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బండారు దత్తాత్రేయకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. మామూలుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తారని అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, ప్రవచనకారులు, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు కూడా హాజరవుతారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే ఈ కార్యక్రమంలో వడ్డించే వంటకాలు కూడా బాగా హైలైట్ అవుతుంటాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణా సంస్కృతిని ప్రతిబించేట్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు కుటుంబం నిర్వహిస్తుంటుంది. వివిధ రంగాల్లోని ప్రముఖలంతా హాజరవుతారు కాబట్టి కార్యక్రమంలో పాల్గొనే ఆహ్వానం అందితే ఎవరూ వదులుకోరు. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమానికి హాజరుకాకూడదని సీపీఐ నారాయణ నిర్ణయించటం సంచలనంగా మారింది. నారాయణ ఏమన్నారంటే తన రాజకీయ అనుబంధంతో సంబంధలేకుండా ప్రతి ఏడాది దత్తాత్రేయ తనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయితే తాజా కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదలు చెబుతునే హాజరుకాలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు.

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విషయంలో కేంద్రప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా తాను అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ సాయిబాబా మేధావి అన్న విషయం తెలుసన్నారు. 90 శాతం ఆర్ధోపెడిక్ చాలెంజ్ అయిన విషయం తెలిసీ ప్రభుత్వం ప్రొఫెసర్ ను అరెస్టుచేసినట్లు గుర్తుచేశారు. విచారణలో హక్కు అయిన బెయిల్ ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. దర్యాప్తు సంస్ధలు సాయిబాబాను అక్రమంగా నిర్బంధించిన పదేళ్ళకు గౌరవ న్యాయస్ధానం ప్రొఫెసర్ ను నిర్దోషిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తనతో పాటు తన పార్టీ సాయిబాబా రాజకీయాలను అంగీకరించలేదన్న విషయాన్ని స్పష్టంచేశారు. అయితే సాయిబాబా విషయంలో జరిగిన మానవహక్కుల విషయంలోనే తాము ఆయనకు మద్దతుగా నిలబడినట్లు చెప్పారు. దర్యాప్తు సంస్ధలు, కోర్టుల వల్లే సాయిబాబా ప్రపంచానికి దూరమైపోయినట్లు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వంలో బండారు దత్తాత్రేయ కూడా భాగమైనందున ఆయన నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిరసనగా తాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News