హోం శాఖపై ఉప ముఖ్యమంత్రి కన్ను పడిందా?

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోం శాఖపై ఒక కన్నేసి ఉంచారా? ఏకంగా డీఎస్పీ జయసూర్యపై విచారించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

Update: 2025-10-22 11:18 GMT
AP Deputy Cm Pawan Kalyan

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కన్ను హోం శాఖపై పడిందా? ఉన్నట్లుండి అప్పుడప్పుడు హోం శాఖ వైఫల్యాలను పవన్ కల్యాణ్ ఎత్తి చూపుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులు పవన్ కల్యాణ్ కుమార్తెలు బాధపడేలా చేశాయని ఆవేశంగా మాట్లాడటమే కాకుండా నేను హోం శాఖను తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని వ్యాఖ్యానించారు. పిఠాపురం వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత రోజు నుంచి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, హోం మంత్రికి, లోకేష్ కు, పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేశారు.

పేరుకు హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి ఉన్నారే కాని పగ్గాలన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల్లో ఉంటాయి. ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించడం, తరువాత హోం మంత్రి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం పరిపాటిగా మారింది. ఇది కొత్తేమీ కాదు. గత ప్రభుత్వాల్లోనూ ఈ విధంగానే జరిగింది. ప్రస్తుతం కూడా అలాగే కొనసాగుతోంది. హోం మంత్రి కూడా ముఖ్యమంత్రి చెప్పే వరకు వేచి చూస్తూ ఉండిపోతున్నారు. గుడ్లూరు మండలం లో లక్ష్మినాయుడు హత్య తరువాత సీఎం చెబితేనే కాని హోం మంత్రి స్పందించ లేదు. అదే ముందుగానే ముఖ్యమంత్రితో చర్చించి స్పందించి ఉంటే కుల ఘర్షణగా మారి ఉండేది కాదు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జూదం, పేకాట క్లబ్ ల నిర్వహణ జరుగుతున్నట్లు పవన్ కల్యాణ్ డీజీపీతో చెప్పారు. విచారించి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇది హోం శాఖ పనితీరును ప్రశ్నించినట్లుగానే పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ నివేదిక కోరటంతో హోం శాఖపై ఉప ముఖ్యమంత్రి కన్ను పడిందా? అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది.

హోం శాఖపై పవన్ కల్యాణ్ కు ఫిర్యాదులు ఏమిటి?

ఈ వివాదంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఫి ర్యాదులు నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రావడం. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (టిడిపి)కు ఈ ఫిర్యాదులు ఎందుకు రాలేదు? ఇది హోం మంత్రి పనితీరుపై ప్రజలకు నమ్మకం లేకపోవడమా? లేక కూటమి ప్రభుత్వంలోని అంతర్గత రాజకీయాలా? అనే చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్రను హైలైట్ చేయడానికి ఇది ఒక అవకాశమా? అనేది పరిశీలకుల అభిప్రాయం.

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హోం శాఖపై తన దృష్టి సారించారా? ఈ ప్రశ్న ఇటీవల రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలు, చర్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. హోం శాఖ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, సోషల్‌ మీడియా పోస్టులపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం, డీజీపీ ని నివేదికలు కోరడం వంటివి మరింత చర్చనియాంశంగా మార్చాయి.

ఇప్పుడు భీమవరం, అప్పుడు తిరుపతి

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో తన కుమార్తెలపై వచ్చిన అనుచిత పోస్టులను ప్రస్తావించారు. "నేను హోం శాఖ తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత రోజు నుంచి సోషల్‌ మీడియాలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత వంగలపూడి, మంత్రి నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఇది యాదృచ్ఛికమా లేక పవన్‌ వ్యాఖ్యల ప్రభావమా అనే చర్చ రేగింది.

ఆ తరువాత తిరుపతిలోని ఒక ఏరియాలో నివాసం ఉంటున్న ఒక మహిళ పవన్ కల్యాణ్ కు లేఖ రాస్తూ మా ఏరియాలో ముగ్గురు యువకులు నిత్యం తమను వేధిస్తున్నారని, వారిని కట్టడి చేయాలని పేర్కొన్నారు. ఆ లేఖను పరిశీలించిన పవన్ కల్యాణ్ ఎస్పీని ఆఘమేఘాలపై లర్ట్ చేశారు. సీఐని స్పాట్ కు చేరుకుని ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎస్పీ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఇలా పోలీస్ విషయం వచ్చే సరికి నేరుగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. హోం మంత్రిని అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోందనే అంశపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

హోం శాఖపై సీఎం చంద్రబాబు ప్రభావమే ఎక్కవ

హోం శాఖ మంత్రి గా అనిత వంగలపూడి (టీడీపీ) ఉన్నప్పటికీ, శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉండేది. కాని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇది మరింత స్పష్టంగా తెలుస్తోంది. ఉదాహరణకు గుడ్లూరు మండలంలో లక్ష్మినాయుడు హత్య కేసులో ముఖ్యమంత్రి ఆదేశాల తరువాతే హోం మంత్రి స్పందించారు. ముందుగా చర్చించి చర్యలు తీసుకుని ఉంటే, ఇది కుల ఘర్షణగా మారకపోయేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు వేచి చూడటం హోం మంత్రి పనితీరుపై ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తోంది.

భీమవరంలో డీఎస్పీ జయసూర్య వ్యవహారం

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదులు నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూదం, పేకాట క్లబ్‌ల నిర్వహణపై పవన్‌ డీజీపీని నివేదిక కోరారు. ఇది హోం శాఖ పనితీరును పరోక్షంగా ప్రశ్నిస్తున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఫిర్యాదులు హోం మంత్రికి కాకుండా పవన్‌కు రావడం శాఖపై ప్రజల నమ్మకం తగ్గడానికి సంకేతమా? లేక కూటమి ప్రభుత్వంలో అంతర్గత రాజకీయ విభేదాలకు సూచికా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జనసేన బలోపేతానికి ఇదొక వ్యూహమా?

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి, కూటమి ప్రభుత్వంలో తన పాత్రను హైలైట్‌ చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జనసేనకు కీలక పాత్ర ఉంది. కాని హోం శాఖ వంటి ముఖ్యమైన పోర్ట్‌ పోలియోలు టీడీపీ చేతుల్లో ఉండటం వల్ల పవన్‌ అసంతృప్తిలో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి కేవలం అనుమానాలే నని, పవన్‌ కల్యాణ్‌ లక్ష్యం రాష్ట్రంలో చట్టబద్ధత, భద్రతను మెరుగు పరచడమే అని జనసేనలోని ముఖ్య నాయకులు కొందరు చెబుతున్నారు.

మొత్తంగా ఈ వివాదం కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమన్వయానికి సవాలుగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. హోం శాఖలో మార్పులు జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు కు దారి తీస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News