భీమవరం డీఎస్పీపై ఢీ అంటే ఢీ అంటున్న జనసేన, టీడీపీ
ఎవరి మాట వినాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు
By : The Federal
Update: 2025-10-22 10:41 GMT
భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై టీడీపీ జనసేన మధ్య నిప్పు రాజేసినట్టు కనిపిస్తోంది. 24 గంటల కిందట జనసేన అధినేత, డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భీమవరం డీఎస్పీ జయసూర్యపై విరుచుకుపడగా తాజాగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెనకేసుకు వచ్చారు. జయసూర్యపై అరాచకాలపై తక్షణమే నివేదిక సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశిస్తే ఆ డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందని రఘురామకృష్ణ రాజు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎవరు చెప్పిన మాట వినాలో తెలియక అధికారులు గందరగోళంలో పడ్డారు. ఈ వివాదంపై హోం మంత్రి అనిత కూడా స్పందించారు. అసలు విషయమేమిటో తేలుస్తామని కూడా అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జూదంపై జయసూర్య, ఆయన సిబ్బంది గట్టి నిఘా పెట్టారన్నారు. అందుకే డీఎస్పీపై అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నానని రఘురామ అభిప్రాయపడ్డారు. ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూద శిబిరాలు లేవని చెప్పారు. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.
అసలు ఏమిటీ వివాదం..
భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన పరిధిలో పేకాట క్లబ్బులు, జూద గృహాలు పెరిగిపోయాయని, జయసూర్య సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందిస్తూ డీఎస్పీ వ్యవహారశైలిపై నివేదిక కోరారు. జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడారు. ఈ వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జి.జయసూర్య తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి మంగళవారం ఆయన నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు.
‘రాష్ట్రంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని నిర్వహిస్తున్న పెద్దలు కొందరు.. అధికారులకు మామూళ్లను అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై పవన్ పోలీసులను ఆరా తీశారు’ అని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
‘డీఎస్పీ జయసూర్యపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయన పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయి. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులూ ఉన్నాయి. కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారని, కూటమి నేతల పేర్లు వాడుతున్నారని చెబుతున్నారు’ అని ఎస్పీకి తెలియజేశారు. డీఎస్పీపై వెంటనే తనకు నివేదిక పంపాలని కోరారు. ఈ తరహా వ్యవహారాలను ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రికి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సీఎంతో హోంమంత్రి, డీజీపీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరైనట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం డీఎస్పీపై విచారణ చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి తమ దృష్టికి తీసుకువచ్చిన ఫిర్యాదులన్నిటి పైనా విచారణ జరిపి నివేదిక ఇస్తామని ఎస్పీ కూడా ప్రకటించారు.
మొత్తం మీద ఈ వ్యవహారం చినికి చినికి గాలి వాన అయ్యేలా ఉంది. కూటమిలో రెండు పార్టీల మధ్య డీఎస్పీ వ్యవహారమై మాటల తూటాలు పేలుతున్నాయి. భీమవరం ప్రాంతంలో కోళ్ల పందాలు, పేకాటలు చాలా మామూలుగా సాగుతుంటాయి. దీంట్లో వేలు పెట్టిన ఏ అధికారీ ఎక్కువ కాలం ఆ ప్రాంతంలో మనజాలలేదు. ఇప్పుడు జయసూర్య వంతు వచ్చినట్టు కనిపిస్తోంది.