‘చంద్రన్నా!పంచ సూత్రాలు ఎందుకన్నా ? గిట్టుబాటు ధర కల్పించన్నా!'
వైకాపా ,టిడిపి పార్టీలు రైతు దుష్మన్ పార్టీలు .
By : The Federal
Update: 2025-11-26 07:40 GMT
ఆంధ్రప్రదేశ్ మిర్చి ,పొగాకు ,టమోటా ,ఉల్లి ,పసుపు ,పూలు, అరటి, చీని రైతులు ధరలు లేక సంక్షోభంలో పడితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచసూత్రాలు పంచుతానంటూ అసలు సమస్యను విస్మిరస్తున్నాడని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయం ఇలా పాడవుతూ ఉంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని, వైకాపా ,టిడిపి పార్టీలు రైతు దుష్మన్ పార్టీలని ఆయన ధ్వజమెత్తారు.
" రాష్ట్రంతో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు .అడిగే వారు లేరు .కొనేవారు లేరు .పంట పండించి ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు లబోదిబోమంటున్నారు .ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉలుకుపలుకు లేకుండా ఉంది," డాక్టర్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
మంగళవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల విషయంలో ఈ రెండు పార్టీలవి మాటలే తప్ప చేతలు లేవని అన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించగా చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తోందని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతన్నా ....మీకోసం’ కార్యక్రమం ప్రచార కార్యక్రమం తప్ప మరేమీ కాదని తులసిరెడ్డి అన్నారు.
"చంద్రన్నా!మాకు గిట్టుబాటు ధర కల్పించమని రైతులు వేడుకుంటా ఉంటే ,లేదు లేదు మీకు పంచ సూత్రాలు బోధిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరం," అని తులసి రెడ్డి అన్నారు.
డా. తులసిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
మిర్చి ,పొగాకు ,టమోటా ,ఉల్లి ,పసుపు ,పూలు, అరటి, చీని ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు .అడిగే వారు లేరు .కొనేవారు లేరు .పంట పండించి ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు లబోదిబోమంటున్నారు .ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉలుకుపలుకు లేకుండా ఉంది .
రోమ్ నగరం తగలబడి పోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నట్లు ఉంది. గిట్టుబాటు ధర లభించినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వమే రైతు పండించిన పంటను కొని రైతును ఆదుకోవాలి .కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయడం లేదు.
ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. యూరియా కొరత వెంటాడుతోంది .పంటల బీమాకు పంగనామాలు పెట్టడం జరిగింది .పంట నష్టపరిహారం ఇచ్చేది అరకొర.అది కూడా సకాలంలో అందడం లేదు .సున్నావడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది . పావలా వడ్డీ పథకానికి పాడే కట్టడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ పథకం నామమాత్రం అయింది .అన్నదాత సుఖీభవ పథకం పంచ పాండవులు మంచం కోల్లలా తయారైంది .2024-- 25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది .ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తామని చెప్పి అందులో రూ 6000 కోత కోయడం జరిగింది .లబ్ధిదారుల సంఖ్యలో కూడా ఏడు లక్షల కోత పెట్టడం జరిగింది . కౌలు రైతులను పూర్తిగా విస్మరించడం జరిగింది .ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు .చేసింది లేదు .ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు .చేసింది లేదు. వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గాయి .వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న గురజాడ సూక్తితో స్ఫూర్తిని పొంది రైతుల విషయంలో మాటలు తగ్గించి చేతల్లో రైతులను ఆదుకోవాలి.
విలేకరుల సమావేశంలొో కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, పోతిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ,ఐచర్ రమణ ,చిన్న కోట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.