బిజెపి మీద ‘గాడిద గుడ్డు’ విసిరిన కాంగ్రెస్

బీజేపీని ఉద్దేశించి ‘తెలంగాణాకు కేంద్రప్రభుత్వం గాడిదగుడ్డు ఇచ్చింది’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. గాడిదగుడ్డు అనే పదం చాలా పాపులర్.

Update: 2024-04-30 07:40 GMT

తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీపై కాంగ్రెస్ వినూత్న తరహాలో ప్రచారం మొదలుపెట్టింది. అదేమిటంటే బీజేపీని ఉద్దేశించి ‘తెలంగాణాకు కేంద్రప్రభుత్వం గాడిదగుడ్డు ఇచ్చింది’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. గాడిదగుడ్డు అనే పదం చాలా పాపులర్. అయితే అసలు గాడిదగుడ్డు అనేదే లేదు, ఉండదు. ఆ అర్ధంలోనే ఇపుడు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం గాంధీభవన్ కాంపౌండ్ లో గుడ్డు ఆకారాన్ని పెద్దది తయారుచేయించి దానిపై కాంగ్రెస్ గాడిదగుడ్డు అని రాయించింది. దానికి బ్యాక్ డ్రాప్ లో తెలంగాణా అడుగుతున్నా ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోని పది అంశాలను ఎర్రటి బ్యానర్ పై రాయించింది. దానిపైన పెద్ద అక్షరాలతో ‘తెలంగాణా అడిగినవి ఇవి‘...అని రాయించి అదే బ్యానర్ కింద ‘బీజేపీ ఇచ్చింది ఇది’ అని పెద్దక్షరాలతో రాసి దానిపక్కనే సర్కిల్లో గాదిడ బొమ్మను ప్రింట్ చేశారు. కాంగ్రెస్ ఎంఎల్సీ బల్మూరి వెంకట్ మొదలుపెట్టిన ఈ వినూత్న ప్రచారం జనాలను బాగా ఆకట్టుకుంటోంది. అందుకనే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

ఇంతకీ బ్యానర్లోని పది అంశాల్లో ఏముందంటే రూపాయి పంపిస్తే, 43 పైసల బిచ్చం నుండి విముక్తి, మేడారం సమ్మక్క..సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేదని, తెలంగాణాకు కనీసం ఒక్క ఐఐడి, ఎన్ఐడీ విద్యాలయం అడిగినా ఇవ్వలేదట. కనీసం ఐఐఐటి, మెడికల్ కాలేజీని అడిగినా మంజూరు చేయటంలేదని కాంగ్రెస్ మండిపడింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే కేంద్రం పట్టించుకోవటంలేదట. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవటంలేదన్నది. బడ్జెట్లో ఉత్తరాధి రాష్ట్రాలతో పాటు తెలంగాణా సమాన వాటా కావాలన్నా కూడా కేంద్రం పట్టించుకోవటంలేదట.

కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల నీటిలో తెలంగాణాకు సరైన వాటాను ఇప్పించమని ఎంతడిగినా ఉపయోగం కనబడలేదట. విభజన చట్టంలో చెప్పినట్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానని ఇచ్చిన హామీని కేంద్రం తుంగలో తొక్కేసిందట. వరంగల్, కరీంనగర్ ను స్మార్ట్ సిటీలుగా చేయమని అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవటంలేదనే పది పాయింట్లు జనాలను ఆకర్షిస్తోంది. రాజకీయంగా పార్టీల మధ్య, నేతల మధ్య బూతులు, అర్ధంలేని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునేబదులు ఇలాంటి అర్ధవంతమైన ఆరోపణలు చేస్తు, సెటైర్లతో జనాలను ఆకట్టుకోవటం బాగుంది.

Tags:    

Similar News