రేవంత్ ప్రభుత్వానికి మొదటి దెబ్బ

భట్టి ప్రకటనతో విద్యార్ధులు, నిరుద్యోగుల ఆందోళన రూపంలో మొదటిదెబ్బ తగిలినట్లయ్యింది.

Update: 2024-07-14 12:31 GMT

తాజా పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనలకే ప్రభుత్వం లొంగిపోయినట్లు అర్ధమవుతోంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతు తొందరలోనే 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. భట్టి ప్రకటనతో విద్యార్ధులు, నిరుద్యోగుల ఆందోళన రూపంలో మొదటిదెబ్బ తగిలినట్లయ్యింది.

విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 25వేల పోస్టుల భర్తీతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రేవంత్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్ధులు, నేతలంతా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వేల పోస్టులతోనే ప్రభుత్వం డీఎస్సీని నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో నిరుద్యోగులు, విద్యార్ధులు ఆందోళనలు మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 25వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాల్సిందే అని గట్టిగా కూర్చున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో యువత ప్రతిరోజు ఆందోళనలు చేస్తునూ దీక్షలకు కూడా దిగారు. దాంతో వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుగా రంగంలోకి దిగేసింది.

ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులు, నిరుద్యోగులకు మద్దతుగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ కూడా రంగంలోకి దిగారు. దాంతో ప్రభుత్వానికి మండిపోయింది. దాంతో బీఆర్ఎస్ నేతలపైన కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ఇపుడు ఏమైందంటే అసలు సమస్య పక్కకుపోయి కాంగ్రెస్-బీఆర్ఎస్ గొడవలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలోనే శనివారం అర్ధరాత్రి విద్యార్ధులు అశోక్ నగర్, దిల్ షుఖ్ నరగ్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని డీఎస్సీ, గ్రూప్స్ కు కోచింగ్ ఇచ్చే సెంటర్ల దగ్గర వందలాది మంది విద్యార్ధులు చేరి పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. ఉదయానికి పరిస్ధితిని సమీక్షించిన రేవంత్, భట్టి తదితరులు మధ్యాహ్నానికి ఒక ప్రకటనచేశారు. అదేమిటంటే తొందరలోనే 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోందని.

విద్యార్ధులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు డీఎస్సీ, గ్రూప్ 2,3 పరీక్షలను వాయిదా వేయటం సాధ్యంకాదన్నారు. ఎందుకంటే పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు 2 లక్షల మంది ఇప్పటికే హాల్ టికెట్లను కూడా డౌన్ లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. విద్యార్ధుల ఆందోళనలను భట్టి బీఆర్ఎస్ కుట్రగా అభివర్ణించేశారు. ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోను బొక్కలే వెతుకుతుందని, అడ్వాంటేజ్ తీసుకుంటుందన్న విషయం భట్టీకి తెలీదా ? పదేళ్ళ కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిందిదే కదా. విద్యార్దులు ఆందోళనలతో రోడ్డెక్కారంటే అందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతకానితనమే ఎక్కువగా కనబడుతోంది. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఎందుకు ప్రకటించలేదు ? మెగా డీఎస్సీని ప్రకటించకపోవటం రేవంత్ ప్రభుత్వం తప్పే.

ఒకేసారి అన్ని పోస్టులను భర్తీ చేయలేమని అనుకున్నపుడు అదే విషయాన్ని మొదట్లోనే విద్యార్ధులు, నిరుద్యోగులకు చెప్పుండాల్సింది. 25 వేల పోస్టులను రెండు విడతలుగా భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పలేదు. తాము ఏమిచేసినా చెల్లుబాటవుతుందని ప్రభుత్వం అనుకుంటే విద్యార్ధులు ఊరుకుంటారా ? విద్యార్ధుల ఆందోళనల దెబ్బకు రేవంత్ ప్రభుత్వానికి దిమ్మతిరిగి సడెన్ గా 6 వేల పోస్టులకు తొందరలోనే నోటిఫికేషన్ జారీచేయబోతోందని ప్రకటన చేయాల్సొచ్చింది.

Tags:    

Similar News