రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు హాజరయ్యారు. ఎస్‌ఐపీబీ సమావేశానికి సీఎస్ కె.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది. పరిశ్రమలు–వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీ లో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్‌ఐపీబీ ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని సీఎం అన్నారు. భూములు కేటాయించిన ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంత మందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆమోదం పొందిన ప్రాజెక్టులు
1. ఫినామ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్ – విశాఖలో రూ.205 కోట్లు పెట్టుబడి, 2500 ఉద్యోగాలు.
2. శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ– చిత్తూరులో రూ.282 కోట్లు పెట్టుబడి, 1400 ఉద్యోగాలు.
3. రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్ – కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.1800 కోట్లు పెట్టుబడి, 380 ఉద్యోగాలు.
4. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ – కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.3600 కోట్ల పెట్టుబడి, 760 ఉద్యోగాలు
5. జెఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ – కడప జిల్లాలో రూ.2000 కోట్ల పెట్టుబడి, 1380 ఉద్యోగాలు
6. పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ – శ్రీకాకుళం జిల్లాలో రూ.204 కోట్లు పెట్టుబడి, 1000 ఉద్యోగాలు
7. పీవీఎస్ గ్రూప్ – విజయనగరం జిల్లాలో రూ.102 కోట్ల పెట్టుబడి ,500 ఉద్యోగాలు
8. ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్– నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టు, రూ.4708 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు
9. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ – విశాఖలో రూ.328 కోట్ల పెట్టుబడి, 1100 ఉద్యోగాలు
10. లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్– విశాఖలో రూ.86 కోట్ల పెట్టుబడి, 720 ఉద్యోగాలు
11. స్టార్ టర్న్ హోటల్స్ ఎల్‌ఎల్ పీ– తిరుపతిలో రూ.165 కోట్ల పెట్టుబడి , 280 ఉద్యోగాలు
12. గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ – తిరుపతి నాయుడుపేట సెజ్ లో రూ.1147 కోట్ల పెట్టుబడి, 1475 ఉద్యోగాలు
13. యాక్సెలెంట్ ఫార్మా – తిరుపతి శ్రీసిటీలో రూ.1358 కోట్ల పెట్టుబడి, 1770 ఉద్యోగాలు
14. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – కర్నూలు జిల్లాలో (సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ ఉత్పత్తి), రూ.6933 కోట్ల పెట్టుబడి, 2138 ఉద్యోగాలు
15. జెఎస్ డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ – కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రూ.4500 కోట్ల పెట్టుబడి( రెండు దశల్లో), 2500 ఉద్యోగాలు
16. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్– అనకాపల్లి జిల్లా(ఫోటో వోల్టాయిక్ ప్లాంట్) రూ.3700 కోట్ల పెట్టుబడి,లు,1200 ఉద్యోగాలు
17. లారస్ ల్యాబ్స్ – అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.5630 కోట్ల పెట్టుబడి, 6350 ఉద్యోగాలు
18. లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్– విశాఖ, విజయవాడలలో రూ.1222 కోట్లు పెట్టుబడి, 1500 ఉద్యోగాలు
19. ఏస్ ఇంటర్నేషనల్ – చిత్తూరు జిల్లా కుప్పంలో డైరీ యూనిట్ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలు
20. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ ఇండియా– అచ్యుతాపురం సెజ్ లో ఫుట్ వేర్, టాయ్స్ తయారికీ అనుమతి
21. వీఎస్‌ఆర్ సర్కాన్ – శ్రీకాకుళం జిల్లాలో రూ.39 కోట్ల పెట్టుబడి, 246 ఉద్యోగాలు
22. అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్ – కష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.500 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.