తిరుమలలో సమస్యలా? ఫిర్యాదు చేయాలని ఉందా?
నవంబర్ 7న 'డయల్ యువర్ ఈఓ'
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-05 12:35 GMT
టీటీడీ ఈఓతో మాట్లాడాలంటే.. ఈ నంబర్ కు 0877-2263261 ఫోన్ చేయండి.
తిరుమలలో సమస్యలపై టీటీడీ ఈఓతో నేరుగా మాట్లాడవచ్చు. ఈ నెల "ఏడో తేదీ డయల్ యువర్ ఈఓ" కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మది గంటల నుంచి పది గంటల వరకు ప్రజలు ఫోన్ చేయడం ద్వారా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తో నేరుగా మాట్లాడవచ్చు అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
తిరుమల అన్నమయ్య భవన్ లో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో అందుబాటులో ఉంటారు. శ్రీవారి దర్శనం నుంచి వసతి, మాతృశ్రీ తరిగొండ వెంబమాంబ అన్నదాన సత్రం, శ్రీవారిసేవ తోపాటు యాత్రికులు ప్రధానంగా ప్రజలు తమ సూచనలు, సమస్యలు నేరుగా వివరించడానికి టీటీడీ ప్రతినెలా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
"యాత్రికులతో నేరుగా మాట్లాడడం వల్ల అనే సమస్యలు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆ కోవలోనే ఇప్పటి వరకు అనేక సంస్కరణలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టిన తరువాత రెండోసారి ఆ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అక్టోబర్ మూడో తేదీ నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా దాదాపు 40 మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సమస్యలతో పాటు అనేక సూచనలు కూడా చేశారు. ఆ సమస్యల్లో చాలా వరకు అప్పటికి అప్పుడే అందుబాటులో ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు.
యాత్రికుల నుంచి తీసుకునే సూచనల వల్ల మెరుగైన సేవలు అందించడనికి వీలు ఉంటుందిని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా, శ్రీవారి సేవకుల ద్వారా యాత్రికుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇవన్నీ టీటీడీ ఐటీ విభాగంలో రికార్డు అవుతాయని తెలిపారు. యాత్రికుల ప్రస్తావించిన అంశాలను నివేదిక ద్వారా తెలుసుకోవడం ద్వారా తిరుమలలోనే కాకుండా, సేవలు మెరుగు పరచడానికి టీటీడీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.