ఐఎన్‌ఎస్ నిస్తార్ (INS Nistar).. భారత్ నావికాదళ అమ్ముల పొదిలోకి తొలి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డైవింగ్ సపోర్టు యుద్ధనౌక (Diving Support Vessel)! ఇతర యుద్ధనౌకల మాదిరిగా కాకుండా ఈ నిస్తార్ నౌకకు ఓ ప్రత్యేకత ఉంది. అది అలాంటిలాంటి ప్రత్యేకత కాదు.. 1971లో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళంతో సహా విశాఖ నగరాన్ని ధ్వంసం చేయడానికి దొంగచాటుగా వచ్చిన పాకిస్తాన్ జలాంతర్గామి పీఎన్‌ఎస్ ఘాజీని తుత్తునియలు చేసిన ఘనత ఈ నిస్తార్‌ది. అప్పట్లో జరిగిన యుద్ధంలో పాక్‌స్థాన్ ఓటమిలో కీలకపాత్ర పోషించిందీ, భారత్‌కు విజయాన్ని అందించిందీ ఈ నిస్తార్. అలా తన సుదీర్ఘ సేవల నుంచి నిస్తార్ యుద్ధనౌక 1989లో నిష్క్రమించింది.
ఆ తర్వాత అదే పేరుతో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కొత్త నిస్తార్ యుద్ధనౌకను నిర్మించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఆ బాధ్యతను విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)కు అప్పగించింది. నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ నిస్తార్‌ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ శుక్రవారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో జాతికి అంకితం చేశారు.
నిస్తార్‌ను జాతికి అంకితం చేస్తున్న రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్‌సేథ్
నిస్తార్ ప్రత్యేకతలు ఏమిటి?
ఐఎన్‌ఎస్ నిస్తార్ యుద్ధనౌకకు పలు ప్రత్యేకతలున్నాయి. దీని బరువు 9,350 టన్నులు. పొడవు 118.4 మీటర్లు. వెడల్పు 22.8 మీటర్లు. ఈ యుద్ధనౌక నిర్మాణానికి రక్షణ శాఖ రూ.2,396 కోట్లు వెచ్చించింది. యార్డ్–11190 పేరుతో రూపొందించిన ఈ నౌకలో ఏర్పాటు చేసిన ఎయిర్/మిక్స్‌డ్ డైవింగ్ కాంప్లెక్స్ షిప్ 75 మీటర్ల వరకు సముద్రంలో డైవింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. నీటి అడుగున డైవింగ్ సర్వేలు, తనిఖీలు చేపట్టడంలో కీలకం కానుంది. సముద్రం అడుగు నుంచి 15 టన్నుల బరువును ఎత్తడానికి వీలుగా ఈ నౌకలో మెరైన్ క్రేన్‌ను కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి యుద్ధనౌకకు ఐదు జనరేటర్లు ఉంటాయి. ఇప్పటిదాకా 2 మెగావాట్ల డీజిల్ జనరేటర్లు మాత్రమే యుద్ధ నౌకల్లో వినియోగించారు. కానీ విస్తార్‌కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ను అమర్చారు. నిస్తార్ 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాలు నిర్వహించగలుగుతుంది. డీప్ సబ్ మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్‌తో అమర్చడం వల్ల ఆపదలో ఉన్న జలాంతర్గాములకు కూడా సాయపడుతుంది. అంతేకాదు.. సముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాల పర్యవేక్షణలో ఈ నిస్తార్ కీలక పాత్ర పోషిస్తుంది.
కార్యక్రమానికి హాజరైన నేవీ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు
విశాఖ కేంద్రంగానే నిస్తార్ సేవలు..
మునుపటి నిస్తార్ మాదిరిగానే సరికొత్త నిస్తార్ కూడా విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంగా సేవలు అందించనుంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా హిందుస్థాన్ షిప్‌యార్డు దీనిని రూపొందించింది. దీనికి పలుమార్లు హార్బర్ ట్రయల్స్, సీ ట్రయల్స్ నిర్వహించింది. అన్ని విధాలా సంతృప్తి చెందాక దీనిని జాతికి అంకితం చేయడానికి లైన్ క్లియర్ అయింది.
నేవీ శక్తి మరింత పటిష్టంః రక్షణశాఖ సహాయమంత్రి
ఐఎన్‌ఎస్ నిస్తార్ డైవింగ్ సపోర్టు వెస్సల్.. ఇది నేవీకే కాదు.. దేశ రక్షణలోనూ పాలుపంచుకుంటుంది. నేవీ శక్తిని మరింత పటిష్టం చేస్తుంది. నిస్తార్ రాకతో భారత నావికాదళ శక్తి మరింత పటిష్టమవుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించడం అభినందనీయం. ప్రపంచం భారత్ రక్షణ శక్తి సామర్థ్యాల వైపే చూస్తోంది’ అని రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ నిస్తార్ జాతికి అంకిత చేసే సందర్భంగా పేర్కొన్నారు.
నేవీ అధిపతి త్రిపాఠీ ఏమన్నారంటే?
ఇండో–పాక్ యుద్ధంలో అప్పటి నిస్తార్ వివేష సేవలందించింది. ఈ కొత్త నిస్తార్ కూడా అంతకంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నిస్తార్ జాతికి అంకితం చేయడం ద్వారా ఈ తరహా యుద్ధనౌకలున్న కొన్ని దేశాల సరసన భారత్ చేరింది. ‘ప్రతిసారీ ప్రత్యేక నౌక అవసరం వచ్చినప్పుడు హెచ్‌ఎస్‌ఎల్ టీమ్ తన ప్రతిభను ప్రతిసారీ నిరూపపించుకుంటుంది. ఐఎన్‌ఎస్ జల ఉష నుంచి నిస్తార్ వరకు మీ నైపుణ్యం కొనసాగుతోంది’ అంటూ నావికాదళ ప్రధానాధికారి త్రిపాఠీ తెలుగులో కొనియాడారు.
వేడుకగా నిస్తార్ జాతికి అంకితం..
వాస్తవానికి నిస్తార్ యుద్ధనౌకను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆయన కార్యక్రమం రద్దయింది. దీంతో శుక్రవారం ఉదయం కేంద్ర రక్షణశాఖ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ విశాఖ నావల్ డాక్‌యార్డులో ఐఎన్‌ఎస్ నిస్తార్‌ను నేవీ ఉన్నతాధికారుల ఆనందోత్సాహాల నడుమ జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో భారత నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ, నేవీ మాజీ అధిపతి సునీల్ లాంబా, తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాల్కర్, హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ సీఎండీ కమొడోర్ హేమంత్ ఖాత్రి, నిస్తార్ కమాండర్ అమిత్ బెనర్జీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.