కింగ్ కోబ్రా! పాముల్లో రారాజు అదే. ఆ పేరు వింటేనే ఒళ్లు గగుర్బొడుస్తుంది. ఇక దాన్ని చూస్తే మరింత కంపరమెత్తిపోతుంది. పేరుకు ఇది కింగ్ కోబ్రానే గానీ.. ఇతర విషపూరిత పాములకంటే ఆచితూచి కాటేస్తుంది. కానీ అవేమీ తెలియని మనుషులు ప్రాణభయంతో వాటిని చంపేస్తున్నారు. దీంతో కింగ్ కోబ్రాలుగా పిలిచే గిరి నాగులు క్రమంగా అంతరించిపోతున్నాయి. కొన్నేళ్ల తర్వాత ఇవి భావి తరాలకు కనిపించకుండా పోయే ప్రమాదంలో పడుతున్నాయి. ఈ కింగ్ కోబ్రాలు దేశంలోని పశ్చిమ, తూర్పు కనుమల్లో ఉనికిలో ఉన్నాయి. తూర్పు కనుమల్లో ఇవి కనుమరుగు కాకుండా వాటి సంరక్షణతో పాటు పరిశోధన కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ నేతృత్వంలో, మరికొన్ని సంస్థలు నడుం బిగించాయి.
కింగ్ కోబ్రా (ఓఫియోఫేగస్ హనా)ల ఆవాసానికి తూర్పు కనుమలు అనుకూలంగా ఉంటాయి. వాతావరణం, నేల స్వభావం, నీరు, దట్టమైన అటవీ ప్రాంతం వంటివి వీటికి అనువుగా ఉండేందుకు దోహదపడుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమలు విస్తరించి ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఈ కింగ్ కోబ్రాల ఆవాసాలు ఉన్నాయి. అయితే ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో అటవీ నిర్మూలన, అడవుల దగ్ధం, వేగవంతమైన పట్టణీకరణ, పర్యావరణం దెబ్బతినడం వంటివి వీటి ఉనికిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల సంతానోత్సత్తికి విఘాతం కలిగిస్తున్నాయి. అంతేకాదు.. ఇవి ప్రతికూల వాతావరణ, ఆవాస పరిస్థితులతో పాటు గుడ్లు పెట్టి పొదగడానికి అరణ్యం నుంచి జనారణ్యంలోకి చొచ్చుకు వస్తుండడంతో మనుషుల చేతిలో హతమవుతున్నాయి. ఇవన్నీ గిరి నాగుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. దేశంలో అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణ జాబితా (షెడ్యూల్–1)లో పెద్దపులితో పాటు కింగ్ కోబ్రాను కూడా చేర్చారు. అందువల్ల ఈ కింగ్ కోబ్రాలు అంతరించిపోకుండా వాటి పరిరక్షణ, సంరక్షణలకు ప్రాధాన్యత పెరిగింది. అంటే.. పులిని చంపినా, దాని చర్మం తీసినా ఎలాంటి శిక్ష విధిస్తారో.. కింగ్ కోబ్రాను చంపిన వారికీ అంతే శిక్ష పడుతుందన్న మాట!
కింగ్ కోబ్రాను ఎందుకు రక్షించాలంటే?
అనేక ఇతర పాముల మాదిరిగా కాకుండా కింగ్ కోబ్రాలు ఇతర విష పూరిత పాముల (నాగు పాము, రక్త పింజర, పొడపాము వంటివి)లతో పాటు విష రహిత పాములను కూడా తింటూ పాముల అధిక జనాభాను నియంత్రిస్తాయి.
ఇవి ఎలుకలను కూడా తింటాయి. ఎలుకల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఇతర పాము జాతులను నియంత్రించడం ద్వారా ఎలుకల జనాభాను అదుపు చేయగలుగుతాయి. ఈ కింగ్ కోబ్రాలు వ్యవసాయ తెగుళ్లు, వ్యాధి వాహకాలను నియంత్రణకు పరోక్షంగా దోహదపడతాయి.
పులులు అటవీ సంరక్షణకు ప్రతీక అయినట్టే తూర్పు కనుమలలో సరీసృపాల సంరక్షణకు కింగ్ కోబ్రాలు భూమిక పోషిస్తాయి. వాటి రక్షణతో అటవీ పర్యావరణ వ్యవస్థల సంరక్షణకు సహాయ పడుతుంది.
నాగు పాము వేరు.. కింగ్ కోబ్రా వేరు..
చాలా మంది నాగుపామునే కింగ్ కోబ్రా అనుకుంటారు. పడగ విప్పడం వల్ల చూడటానికి ఈ రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఈ రెండూ వేర్వేరు. శాస్త్రీయంగానూ వీటికి సామీప్యత లేదు. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం ఓఫియోఫేగస్ హనా. నాగు పాము శాస్త్రీయ నామం నాజా నాజా. జన్యుపరం గాను, శాస్త్రీయంగానూ దగ్గర సంబంధం లేదని నిపుణులు చెబుతారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే? పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో ఉండే కింగ్ కోబ్రాల్లో వ్యత్యాసం ఉందని ఇటీవల గౌరీశంకర్ అనే బెంగళూరుకు చెందిన పరిశోధకుడు జరిపిన పరిశోధనలో తేలింది. తూర్పు కనుమల్లో ఉన్నవి హోఫియోఫేగస్ హనాగాను, పశ్చిమ కనుమల్లోనివి హోఫియోఫేగస్ కాలింగలుగా గుర్తించారు. రక్త నమూనాలను బట్టి ఇవి వేర్వేరు జాతులుగా నిర్ధారించారు.
కింగ్ కోబ్రాలు అంతగా కాటేయవా?
గిరి నాగులు (కింగ్ కోబ్రాలు) సాధారణంగా ఎవరినీ కాటేయవు. చాలాసార్లు వాటంతట అవే జనానికి దూరంగా వెళ్లిపోతాయి. జనం కంటపడితే కొన్నిసార్లు నాలుగైదు అడుగుల ఎత్తులో పడగ విప్పి నోరు తెరిచి ముందుకు వస్తూ కాటేయడానికే అన్నట్టు భయపెడ్తాయి. కానీ ఎవరైనా చంపేందుకు ప్రయత్నించినప్పుడే ఆత్మరక్షణకు కాటేస్తాయి. కింగ్ కోబ్రాలతో పోల్చుకుంటే ఇతర పాములే మనుషులను ఎక్కువగా కాటేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కింగ్ కోబ్రాలెక్కడున్నాయి?
కింగ్ కోబ్రాల ఉనికి తూర్పు కనుమల పరిధిలోని పోలవరం నుంచి శ్రీకాకుళం జిల్లా సీతంపేట వరకు ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, విజయనగరం జిల్లా పార్వతీపురం, వేపాడ, ఎస్‌కోట, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, సీతంపేటల్లోని అటవీ ప్రాంతాల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంది. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ గిరి నాగుల ఆవాసాలున్నాయి. కానీ మన నల్లమల అడవుల్లో మాత్రం కింగ్ కోబ్రాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
గుడ్లు పెట్టడానికి గూళ్లు కడతాయి..
ప్రపంచంలో గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ఏకైక పాము కింగ్ కోబ్రా. గుడ్లు పెట్టడానికి ఆకులతో గూడు కడుతుంది. వాటిని పొదగడానికి రెండున్నర నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో నెల రోజుల పాటు ఆ పాము ఏమీ తినదు. ఒక్కో గిరి నాగు 30–40 గుడ్లు పెడుతుంది. వీటిలో 90 శాతం పొదిగి పిల్లల్ని పెడతాయి.
సంరక్షణ.. పరిశోథనే లక్ష్యంగా..
కింగ్ కోబ్రాల సంరక్షణ, పరిరక్షణ, పరిశోధనే లక్ష్యంగా ఎనిమిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో అటవీ శాఖ సహకారంతో తొలిసారిగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఏటా 30–40 చొప్పున ఇప్పటివరకు ఉత్తర కోస్తాంధ్రలో 180 వరకు కింగ్ కోబ్రాలను సంరక్షించి అడవుల్లోకి విడిచిపెట్టాం. కింగ్ కోబ్రాలపై చాలామంది అపోహలున్నాయి. అందువల్ల వీటిని చంపేస్తున్నారు. ఇవి అంతరించి పోకుండా వీటి సంరక్షణ ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. గత 30 ఏళ్లలో ఉత్తర కోస్తాంధ్రలో కింగ్ కోబ్రాస్ కాటుతో చనిపోయిన వారు లేరు. ఏటా దేశంలో పాము కాటుకు గురై సగటున 58 వేల మంది చనిపోతున్నారు. వీటిలో ఇతర జాతుల పాము కాట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారే అధికంగా ఉంటున్నారు. కింగ్ కోబ్రాలతో పర్యావరణం, జీవ సమతుల్యతకు ఎలాంటి ఉపయోగాలున్నాయి? వీటిని చంపితే ఎలాంటి శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది? ప్రజలతో పాటు వ్యవసాయదార్లకు, గిరిజనులకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. పాముల సంరక్షణపై అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. దీనివల్ల కింగ్ కోబ్రాలను చంపడం బాగా తగ్గింది’ అని కింగ్ కోబ్రాల సంరక్షణ ప్రాజెక్టు నిర్వాహకుడు ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ మూర్తి కంటిమహంతి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.