అమాత్యులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో 44 అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం గురువారం ఉదయం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 44 కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత వాటిని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
మంత్రులకు సీఎం వార్నింగ్
అయితే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభంలోనే అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కేబినెట్ భేటీకి ఆలస్యంగా హాజరైన నలుగురు మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. "మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా? బాధత్యగా లేకపోతే ఎలా? మంత్రులుగా ఉండి మీరే ఇలా వ్యవహరిస్తే ఎలా? కనీసం సరైన వచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? క్రమశిక్షణ పాటించాలి కదా?" అని ఆయన మందలించినట్లు తెలిసింది. సమావేశ సమయం ఉదయం 10:30 గంటలకు అని ముందే తెలిసినప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఎందుకు ప్లాన్ చేసుకోలేదని ఆ నలుగు అమాత్యులను సీఎం ప్రశ్నించారు. ఈసారి నుంచి కేబినెట్ భేటీకి ఆలస్యంగా వస్తే సహించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆ నలుగురు మంత్రులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కేబినెట్ సమావేశంలో ఒక్క సారిగా నిశ్శబ్దం అలుముకుంది. సీఎం ఆగ్రహంతో తక్కిన మంత్రులు కూడా అలెర్ట్ అయ్యారు.
అజెండాలో కీలక అంశాలు
ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 44 అంశాలపై మంత్రి మండలిలో చర్చ జరుగుతోంది. వీటిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
టీడీపీ కార్యాలయానికి సీఎం
కాగా, కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ నేతలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తారు. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.
- జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల నియామకంపై వేసిన త్రిసభ్య కమిటీలతో చర్చలు జరుపుతారు. (గతంలో ఈ కమిటీ పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం).
- అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులతోనూ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేబినెట్ సమావేశంలో ఆలస్యంగా వచ్చిన మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయిన విషయం పొక్కడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది.