సోషల్‌ మీడియాపై సీఎం కీలక వ్యాఖ్యలు

తోట చంద్రయ్య హత్య కేసుపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

Update: 2025-09-25 11:54 GMT


ఆంధ్రప్రదేశ్ లో గంజాయి పండించినా, స్మగ్లింగ్‌ చేసినా కేసులతో పాటు వారి ఆస్తుల సీజ్‌ చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు చెప్పారు. 

రాష్ట్రంలో డ్రగ్స్‌ సమస్య గురించి అసెంబ్లీ లో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఉద్యమంగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈగల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నామని చెబుతూ  రాష్ట్రంలో గంజాయి సాగును జీరో కల్టివేషన్‌ స్థాయికి తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.అయితే పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమేర అక్రమ రవాణా జరుగుతోందని ఆయన చెప్పారు.

సోషల్ మీడియా కు ముకుతాడు వేస్తాం

సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా వేధింపులు, ఫేక్‌ ప్రచారాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

దీనికి కట్టడి చేసేందుకు చర్యలు సూచించాలని  ఒక క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శాంతి భద్రతలపై గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతలు, సోషల్‌ మీడియా దుర్వినియోగం, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ,ప్రజల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు
సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా వేధింపులు, ఫేక్‌ ప్రచారాలు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ప్రపంచంలో ఎక్కడున్నా ఫేక్‌ ప్రచారాలు చేసే నేరస్తులను తీసుకొస్తాం. ఈ తరహా నేరాలపై సీరియస్‌గా వ్యవహరిస్తాం,‘ అని స్పష్టం చేశారు.
సైబర్‌ క్రై మ్ పై అప్రమత్తత
సైబర్‌ ఫ్రాడ్స్‌తో రాష్ట్రంలో కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని, బాగా చదువుకున్న వ్యక్తులు కూడా మోసపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, కస్టమ్స్‌ పేరిట డబ్బులు కాజేసే ఘటనలు జరుగుతున్నాయని, సైబర్‌ క్రై మ్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఫోరెన్సిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని, ప్రజలు సైబర్‌ ఫ్రాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
హత్య కేసులపై వేగవంతమైన దర్యాప్తు
తోట చంద్రయ్య హత్య కేసుపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. బాపట్లలో అమర్నాథ్‌ గౌడ్‌ను కాల్చిన ఘటనపై కూడా దర్యాప్తు జరుగుతోందని సీఎం తెలిపారు. డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడు గత పాలనలో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఊరేగింపుగా తీసుకెళ్లిన ఘటనను గుర్తు చేస్తూ, ఇలాంటి కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శాంతిభద్రతలపై రాజీ లేదు
‘పౌరులు భద్రంగా ఉండాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలి. గత పాలకుల హయాంలో జరిగిన అరాచకాలను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. పోలీసు బలగాల ఆధునీకరణకు వచ్చిన డబ్బును కూడా గత పాలకులు దుర్వినియోగం చేశారు,‘ అని సీఎం విమర్శించారు. శాంతిభద్రతల విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని, రాష్ట్ర ప్రజలు, ఎన్డీఏ కార్యకర్తలు గత పాలకుల చేతుల్లో బాధితులైన విషయాన్ని ప్రస్తావిస్తూ, శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో నిర్వహించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు.
Tags:    

Similar News