‘విజయవాడ బ్రదర్స్ గొడవ’, రట్టయిన ఉర్సా క్లస్టర్ లోగుట్టు
చంద్రబాబుకు తెలియకు విజయవాడ ఎంపి కంపెనీకి విశాఖ భూములు దక్కి ఉంటాయా?;
Byline : G.P Venkateswarlu
Update: 2025-04-23 12:46 GMT
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. చిన్నీపై నానీ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో చర్చకు తెరలేపాయి. వీళ్ల గొడవ సాధారణకు రక్తికట్టదు. అయితే, ఈ సారి వీళ్ల గొడవలో నుంచి ఒక రహస్యం బయటపడింది.అందుకే ఈ నాని,చిన్న గొడవ సర్వత్రా ఆసక్తి కరంగా మారింది. ఉర్సా క్లస్టర్ (Ursa Clusters Pvt Ltd) అనే కంపెనీకి విశాఖ ఖరీదైన భూమిని కారు చౌకగా తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం కట్టబెట్టిందనే వార్త గప్పు మంది. ఈ కంపెనీ రు. 5728 కోట్ల తో ఎఐ డేటా సెంటర్ (AI Hyperscale Data Centre) విశాఖ లో ఏర్పాటు చేస్తుందట. దీనికోసం 61 ఎరకాల భూమిని తీసుకుంది.
పెద్ద పెద్ద కంపెనీలకు ప్రభుత్వాలు భూములివ్వడం సాధారణమే. ఎందుకంటే, ఈ కంపెనీలు పెట్టబడులు తెస్తాయి. ఉద్యోగాలు ఇస్తాయి. ముక్కూమొకలేని కంపెనీకి ఉందునా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన కంపెనీ, ఏరంగంలోనూ అనుభవం లేని కంపెనీకి, మరీ ముఖ్యంగా ఇద్దరు టెకీలు ఏర్పాటు చేసిన కంపెనీ కోట్లాది విలువయిన విశాఖ భూములను ఇచ్చారనే వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఉంది. దీని వెనక వున్నవ్యక్తి శక్తి ఎవరూ పసిగట్ట లేకపోతున్నారు. ఈ కంపెనీ బోగస్ అని, దీనికి సంబందించి భూమి ఒక పెద్ద స్కాం అని పత్రికలు, సోషల్ మీడియా వాపోతున్నాయి. ఇలాంటపుడు నాని ఎక్స్ ఎక్కి, ఈ కంపెనీ ఎవరిదో కాదు, మా తమ్ముడిదే అని అనేశాడు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి కూడా లేఖ రాశాడు. నాని చిన్న గొడవ వల్ల ఈ యాంగిల్ బయటకు వచ్చింది. ఉర్సా క్లస్టర్ అనేది చిన్ని కంపెనీ అని చంద్రబాబు నాయుడికి,చిన్నబాబుకి తెలియకుండా సరైన అడ్రసు కూడా లేని కంపెనీకి భూములిస్తారా? నాన్ని పేల్చిన బాంబు పేలుతుందో లేదో వేచి చూద్దాం.
అసలు నాన్ని చిన్న గొడవ ఏమిటి?
విజయవాడ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు. ఎక్కడ ఏమి జరిగినా విజయవాడలో ఆ విషయాలు చర్చకు రావాల్సిందే. మీడియాకు కూడా బలమైన కేంద్రం కావడం వల్ల పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ నిత్యం నలుగుతుంటాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) లు రాజకీయంగా విజయవాడలో ఆధిపత్యం చెలాయించే విషయంలో గొడవలు మొదలయ్యాయి. ఎవరి ఆధిపత్యాన్ని వారు నిలుపుకునేందుకు అడుగులు వేస్తున్నారు. పదేళ్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నానీ చాలా మంది నగరవాసుల్లో పట్టు పెంచుకున్నారు. 2024 ఓటమితో వైఎస్సార్ సీపీ నుంచి కూడా వైదొలిగి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
ఇటీవల నగరంలో ఏ కార్యక్రమం జరిగినా నాని హాజరువుతున్నారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమాల్లో పాల్గొనటం భవిష్యత్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడానికేనని పలువురు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన తమ్ముడు నగరంలో ప్రత్యర్థిగా మారటాన్ని ఆయన సహించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో అన్నీ తానై నగరంలో రాజకీయాలు కేశినేని చిన్ని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రిగా చెలాయిస్తున్న నారా లోకేష్ అండదండలు పూర్తిగా చిన్నీకి ఉన్నాయి. లోకేష్ అండతోనే రాజకీయాల్లోకి వచ్చి విజయవాడ ఎంపీ సీటు సాధించ గలిగారు.
కేశినేని శివనాథ్ (చిన్ని), కేశినేని శ్రీనివాస్ (నాని) సోదరుల మధ్య వైరం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. స్వయానా అన్నదమ్ములైన ఈ ఇద్దరూ రాజకీయంగా వేరై, భిన్న పార్టీల ద్వారా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి పోటీపడుతున్నారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వ భూమి కేటాయింపు వివాదం వీరి వైరాన్ని మరింత తీవ్రతరం చేసింది.
సోదరుల రాజకీయ ప్రయాణం
కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ నుంచి 2014, 2019లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరపున ఎంపీగా గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు TDP నుంచి YSRCP లో చేరారు. ఈ నిర్ణయం తమ్ముడు కేశినేని శివనాథ్ (చిన్ని)కు టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించడంతో నాని పార్టీ మారాల్సి వచ్చింది. చిన్ని అమెరికాలో వ్యాపారవేత్తగా విజయం సాధించి, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి 2024లో విజయవాడ ఎంపీగా గెలిచారు. నాని మాత్రం వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రాజకీయ ఓటమి, సోదరుల మధ్య వ్యక్తిగత, రాజకీయ వైరాన్ని మరింత పెంచింది. చిన్ని మొదటి సారి రాజకీయ ప్రవేశం చేసినా రాజకీయ రాజధాని అయిన విజయవాడలో గెలవడంతో ఆయన ఆధిపత్యం పార్టీలోనూ, ప్రజలపైనా పెరిగింది.
ఉర్సా క్లస్టర్స్ భూమి కేటాయింపు వివాదం
ఇటీవల విశాఖపట్నంలో 60 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడం వివాదాస్పదమైంది. కేశినేని నాని ఈ కంపెనీని చిన్ని బినామీగా నడుపుతున్నారని, దాని డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో కలిసి ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన బహిరంగ లేఖలో.. ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదని, గతంలో అబ్బూరి సతీష్ 21 సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్ పేరుతో మోసాలు చేశారని పేర్కొన్నారు. ఈ కేటాయింపును రద్దు చేయాలని నాని డిమాండ్ చేశారు.
నాని ఆరోపణలు
నాని ఆరోపణలు కేవలం భూమి కేటాయింపుతోనే ఆగలేదు. చిన్ని విజయవాడలో ఇసుక వ్యాపారం, ఫ్లైయాష్ తోలకం, గ్రావెల్ అమ్మకం, భూ దందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, చిన్ని తన కార్యాలయానికి నీతి నిజాయితీకి మారుపేరైన ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడాన్ని విమర్శిస్తూ దాన్ని "చార్లెస్ శోభరాజ్ భవన్" (Charles Sobharaj Bhavan) గా మార్చాలని వ్యంగ్యంగా సూచించారు. ఈ ఆరోపణలు ప్రజల కోరికగా పేర్కొన్నారు. ఇది వారి మధ్య వ్యక్తిగత ద్వేషాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
మరో వైపు చిన్ని ఈ ఆరోపణలపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఇది వివాదాన్ని మరింత రసవత్తరంగా మార్చింది. అయితే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు, నాని బ్యాంకులను మోసం చేసి అప్పులు ఎగ్గొట్టారని, ఆస్తులు సీజ్ అయ్యాయని, అసూయతో చిన్నిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు.
రాజకీయ, వ్యక్తిగత వైరం
ఈ వివాదం కేవలం భూమి కేటాయింపుతో సంబంధం కలిగినది కాదు. ఇది సోదరుల మధ్య లోతైన రాజకీయ, వ్యక్తిగత వైరాన్ని ప్రతిబింబిస్తుంది. నాని టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి మారడం, చిన్ని టీడీపీలో చేరి ఎంపీగా గెలవడం వారి మధ్య పోటీని తీవ్రతరం చేసింది. నాని ఓటమి తర్వాత, చిన్ని విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్యం సాధిస్తున్నారనే అసూయ కూడా ఈ ఆరోపణల వెనుక ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.
సామాజిక మీడియా ప్రభావం
సామాజిక మీడియా వేదికలు, ముఖ్యంగా X, ఈ వివాదాన్ని మరింత విస్తృతం చేశాయి. నాని ఆరోపణలను పలు X పోస్టులు విస్తృతంగా చర్చలకు తెరలేపాయి. కొన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఖాతాలు ఈ ఆరోపణలను ఊదిపెట్టాయి. ఈ పోస్టులు నాని ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ, చిన్నిని బినామీగా, అబ్బూరి సతీష్‌ను మోసగాడిగా చిత్రీకరించాయి.
చంద్రబాబు నాయుడు పాత్ర
నాని తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిన్ని కంపెనీకి కేటాయించిన భూమిని రద్దు చేయాలని కోరడం గమనార్హం. చంద్రబాబు టీడీపీ అధినేతగా చిన్నిని ఎంపీ అభ్యర్థిగా ఎంచుకుని గెలిపించుకున్నారు. అన్నాదమ్ముల మధ్య వివాదం టీడీపీ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఈ ఆరోపణలను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు ఈ ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వివాదం మున్ముందు ఎలా ఉంటుందనే ఆసస్తి ప్రజల్లో నెలకొంది.
కుటుంబ విభేదాలు
సోదరుల మధ్య కుటుంబ సంబంధాలు గతంలోనే ఒడిదుడుకులకు లోనయ్యాయి. చిన్ని అమెరికాలో ఉండగా, నాని విజయవాడలో రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్యం చెలాయించారు. చిన్ని తిరిగి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం, నాని ఆధిపత్యాన్ని సవాలు చేయడంతో కుటుంబ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.
కేశినేని సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర అధ్యాయంగా మారింది. ఉర్సా క్లస్టర్స్ (Ursa Clusters) భూమి కేటాయింపు వివాదం, రాజకీయ ఎజెండాలు, వ్యక్తిగత వైరం కలగలిసిన సంక్లిష్ట సమస్యగా కనిపిస్తోంది. చిన్ని నిశ్శబ్దంగా ఉండటం, చంద్రబాబు స్పందన లేకపోవడం వివాదాన్ని మరింత రహస్యమయంగా మార్చాయి. ఈ ఆరోపణలు టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఉర్సా క్లస్టర్స్ ఖండన
అయితే నానీ ఆరోపణలను ఉర్సా క్లస్టర్స్ ఖండించింది. తాము 99 పైసలకు ఎకరా చొప్పున కొనలేదని పేర్కొంది. ఆన్ లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంపెనీ డైరెక్టర్ సతీష్ అబ్బూరి(అమెరికా) మాట్లాడుతూ తాము ఐటి పార్కులో తీసుకున్న భూమిలో మూడున్నర ఎకరాలకు ఒక కోటి రుపాయలు చెల్లించామని, మరొక చోట తీసుకున్న 56.36 ఎకరాలకు ఎకరానికి రు. 50 లక్షలు చెల్లించామని చెప్పాడు. తమ కంపెనీని క్షణ్ణంగా పరిశీలించాకే ప్రభుత్వం భూమి కేటాయించిందని సతీష్ చెప్పారు