పీ-4 ఓ అగర్ బత్తీ పథకం.. పేదలను సీఎం అవమానిస్తున్నారు..
పేదలను సీఎం అవమానిస్తున్నారని సీపీఎం నేత రాఘవులు వ్యాఖ్యానించారు. భారత్, పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నివారణపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
పేదరిక నిర్మూలన కోసం టీడీపీ కూటమి అమలు చేస్తున్న పీ4 పథకంపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"ఇది అగర్ బత్తీ పథకం" అని ఆయన అభివర్ణించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నదని ఆరోపించారు.
" భగవంతుడు భక్తుడికి అనుసంధానమైనది. అనే విధంగా ఇది అగర్ బత్తీ పథకం" అని రాఘవులు అభివర్ణించారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పేరిట తెరమీదకు తెచ్చిన వారి ద్వారా పేదలను అవమానాలకు గురి చేస్తున్నారని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంటోంది" అని ఆయన ఆరోపించారు.
తిరుపతిలో మూడు రోజుల సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ శనివారంతో ముగిసింది. ఈ సమావేశాలకు హాజరైన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు బీవీ. రాఘవులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, తిరుపతి జిల్లా కార్యదర్శి వి. నాగరాజు, రాష్ట్ర నేత కందారపు మురళీతో కలిసి మీడియాతో అనేక విషయాలపై మాట్లాడారు. పీ-4 ద్వారా సీఎం చంద్రబాబు ఫిలాసఫీ ప్రజలను అవమానం చేసేదే అని ఆయన విమర్శించారు.
పత్రికా స్వేచ్ఛ, వాక్, సభా స్వాతంత్రం, టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలు ప్రధానంగా రైతులు, గిట్టుబాటు ధరలు, అదానీ సంస్థతో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై జరిగే నష్టాలపై ప్రజా చైతన్యం ప్రారంభించాం. వాటిపై పోరాటాలు సాగించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్టు పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు వెల్లడించారు.
"ప్రజల జీవనప్రమాణాలు పెంచడం, వారికి అవసరమైన గూడు, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటివి అందుబాటులోకి తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే" అని రాఘవులు గుర్తు చేశారు. అయితే, పీ4 ద్వారా సంపన్నుల దయాదాక్షిణ్యాలపై పేదల జీవించాల్సిన అనివార్య పరిస్థితి కల్పించడం అనేది దారుణమైన విషయమని ఆయన నిరసన వ్యక్తం చేశారు. పేదలను కార్పొరేటు శక్తులకు అప్పచెబుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరిట కొన్ని కంపెనీలు కేటాయించే డబ్బులను కొన్ని కుటుంబాలకు ఖర్చు చేయడం ద్వారా దారిద్యం రాష్ట్రంలో పోతుందనుకోవడం భ్రమేనని అన్నారు.
వేతనాలు పెంచితే చాలు
రాష్ట్రంలో దారిద్ర్య నిర్మూలనకు సహకరించే మార్గదర్శకులైన సంపన్నులకు బివి. రాఘువులు ఓ సూచన చేశారు. పారిశ్రామికవేత్తలు నడిపే కంపెనీల్లో పని చేసే కార్మికులకు వేతనాలు పెంచి, వారి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన హితవు పలికారు.
పాక్ ను ఇలా.. ఒంటరి చేయాలి..
"పాక్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతను యుద్ధానికి మళ్లించడం వాంఛనీయం కాదు. అంతర్జాతీయ వేదికలపై సాక్ష్యాధారాలతో దాయాది దేశంపై దౌత్యపరంగానే ఒత్తిడి చెంచాలి" అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే పేరుతో కూడా యుద్ధానికి కాలుదువ్వడం కూడా సమంజసం కాదన్నారు.
"భారత్, పాక్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కూడా కేంద్ర ప్రభుత్వానికి యుద్ధానికి వ్యతిరేకం అనే విషయాన్ని స్పష్టం చేశామని రాఘవులు స్పష్టం చేశారు.
నేపాల్ రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిన సమయంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దౌత్యం నెరిపిన విషయాన్ని గుర్తు చేయగా,
"మా పార్టీ విధానం ఇప్పటికే తెలియజేశాం. కేంద్ర ప్రభుత్వం కోరితే, మా విధానం మేరకు దౌత్యపరమైన చర్చలకు చొరవ తీసుకుంటాం" అని బీవీ. రాఘవులు ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.
"లౌకిక స్వభావానికి దూరమైన టీడీపీ తన పాత పద్ధతినే అనుసరించాలని కూడా ఈపాటికే హెచ్చరించాం" అని రాఘవులు చెప్పారు. టీడీపీ ఏర్పాటు నుంచి మూలసిద్ధాంతాన్ని ఆ పార్టీ విస్మరించింది. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"రెండు దేశాల మధ్య యుద్ధానికి తమ పార్టీ వ్యతిరేకం" అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు పునరుద్ధాటించారు. దేశంలో ఉద్రిక్తతకు పహల్గావ్ మారణహోమాన్ని ఆసరాగా చేసుకుని, విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే వేదికలను కొనసాగిస్తూ ప్రశ్నించే శక్తులను బ్లాక్ చేయడం దారుణమని విమర్శించారు.
"ఉగ్రవాదులను శిక్షించాలంటే దొరకడం లేదు. ఆధారాలతో ప్రపంచ వేదికలపై నిరూపించాలి. తద్వారా పాకిస్థాన్ ను ఒంటరి చేసి, దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలి" అని రాఘవులు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ను ఒంటరిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన ఓ సూచన చేశారు. తద్వారా ఉగ్రవాదులను భారత్ కు అప్పగించే విధంగా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మాత్రమే రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు సాధ్యం అవుతుందని ఆయన విశ్లేషించారు.
యుద్ధానికి వ్యతిరేకమైనా..
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన సమయంలో కూడా మౌలికంగా సిపిఎం యుద్ధానికి వ్యతిరేకమని రాఘవులు స్పష్టం చేశారు. అయితే, ఎదుటివారు కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోండి అనేది అర్థం కాదని వివరించారు. దేశప్రజలందరూ ఐక్యత చాటుకుంటున్న సందర్భం ఇది. మత వైషమ్యాలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు.
చర్చిస్తామంటే... హత్య చేస్తారా?
మావోయిస్టులపై కేంద్ర బలగాలు సాగిస్తున్న ఆపరేషన్ కగార్ ఆపాలని రాఘవులు డిమాండ్ చేశారు. కగార్ తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు.
" చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటిస్తోంది. దీనిని ఏమాత్రం ప్రభుత్వం అంగీకరించకుండా హత్యలు చేస్తోంది. ఇది అత్యంత దారుణమైంది" అని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామికవాదుల నుంచి వస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకుని, కగార్ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్పులు విరమించి, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన కోరారు.