నేడు సీతారాముల వారికి సీఎం పట్టు వస్త్రాలు

సీఎం చంద్రబాబు రెండు రోజుల్లో రెండు జిల్లాల పర్యటనలు చేయనున్నారు.;

Update: 2025-04-11 04:42 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు బిజీబిజీగా ఉండనున్నారు. రెండు రోజుల్లో రెండు జిల్లాల పర్యటనలు చేయనున్నారు. శుక్రవారం, శనివారాల్లో క్షణం తీరిక లేకుండా స్వామి వార్ల కార్యక్రమాలతో పాటుగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల్లో కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే ఖాళీగా ఉండనున్నారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్‌ ఖరారైంది.

శుక్రవారం ఉదయం పది గంటలకు హెలిక్యాప్టర్‌లో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులుతో సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖి వంటి కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10:20 గంటలకు ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. 10:30 గంటలకు బీసీ వర్గాల ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతారు. 11:30 గంటలకు ప్రజావేదిక వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. దీనిలో సీఎం ప్రజలతో నేరుగా ముచ్చటిస్తారు. ఇది పూర్తి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం ఉంటుంది. ఈ కీలక సమావేశంలో టీడీపీ శ్రేణులకు దిశా నిర్థేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, వాటిని ప్రజల్లో ఎలా తీసుకెళ్లాలి, క్రమశిక్షణతో ఎలా మెలగాలి, కూటమి భాగస్వాములతో ఎలా సఖ్యతగా ఉండాలనే దానిపై తెలుగుదేశం పార్టీ కేడర్‌కు దిశా నిర్థేశం చేయనున్నారు.
అది పూర్తి అయిన తర్వాత హెలికాప్టర్‌లో తిరిగి విజయవాడ గన్నవరం ఎయిర్‌ పోర్టుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి కడప పర్యటనకు బయలు దేరనున్నారు. ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. 4:30 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒంటిమిట్టకు చేరుకుంటారు. నేరుగా ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. అక్కడ నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రాత్రి వరకు స్వామివారి సన్నిధిలోనే ఉంటారు. సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు జరిగే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. స్వామివారి ఆలయం నుంచి తిరిగి రాత్రి 8:40గంటల ప్రాంతంలో ఒంటిమిట్ట టీటీడీ గెస్‌హౌస్‌కు చేరుకుంటారు. శుక్రవారం రాత్రికి అక్కడే బస చేస్తారు.
శనివారం ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్‌ హౌస్‌ నుంచి తిరిగి ప్రయాణం అవుతారు. రోడ్డు మార్గంలో కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 10:30 గంటలకు విజయవాడ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 10:40 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Tags:    

Similar News