కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

మూలా నక్షత్రాన సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Update: 2025-09-29 12:11 GMT

మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని దుర్గమ్మను కోరుకున్నానని చెప్పారు. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని, ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర సంపద పెరగాలని ఆకాంక్షించారు.

నవరాత్రుల సందర్భంగా ఇప్పటి వరకూ 8 లక్షల మంది దుర్గమ్మ దర్శనం పొందారు. ఇవాళ ఒక్క రోజే 1.20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం, పవిత్రతను కాపాడుతూ ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రసాదంలో నాణ్యత పెంచాం, వీఐపీ దర్శనాలను క్రమబద్దీకరించాం, ఎక్కువ సమయం సాధారణ భక్తులకే కేటాయించాం. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది, ప్రజలకు సేవ చేస్తున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
2014-19 మధ్య కాలంలోనే దుర్గ గుడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. నేడు మళ్లీ అభివృద్ది పనులు చేస్తున్నాం, ఒకేసారి 1,500 మందికి సరిపడేలా రూ.26 కోట్లతో అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నాం, ఆరు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రూ.27 కోట్లతో నూతన ప్రసాదం తయారీ కేంద్రం మూడు నెలల్లో పూర్తి చేస్తామని, రూ.5 కోట్లతో పూజా మండపం, దాతల సహకారంతో యాగశాల నిర్మిస్తామని చెప్పారు. రూ.14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి పనులు ఐదు నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 గోదావరి, 2028 కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు దుర్గమ్మ దీవెనలుండాలని ఆకాంక్షించారు.
దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాం. తిరుమల కొండపై ఉన్నంత స్థలం ఇంద్రకీలాద్రిపై లేదు, విజయవాడ నగరంలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఆదాయం లేని దేవాలయాలకు ప్రభుత్వం నిధులు ఇస్తోంది, ప్రముఖ దేవాలయాలకు డబ్బులు కొదవ లేదని పేర్కొన్నారు.
Tags:    

Similar News