మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కల్పించిన సీఎం చంద్రబాబు
గత జగన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఊరట కల్పించింది. కేసులను ఉపసంహరించుకుంది.;
Byline : Vijayakumar Garika
Update: 2024-10-16 08:25 GMT
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఊరట కల్పించింది. అఖిల భాతర సర్వీస్ అధికారుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి పెగాసెస్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడరని, జగన్ ప్రభుత్వం ఆయనపై అభియోగాలు మోపింది. నిబంధనల ప్రకారం కేసులు నమోదైన ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఏడాదిన్నర అయినా విచారణ పూర్తి చేయలేదు. దీంతో ఆ అభియోగాలు వీగిపోయాయి. ఈ నేపథ్యంలో నాడు ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన ఆ అభియోగాలను ఉపసంహరించుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు కేసుల నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు విముక్తి కల్పించిన ప్రభుత్వం మరో కేసుపై నిర్ణయం తీసుకోవలసి ఉంది.
జగన్ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిఘా పరికరాల కొనుగోళ్లల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. ఐదేళ్ల పాటు సస్పెండ్ చేశారు. కేసులు నమోదు చేయడంతో పాటు సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రానికి నాటి జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో 2019 నుంచి దాదాపు ఐదేళ్ల పాటు న్యాయపోరాటం చేసిన ఆయన చివరికి విజయం సాధించారు. పదవీ విరమణ రోజుకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ దక్కించుకున్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ విరమణ చేశారు. నాడు ఏబీ వెంకటేశ్వరరావు చేసిన న్యాయ పోరాటానికి పెద్ద ఎత్తున్న మద్దతు లభించింది.