జమిలీకి జై కొట్టిన సీఎం చంద్రబాబు

జమిలీ ఎన్నికలకు దేశమంతా సంపూర్ణ మద్దతు పలకాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2024-10-09 14:34 GMT

జమిలీ ఎన్నికలకు సీఎం చంద్రబాబు నాయుడు జై కొట్టారు. జమిలీ ఎన్నికలకు దేశమంతా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. సుస్థిర పాలన ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఒన్‌ నేషన్‌.. ఒన్‌ ఎలక్షన్‌ మంచిదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఆరు నెలలకు, సంవత్సరానికో ఎలక్షన్లు కాకుండా, పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలు కూడా ఏక కాలంలో పూర్తి చేసుకొని మిగిలిన ఐదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, సాధికారతపైనే శ్రద్ధ పెట్టాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. దీనిని అందరూ కూడా అర్థం చేసుకోవాలన్నారు. నేషన్‌ మొత్తం దీనికి సపోర్టు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో పది సార్లు ఎన్నికలు పెట్టుకుని, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతోంటే మరో రాష్ట్రంలో బై ఎక్షన్‌లు జరుగుతున్న విధానం సరైంది కాదన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే ఒక అగ్ర దేశంగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దానిలో సఫలీకృతం అవుతున్నారని అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, దీనికి జమిలీ ఎన్నికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని అన్నారు. హర్యానాలో బీజేపీ మూడో సారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్డీఏ కూటమికి ఇది శుభసూచకమన్నారు. సుపరిపాలన వల్ల వచ్చే లాభాలు ప్రజలు చూశారని అందుకే గెలిపించారన్నారు. ప్రజలు ప్రధాని మోదీపై నమ్మకం ఉంచారని తెలిపారు. సుస్థిరత, అభివృద్ధికి హర్యానా ప్రజలు ఓటేశారని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్ళొచ్చిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి జగన్‌ పెద్ద అరిష్టమని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వమన్నారు.

Tags:    

Similar News