నెల్లూరులో ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.;

Update: 2025-08-09 14:47 GMT

రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రోజు భగత్‌ సింగ్‌ కాలనీలో పట్టాలు అందుకున్న 633 మందికి శుభాకాంక్షలు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు భగత్‌ సింగ్‌ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆన్లైన్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ:. 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని...పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమని అన్నారు.

నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులు మస్తానమ్మ, సయ్యద్‌ సబీహా అనే మహిళలు సిఎంతో మాట్లాడారు. దశాబ్దాలుగా తాము ఇక్కడ నివాసం ఉంటున్నా...ఈ రోజు ప్రభుత్వ చొరవ వల్ల తమకు పట్టాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన సిఎం చంద్రబాబుకు వాళ్లు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం తమకు పట్టాల పంపిణీ పేరుతో మోసం చేసిందని.. కానీ కూటమి ప్రభుత్వలో మంత్రి నారాయణ సహకారంతో తమకు కలగా మిగిలిన పట్టాలు నేడు తమ చేతికి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.

నెల్లూరు భగత్‌ సింగ్‌ కాలనీలో 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భగత్‌ సింగ్‌ కాలనీ 54వ డివిజన్‌ లో వెంకటేశ్వరపురం హైవేను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ సుమారు 20 ఏళ్ల నుంచి కొంతమంది పేదవారు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కొంతమంది పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక్కడివారికి కనీస మౌళిక వసతులు లేవు. తాగడానికి నీరు, కరెంట్, రోడ్లు, వీధి లైట్లు కాలువలు వంటి సదుపాయాలు లేవు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే భగత్‌ సింగ్‌ కాలనీకి సదుపాయాలపై దృష్టి పెట్టారు.
ఈ కాలనీలో మొత్తం 1400 కుటుంబాలున్నాయి. ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, రోడ్లు, కాలువలు వీధిలైట్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే 2019కు ముందే ఇక్కడి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రయత్నాలు చేసినా... కొన్ని కారణాల వల్ల జరగలేదు. 2019లో ప్రభుత్వం మారిపోవడంతో కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాల ప్రక్రియ వేగవంతమైంది. సర్వేచేసి, అన్ని రికార్డులు పరిశీలించి 1429 మందికి పట్టాలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా...తొలివిడతలో 633 మందికి ఆన్‌లైన్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
Tags:    

Similar News