ఏపీలో కమ్ముకున్న కారుమబ్బులు..రాయలసీమకు ఫ్లాష్ ప్లడ్స్ హెచ్చరికలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.
ఈ నేపథ్యంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదు అని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఎండీ, ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. బంగాళాఖాతంలోని తీవ్రఅల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.