చిత్తూరు: అంబేడ్కర్ విగ్రహం దగ్ధం వెనుక ఏమి జరిగింది?
వెదురుకుప్పం దళిత సర్పంచ్ కుట్ర చేశారంటున్న చిత్తూరు ఎస్పీ.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-06 11:53 GMT
అంబేడ్కర్ విగ్రహం దగ్ధం ఘటన వెనుక ప్రత్యర్థులపై ప్రతీకార కుట్ర ఉందా? ఆ కుట్రలో దళిత సర్పంచ్ గోవిందయ్య ఇరుక్కున్నారా? ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వకపోవడం వెనుక అసలు కథ వెలుగులోకి వచ్చిందని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ స్పష్టం చేశారు. క్లూస్, సాంకేతిక ఆధారాలు సేకరించామని ఆయన చెప్పారు.
"గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో జరిగిన ఘటన కులవివక్ష, ఉద్దేశపూర్వంగా జరిగింది కాదు. అనుకోని విధంగా జరిగిన ఘటన. ఇందులో సర్పంచ్ గోవిందయ్య కుట్ర కోణం ఉంది. ఆయనను అరెస్టు చేశాం" అని ఎస్పీ తుషార్ డూడీ మీడియాకు వెల్లడించారు.
మీడియాతో మాట్లాడుతున్న చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి
చిత్తూరు జిల్లా గంగాథరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామం కూడలిలో శుక్రవారం రాత్రి అంబేడ్కర్ విగ్రహం దగ్ధమైన ఘటన తెలిసిందే. శనివారం ఈ ఘటనపై దేవళంపేట దళిత సర్పంచ్ గోవిందయ్య దళితులు, బీసీలతో కలిసి రాస్తారోకోకు దిగారు. స్థానిక పోలీసులు స్పందించలేదని కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. సర్పంచ్ గోవిందయ్య తోపాటు నిరసనకు దిగిన వారిని సముదాయించడానికి విఫలయత్నం చేశారు.
"ఈ ఘటనకు గ్రామంలోని టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు కారణం" అని కూడా సర్పంచ్ గోవిందయ్య గట్టిగా వాదించారు.
కేసు నమోదు.. విచారణ
దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహం దహనంపై పంచాయతీ కార్యదర్శి జీ. రాము నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టినట్టు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సోమవారం మీడియాకు చెప్పారు. జరిగిన ఘటనపై విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దీంతో పాటు
"క్లూస్ టీం, సీసీ కెమెరాల పుటేజీ తోపాటు ఘటనా స్థలంలోని నివాసితులు, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా దర్యాప్తు చేశాం" అని ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. ఇది కుట్రపూరితంగా జరిగిన ఘటన కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనను ఆసరాగా చేసుకున్న సర్పంచ్ గోవిందయ్య ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారని వివరించారు. ఆయన కథనం ఇది.
"దేవళంపేటలో సంతగేటు వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సమీపంలోనే సులోచన చిన్న బంకు ఏర్పాటు చేసుకున్నారు. అందులో గుర్తు తెలియని వ్యక్తి అంటించడంతో మంటలు చెలరేగాయి. ఆ పొగ వల్ల విగ్రహం దెబ్బతింది. అక్కడికి ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు కూడా వెళ్లాయి. అన్ని రకాల ఆధారాలు సేకరించారు. పుత్తూరు డీఎస్పీ సారధ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు ప్రత్యేక బృందాలు గ్రామంలో విచారణ చేశారు. అన్ని ఆధారాలు సేకరించారు" అని ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు.
ఈయన ఇంకా ఏమంటారంటే..
దేవళంపేటలో వేకువజామున జరిగిన ఈ సంఘటనపై సంబంధించి సాంకేతికంగా సెల్ డేటా కూడా సేకరించాం. శనివారం వేకువజామున రెండు, మూడు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో దిల్షాద్ నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటిలో పనిమనిషి మీనాక్షి మొదట చూసినట్టు విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. వెంటనే దిల్షాద్ కు చెప్పింది. ఈ విషయం తెలిసిన సులోచన వెంటనే షాపు దగ్గరికి వచ్చారని విచారణలో తెలుసుకున్నామని ఆయన వివరించారు.
క్లూ ఇలా దొరికింది..
షాపు కాలుతుంటే చూసిన వెంటనే పోలీసులు లేదా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వకుండా యజమాని సులోచన తాత్సారం చేశారు. ఈ కోణమే అంబేడ్కర్ విగ్రహం దగ్ధం కేసులో చిక్కుముడి వీడిందని ఎస్పీ తుషార్ డూడీ వివరించారు.
"సర్పంచ్ గోవిందయ్య గ్రామపెద్ద. ఆయనకు చెప్పడంతో వెంటనే వచ్చారు. మంటలు ఆర్పినాం" అని షాపు యజమాని సులోచన చెప్పిందని ఎస్పీ వివరించారు.
ఇక్కడే కుట్ర..
ఘటన జరిగిన వెంటనే పోలీసులకు చెప్పకపోవడం వెనుక దాగి ఉన్న కుట్రను దర్యాప్తు బృందాలు తేల్చాయని ఎస్పీ తుషార్ డూడీ వివరించారు. అంబేడ్కర్ విగ్రహానికి సమీపంలో దగ్ధమైన షాపు యజమాని సులోచనను సర్పంచ్ గోవిందయ్య మేనేజ్ చేశారనే విషయం బయటపడిందని ఆయన తెలిపారు.
"అసలు సంగతి బయటకు రానివ్వకుండా సర్పంచ్ గోవిందయ్య మేనేజ్ చేశాడు. షాప్ కాలిపోయిన బాధితురాలు సులోచనతో ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయి. ఈ సంఘటన ద్వారా ప్రత్యర్థి సతీష్ నాయుడుపై నెపం నెట్టి, సంచలనం సృష్టించాలని ప్రయత్నించారు. దీనిద్వారా పరిహారం రావడంతో పాటు, నా పదవీకాలంలోపు మంచి ప్రదేశంలో దుకాణం ఏర్పాటుకు స్థలం కూడా కేటాయిస్తానని సులోెచనకు సర్పంచ్ గోవిందయ్య మభ్యపెట్టి, అసలు ఘటన తెరపైకి రాకుండా వ్యవహరించారు. విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి" అని ఎస్పీ వెదురుకుప్పం సంఘటన వెనక కారణాలు వెల్లడించారు. సర్పంచ్ గోవిందయ్యను అరెస్టు చేశామని ఆయన ప్రకటించారు.