రెండో వాటర్‌ క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జల ప్రవేశం!

భారత నావికాదళంలోకి మరో యుద్ధనౌక వచ్చి చేరింది. విశాఖలో దీనిని తూర్పు నావికాదళ (ఈఎన్‌సీ) ప్రధానాధికారి వైస్‌ అడ్మిర్‌ రాజేష్‌ పెంధార్కర్‌ జలప్రవేశం చేశారు.

Update: 2025-10-06 15:35 GMT
నేవీలో చేరిన ఐఎన్‌ఎన్‌ ఆండ్రోత్‌

ఇండియన్‌ నేవీ తన శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా రూపొందిన యుద్ధనౌకలు నేవీలోకి చేరుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 18న దేశంలోనే తొలి యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ నౌక ఐఎన్‌ఎస్‌ ఆర్నాలను ప్రారంభించగా, అదే శ్రేణికి చెందిన రెండో నౌక ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ సోమవారం నావికాదళంలోకి చేరింది.


ఐఎన్‌ఎన్‌ ఆండ్రోత్‌కు ఈఎన్‌సీ చీఫ్‌ పెంధార్కర్‌ గౌరవ వందనం

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ ప్రత్యేకతలివీ..
ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. ఇది కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో తయారైంది. 77 మీటర్ల పొడవుతో 1500 టన్నుల బరువును కలిగి ఉన్న ఈ ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌.. తీర ప్రాంతం, సముద్ర జలాల్లో జలాంతర్గామి (సబ్‌మెరైన్‌) వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టడానికి, పర్యవేక్షించడానికి ఉద్దేశించారు. ఈ నౌకలో అత్యాధునిక ఆయుధాలు, యంత్రాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను అమర్చారు. ఇది ఉపరితల ముప్పును కచ్చితత్వంతో గుర్తించడానికి, ట్రాక్‌ చేయడానికి, తటస్థీకరణకు వీలు కల్పిస్తుంది. మెరైన్‌ డీజిల్‌ ఇంజిన్లలతో నడిచే మూడు వాటర్‌ జెట్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌లతో నడిచే ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ చాలా చురుకైన పాత్ర పోషిస్తుంది. మారిటైమ్‌ సర్వైలెన్స్, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ, కోస్టల్‌ డిఫెన్స్‌ మిషన్లు, ఇంటెన్సివ్‌ మారిటైమ్‌ ఆపరేషన్ల వరకు విస్తరిస్తుంది. సముద్ర నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సముద్ర జలాల్లో శత్రు దేశ సబ్‌మెరైన్లను కనిపెట్టి వెనువెంటనే ధ్వంసం చేస్తుంది.

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ వద్ద ఈఎన్‌సీ చీఫ్‌ పెంధార్కర్‌ 

 ఈ పేరు ఎందుకు పెట్టారు?

భారతదేశ సముద్ర రంగంలో చారిత్రక, వ్యూహాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన లక్షద్వీప్‌ సమూహంలో ఉత్తరాన ఉన్న ఆండ్రోత్‌ ద్వీపం ఉంది. ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ను ప్రవేశపెట్టడంతో భారతదేశ సముద్ర భద్రతను బలోపేతానికి దోహదపడుతుంది. అందువల్ల ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌కు ఆ పేరు పెట్టారు.

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ డెక్‌పై నేవీ అధికారులు

జల ప్రవేశం చేయించిన ఈఎన్‌సీ చీఫ్‌..
ఈ ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ నౌకను విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌ యార్డులో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌.. నేవీ అధికారులు, జీఆర్‌ఎస్‌ఈ నిపుణుల సమక్షంలో ఆనందోత్సాహాల నడుమ జల ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాజేష్‌ పెంధార్కర్‌ మాట్లాడుతూ.. ‘ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ నేవీలో చేరికతో నేవీ యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ ఫేర్‌ సామర్థ్యాలకు, ముఖ్యంగా సముద్ర తీరాల్లో ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ముప్పును పసిగట్టడం, ఎదుర్కోవడంలో అద్భుత ప్రతిభను కనబరుస్తుంది. శత్రు సబ్‌మెరైన్లను క్షణాల్లో తుత్తునియలు చేస్తుంది. ప్రాంతీయ శాంతి, భద్రత, సముద్ర సహకారంలో దేశ నిబద్ధతను చాటి చెబుతుంది. నేవీలో ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ ప్రవేశం గర్వించదగ్గ మైలు రాయిగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ నౌకను ప్రారంభించే ముందు దీని విశిష్టతలను గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ ప్రతినిధులు పెందార్కర్‌కు వివరించారు.
ఇటీవల నేవీలో చేరిన యుద్ధనౌకలు..
– రష్యాలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ తమాల్‌ యుద్ధనౌకను ఈ ఏడాది జులైలో ఇండియన్‌ నేవీలోకి చేరింది.
– జులై 18న డైవింగ్‌ సపోర్టు వెసల్‌ ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ నౌకను హిందుస్థాన్‌ షిప్‌యార్డు నిర్మించింది.
– నీలగిరి నౌకల శ్రేణికి చెందిన ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి షిప్‌లను ఆగస్టు 26న ఒకేసారి జాతికి అంకితం చేశారు.
– దేశంలోనే తొలి వాటర్‌ క్రాఫ్ట్‌ నౌకగా పేరొందిన ఐఎన్‌ఎస్‌ అర్నాలను జూన్‌లో నేవీలో చేరగా తాజాగా సోమవారం అదే శ్రేణికి చెందిన రెండో నౌక ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం చేయడంతో నేవీ అమ్ముల పొదిలో చేరినట్టయింది.
Tags:    

Similar News