చిత్తూరు: జగన్ పర్యటనతో.. అప్రకటిత కర్ఫ్యూ

మామిడి రైతుల పరామర్శకు వైసీపీ చీఫ్ జగన్ కొద్దిసేపట్లో బంగారుపాలెం రానున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-09 06:08 GMT
బంగారుపాళెం జాతీయ రహదారిపై బారికేడ్లు

ధరలు లేక నష్టపోయిన మామిడి రైతులను పరామర్శించడానికి వైసిపి చీఫ్ వైఎస్. జగన్ రాక నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాలెం వద్ద మామిడికాయల మండిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంకొద్ది సేపట్లో (బుధవారం ఉదయం) సందర్శించనున్నారు. బాధిత రైతులతో ఆయన నేరుగా మాట్లాడడానికి వైసిపి శ్రేణులు ఏర్పాటు చేశాయి.
అడుగడుగునా పోలీసులు

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో ఆంధ్రాలోకి ప్రవేశించే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. అటు పలమనేరు, ఇటు.కుప్పం నుంచి అడుగడుగున రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు.
జాతీయ రహదారులతో పాటు పల్లెదారులను కూడా పోలీసులు దిగ్బంధనం చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత కానీ వదలడం లేదు.
"పెట్రోల్ బంకుల వద్ద కూడా పోలీసులను కాపలా ఉంచారు" అనే వైసిపి నాయకులు ఆగ్రహ వ్యక్తం చేశారు. అభిమానులు స్వచ్ఛందంగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లకుండా, వారికి పెట్రోల్ కూడా నింపకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి..
పొలాల గట్ల వెంట

బంగారుపాలెంలో జగన్ పర్యటన కోసం ప్రధాన రహదారుల వెళ్ళడానికి ఆంక్షలు అమలవుతున్నాయి. నీతో వైసిపి కార్యకర్తలు ద్విచక్ర వాహనాల్లో చెట్టు పుట్ట వెంట పొలాల గట్ల మీద నుంచి కూడా బంగారు పాలెం చేరుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకున్న వైసిపి క్యాడర్ బంగారు పాలెం వైపు భారీగా కదులుతోంది.
పోలీసుల ఆంక్షలు
బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ రాక నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. బంగారుపాలెం బద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు 30 మంది, మామిడికాయల మార్కెట్లో 500 మంది రైతులను మాత్రమే అనుమతిస్తామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఈపాటికి ప్రకటించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు, పల్నాడు లో జరిగిన సంఘటనలు నేపథ్యంలో జన సమీకరణ చేయవద్దని కూడా ఆయన ఆదేశించారు.
వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి వాజ్పేయి కూడా స్పందించారు.
"ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే జగన్ పర్యటనకు అనుమతించాం" అని డీఐజీ షేముషి బాస్ పై ప్రకటించారు. షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా ఆమె హెచ్చరించారు.
జగన్ పర్యటనపై నిఘానేత్రం
వైసిపి చీఫ్ వైయస్ జగన్ బంగారుపాలెం పర్యటనపై పోలీసులు నిఘా నేత్రాన్ని ఉంచింది. డ్రోన్ కెమెరాలతో పాటు సీసీటీవీ ల ద్వారా కూడా ప్రతి విషయాన్ని సున్నితంగా రికార్డు చేయడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా పటిష్ట బందోబస్తు, ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి వాజ్పాయ్ స్పష్టం చేశారు.
ఆమె ఏం చెప్పారంటే.
"చిత్తూరు జిల్లా పుంగనూరులో 9,000 మంది, వైయస్ జగన్ పర్యటన జరిగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి మరో 9,000 మంది, చిత్తూరు నుంచి 5000, పలమనేరు నుంచి 4000 మందిని సమీకరించడానికి వైసిపి నాయకులు సన్నాహాలు చేశారు" దీనిపై మాకు స్పష్టమైన సమాచారం ఉంది అని డి ఐ జి పేర్కొన్నారు.
డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలతో జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందని ఆమె వెల్లడించారు.
బంగారుపాలెం లో వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో పడమటి తాలూకాలోని 377 మంది వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు.
"వారిలో 55 మంది పై కేసులు కూడా ఉన్నట్లు గుర్తించాం" అని కూడా డీఐజీ వెల్లడించారు.
బంగారుపాలెం కు 1500 కార్లు, 3500 ద్విచక్ర వాహనాల్లో జనాన్ని తరలించడానికి వైసిపి నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారని కూడా ఆమె చెప్పారు.
బంగారుపాలెం మండలం, చుట్టుపక్క ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిఘా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆధారాలు సేకరించడానికి పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేసుకున్నారు.
మేము తగ్గం
తమ పార్టీ అధినేత వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైసిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు భారీగా జన సమీకరణకు సకల సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం చిత్తూరు కుప్పం పలమనేరు పుంగనూరు మదనపల్లి జీడీ నెల్లూరు పూతలపట్టు నియోజకవర్గాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు, వైయస్ జగన్ అభిమానులు వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. పోలీసుల ఆంక్షలు కూడా ఖాతర చేయని అనేక ప్రాంతాల్లోని అభిమానులు అడవులు, పొలాలు, ముళ్ళ పొదల వెంట అడ్డదారుల్లో జాతీయ రహదారి పైకి చేరుకునే దృశ్యాలు అక్కడక్కడా కనిపించాయి. అతి కష్టం మీద ద్విచక్ర వాహనాలను మళ్లించుకుని వచ్చిన వైసిపి మద్దతుదారులు బంగారుపాలెం చేరుకునేందుకు సాగుతున్నారు.

ఈ పరిస్థితుల్లో బంగారు పాలెం లో ఏమి జరగబోతోంది అనేది ఆసక్తికర అంశంగా మారింది.
బాధిత మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుని ఉన్నాయనేది వేచి చూడాలి.

Similar News