చిత్తూరు: నకిలీ మద్యం ఫ్యాక్టరీనే ఏర్పాటు చేశారు...
పాలవ్యానులో దుకాణాలకు సరఫరా. అదుపులో కింగ్ పిన్?
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-04 04:47 GMT
చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారం బట్టబయలైంది. ఓ ఇంటి ముందు పాలవ్యాను ఆగి ఉంటుంది. లోపల మాత్రం తయారు చేసేది నకిలీ మద్యం. ఆ మద్యం పాలవ్యానులోనే అనేక ప్రాంతాలకు నిరాటంకంగా సరఫరా చేశారు. ఎక్సైజ్ పోలీసుల దాడితో ఈ నకిలీ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. చిత్తూరు (అన్నమయ్య జిల్లా) తంబళ్లపల్లెలో భారీ నకిలీ మద్యం రాకెట్ బయటపడింది.
ఆధునిక యంత్రాలు అమర్చుకున్నారు. సీసాలకు బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించారు. మద్యం సీసాలపై ఆంధ్ర ఎక్సైజ్ లేబుళ్లు వాడారు. లైసెన్స్ మద్యం దుకాణం నిర్వాహకుడు ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి సూత్రధారిగా వ్యవహరించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అతనితో పాటు తొమ్మది మందిని అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో వర్కర్లు పరారీ అయ్యారు.
నెలల కాలంపాటు నిరాటంకంగా సాగిన ఈ అక్రమ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూడడం వెనుక కూడా అనేక సందేహాలకు తెరతీసింది.
ఏమి స్వాధీనం చేసుకున్నారంటే..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంప్ ఎక్సైజ్, స్థానిక పోలీసులు గుర్తించారు. సుమారు కోటికి పైగా విలువ చేసే యంత్రాలు, కల్తీ మద్యానికి ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్ డ్రమ్ములు, మూటల్లో కార్క్ లు, కాళీ సీసాలు, మ్యాను ఫ్యాక్చరింగ్ యంత్రాలు, గుట్టలు, గుట్టలుగా బాక్సుల్లో సిద్ధంగా ఉన్న కల్తీ మద్యం బాటిళ్లు, మద్యం బాటిళ్లపై అతికించే స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు.
కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి ఈ విషయాలు ధృవీకరించారు.
"మా సిబ్బందితో దాడి చేసిన సమయంలోనే బెల్టు షాపునకు మద్యం తీసుకుని వెళ్లడానికి ఓ వ్యక్తి వచ్చాడు. ఆయనతో పాటు బైక్ కూడా స్వాధీనం చేసుకున్నాం" అని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి చెప్పారు.
ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే...
చిత్తూరు జిల్లా, పరిసర సమీప మండలాల్లో ఎన్ని దుకాణాలకు? ఎప్పటి నుంచి నకిలీ మద్యం సరఫరా చేశారు? ఎప్పటి నుంచి ఈ అక్రమ మద్యం తయారీ వ్యవహారం సాగుతోందనే సందేహాలు తెరమీదకు వచ్చాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో వెలుగు చూసిన ఈ వ్యవహారం వివరాలు ఇవి.
జాతీయ రహదారిలోనే..
తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం జాతీయ రహదారిపై ఉంటుంది. దీనికి సమీపంలోనే ఉన్న ఓ ప్రదేశంలో చాలా రోజుల నుంచి నకిలీ మద్యం తయారు చేయడానికి ఓ ఫ్యాక్టరీ తరహాలోనే యంత్రాలు, వర్కర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖకు సమాచారం అందినట్లు తెలిసింది. వివరాలు సేకరించిన కడప ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి సారధ్యంలోని సిబ్బంది, ములకలచెరువు పోలీసులు దాడులు నిర్వహించారు.
అవాక్కయిన పోలీసులు
ములకలచెరువుకు సమీపంలోని ఓ ఇంటిలో ఏకంగా ఫ్యాక్టరీని పోలిన నకిలీ మద్యం తయారు కేంద్రం, అందులోని వర్కర్లు, మద్యం నిలువలు, మద్యం సీసాలు, ఖాళీ బాటిల్లు, ఆంధ్ర లేబుళ్లను చూసిన ఎక్సైజ్ పోలీసులు అవాక్కయ్యారు. ఈ కుటీర పరిశ్రమగా మార్చుకున్న ఇంటిలో తయారు చేస్తున్న నకిలీ మద్యం జిల్లాలోని అనేక దుకాణాలకు సరఫరా చేసినట్లు సందేహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో తయారు చేసిన నకిలీ మద్యం ఎన్ని జిల్లాలకు సరఫరా చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది.
పీటీఎం వ్యక్తే డాన్?
తంబళ్లపల్లె నియోజకవర్గంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ రాకెట్ కేంద్రానికి పీటీఎం (పెద్దతిప్పసముద్రం)లో లైసెన్స్ డ్ మద్యం దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తే డాన్ గా వ్యవహరించినట్లు ఎక్సైజ్ పోలీసులు సందేహించారు. నకిలీ మద్యం తయారీ కేంద్రంలోనే సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది.
ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి కథనం ఇదీ..
"మాకు అందిన సమాచారంతో పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాది చేశాం. రూ. 1.75 కోట్ల రూపాయల కల్తీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేంద్రంలో తొమ్మిది మందిని అరెస్టు చేశాం. యంత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నాం" అని క్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి మీడియాకు చెప్పారు.
ఆయన ఇంకా చెప్పారంటే..
"నకిలీ మద్యం ఫ్యాక్టరీ నుంచి సెమీ ఆటోమేటిక్ యంత్రాలు రెండు. ఓ యంత్రం సీసాలకు మూతలు బిగిస్తుంది. 35 లీటర్ల మద్యం నింపే క్యాన్లు, నకిలీ మూతలు, లేబుల్లు, హోలో గ్రామ్స్ భారీగా స్వాధీనం చేసుకున్నాం" అని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి వివరించారు.
మద్యం నింపిన 40 బాక్సులు (ఒకో బాక్సులో 45 క్వార్టర్ బాటిళ్లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. పెద్దతిప్పసముద్రంలో ఆంధ్రా వైన్స్ పేరిట లైసెన్స్ దక్కించుకున్న నిర్వాహకుడిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. ఘటనా స్థలంలో తమిళనాడు నుంచి వచ్చిన నలుగురిని, ఇద్దరు ఒరిస్పా కార్మికులు, విజయవాడకు చెందిన ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు నర్సీపట్టణం ప్రాంతానికి చెందిన వాహన డ్రైవర్ జనార్థనరావు, ఇతని అనుచరుడు రాజు కూడా అదుపులో ఉన్నాడని తెలిపారు. ఇతని ద్వారానే మద్యం తయారీకి కూలీలను తీసుకుని వచ్చారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని ఆయన చెబుతున్నారు. భవన యజమాని లక్ష్మీనారాయణ బెంగళూరులో ఉంటారు. డాబా హెటల్ నిర్వహణకు రామ్మోహన్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడని ఆయన ఖాళీ చేయడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్రారంభించిన విషయం దర్యాప్తులో తేలిందని ఎక్సైజ్ ఏసీ చంద్రశేఖరరెడ్డి వివరించారు.
ఈ నకిలీ మద్యం ఏ ప్రాంతాలకు సరఫరా చేశారు? ఎప్పటి నుంచి తయారీ ప్రారంభించారు. ఎన్ని మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం అందుబాటులో ఉందనే విషయం ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తే కానీ అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.