చిత్తూరు:మరోసారి పడగవిప్పిన కులవివక్ష

చిత్తూరు:దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-03 06:11 GMT
చిత్తూరు జిల్లా జీడీ.నెల్లూరు (వెదురుకుప్పం మండలం)లో కాలిపోయిన అంబేడ్కర్ విగ్రహం

చిత్తూరు జిల్లాలో మరోసారి కులవివక్ష బుసలు కొట్టింది. ఏకంగా రాజ్యంగా నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి చితి మంటలు పేర్చిన సంఘటనతో దళితులు, సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చాయి. దళితులు, బీసీలలో కలిసి సర్పంచ్ గోవిందయ్య రాస్తారోకోకు దిగారు. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమాచారం అందుకున్న చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సంఘటన స్థలానికి చేరుకున్నారు.


"గ్రామంలో దళితులను చిన్నచూపు చేస్తున్నారు. మమ్మలిని లేకుండా చేయాలనేది అగ్రవర్ణాల కుట్ర" అని సర్పంచ్ గోవిందయ్య ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాథర నెల్లూరు (జీడి. నెల్లూరు) ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవళంపేటలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

"ఈ రోజు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. రేపు మమ్మిలిని సజీవదహనం చేసిన దిక్కులేదు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సతీష్ నాయుడు, ఆయన అనుచరులను అరెస్టు చేయండి" దళిత సర్పంచ్ గోవిందయ్య ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ తుషార్ డూడీతో వ్యాఖ్యానించారు.
ఈ నాటిది కాదు..
గంగాథరనెల్లూరులో దీర్ఘకాలంగా వివక్షసాగుతూనే ఉంది అనడానికి తాజాగా దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం కూడా ఓ ఘటనగా చెప్పవచ్చు.
1983లో కూడా టీడీపీ మద్దతుదారులు పాదిరికుప్పంలో దళితవాడకు నిప్పు పెట్టిన సంఘటన రాష్ట్రంలో సంచలన ఘటన జరిగింది. వైసీపీ డిప్యూటీ మాజీ సీఎం కళత్తూరు నారాయణస్వామిది పాదిరికుప్పమే. ఆయన కాలంలో తీవ్ర స్థాయిలో పోరాటం సాగింది. పరస్పర దాడుల నేపథ్యంలో పోలీసులు కాల్పులు కూడా జరిపారు. దళితులకు జరిగిన అన్యాయం నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణస్వామి స్థానిక నేతలతో కలిసి ఉధృత పోరాటం సాగించారు. ఆ తరువాత కూడా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నా, అడపాదపా సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇదిలావుండగా,
2015లో కులవివక్షతకు వ్యతిరేకంగా సీపీఎం సారధ్యంలోని కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ రంగంలోకి దిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి హోదాలో వచ్చిన బివి. రాఘవులు వెదురుకుప్పంలో దళితులను ఆలయ ప్రవేశం చేయించడానికి పోరాటం సాగించారు. ఎట్టకేలకు ఆ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కేవీపీఎస్ నేతలు దళితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా గతం.
దేవళంపేటలో ఏమి జరిగింది?
గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామం కూడలిలో దళితులు అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అని దళిత సర్సంచ్ గోవిందయ్య చెప్పారు. గ్రామంలోని టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు అభ్యంతరం చెబుతువచ్చారని ఆయన ఆరోపించారు.
"సంతగేటుకు విగ్రహం అడ్డుగా ఉంది. దీనిని తొలగించాలి" అని సతీష్ నాయుడు ప్రయత్నించడంతో స్థానిక ప్రజలు, దళిత నాయకులు అడ్డుకోవడంతో సతీష్ నాయుడు ప్రయత్నాలు ఫలించలేదని గోవిందయ్య వివరించారు. గతంలో అనేకసార్లు విగ్రహం ఎలా తొలగించరో చూస్తా అని నాయుడు సవాల్ చేశారని సర్పంచ్ గోవిందయ్య వివరించారు.
విగ్రహానికి నిప్పు...

వెదురుకుప్పం మండలం దేవళంపేట కూడలిలో దళితులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి గురువారం రాత్రి చెక్కలు, కర్రలు వేసి పెట్రోల్ పోెసి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన గ్రామస్తులు, దళితులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పారు. అప్పటికే అంబేడ్కర్ విగ్రహం మంటల్లో దెబ్బతినింది.
"దేవళంపేట గ్రామానికి చెందిన టీడీపీ నేత సతీష్ నాయుడు, అతని అనుచరులు పయణి, తేజ, బుజ్జి, ఉమాపతితో కలిసి ఈ దురాగతానికి పాల్పడ్డారు" అని సర్పంచ్ గోవిందయ్య ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేయడానికి పెట్రోల్ పోసి, నిప్పు పెట్టారని, వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దేవళంపేటలో రాస్తారోకో...

గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ దళితులు శుక్రవారం ఉదయం నుంచి రాస్తారోకో  చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని బైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసుల స్పందన కూడా సరిగా లేదని దళితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గ్రామానికి చేరుకున్నారు.

"కాళ్లకు బూట్లు తొలగించి, అంబేడ్కర్ విగ్రహానికి నమస్కారం చేశారు" అనంతరం ఆయన దళితులతో మాట్లాడారు. నిందితులను శిక్షించి, రక్షణ కల్పిస్తాం అని ఆయన దళితులకు హామీ ఇవ్వడానికి శతవిధాలుగా ప్రయత్నించారు.
"కలెక్టర్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదు. నిందితులపై కేసు నమోదు చేయండి. వారిని అరెస్టు చేసే వరకు ఊరుకునేది లేదు" అని దళితులు, సర్పంచ్ గోవిందయ్య తేల్చి చెప్పారు. ఇంకా నిరసనలు కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఈ సంఘటనపై స్వయంగా విచారణ సాగిస్తున్నారు. ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Tags:    

Similar News