ప్రభుత్వ బడుల్లో పిల్లలకు రాయడం వచ్చు.. చదవడం రాదు..
ప్రభుత్వం మారినప్పుడల్లా పాలకులు విద్యా విధానాల్లో ఇష్టానుసారం మార్పులు చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల పరిస్థితి దారుణంగా తయారైంది.;
పిల్లల్లో మేధా శక్తికి ఇప్పుడు తక్కువేమీ లేదు. ఆధునిక టెక్నాలజీ యుగంలో ఏ విషయం కావాలన్నా ఇట్టే తెలుసుకునే అవకాశం టీచర్ కు ఉంది. అలాగే దానిని పిల్లలకు చెప్పే సామర్థ్యం కూడా టీచర్లకు ఉంది. అయినా ఎందుకో ప్రభుత్వ బడుల్లో 70 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులకు చదవడం రావడం లేదు. చదువు అంటేనే భయంతో వణికి పోతున్నారు. కారణాలు చెప్పటం తప్ప వాటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషించి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఇవే పరిస్థితులు ఉన్నాయి.
కారణాలు ఎన్నో...
14 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ ఉచిత విద్యను ప్రభుత్వం అందించాలి. అందుకు అనుగుణంగానే విద్యా విధానం ఉంది. గతం కంటే ప్రస్తుతం టీచర్లు అన్ని అంశాల్లోనూ తెలివైన వారు ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను అందిపుచ్చుకుని ముందుకు అడుగులు వేయగలుగుతున్నారు. అయినా ప్రాథమిక విద్య పటిష్టం కావడం లేదు. ఇందుకు టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, అక్కడి వాతావరణ పరిస్థితులు, సామాజిక అంశాలు అన్నీ కారణాలు. ప్రధానంగా పేదరికం పెద్ద బూతంలా తయారైంది. ఒక్కో కుటుంబాన్ని కోటీశ్వరులను చేస్తామని, ఆర్థికంగా ప్రతి కుటుంబం అందనంత ఎత్తుకు ఎదిగేలా చేస్తామని చెబుతున్న పాలకులు మాటలకే పరిమితం అవుతున్నారు. గొప్పలన్నీ ప్రచారం వరకే పరిమితం అవుతున్నాయి.
ఆరోపణలతో సరిపెడుతున్న పాలకులు
గత ప్రభుత్వం విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించిందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము అమలు చేశామని గత పాలకులు చెబుతున్నారు. విధానాలు ఎలా ఉన్నా విద్యార్థులకు చదువు ఎందుకు రావడం లేదనేది పెద్ద చర్చగా మారింది. ఒకటి, రెండు తరగతులను కొన్ని చోట్ల ప్రాథమిక పాఠశాలలోనే ఉంచి, మరికొన్ని చోట్ల 3,4,5 తరగతులను హైస్కూళ్లలో గత ప్రభుత్వం కలిపి వేసింది. దీని వల్ల పెద్దగా ప్రయోజనం వచ్చిందని చెప్పలేము. ఎందుకంటే ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, ఉన్నత విద్యగా హైస్కూలు విద్య ఎప్పటి నుంచో విభజించి ఉంది.
ఎలిమెంటరీ స్కూళ్లలో తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట్ల 3,4,5 తరగతుల విద్యార్థులను దగ్గరలోని హైస్కుళ్లలో కలిపి వారి టీచర్లను కూడా అక్కడి బదిలీ చేశారు. 1,2 తరగతుల వారితో పాటు అదే స్కూలులో అటాచ్డ్ గా ఉన్న అంగన్ వాడీ స్కూలును కలిపి ప్రైమరీ, ప్రీ ప్రైమరీ విద్యను అక్కడ చెబుతున్నారు. అంగన్ వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల తరువాత పిల్లలు ఎల్కేజీ, యూకేజీలో చేరుతారు. వారికి బొమ్మలు గుర్తించడం, అక్షరాలు నర్పడం, పలకడం వంటివి చెయ్యాలి. కానీ బొమ్మల వరకు చూపిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం బొమ్మలు ఇస్తోంది కాబట్టి. చదువనేది అక్కడ ఉండటం లేదు. పౌష్టికాహారం అంగన్వాడీలో పిల్లలకు అందించాలి. ఆ స్కూల్లకు పేదల పిల్లలు తప్ప డబ్బున్న వారి పిల్లలు రారు. ఎందుకంటే డబ్బున్న వారి పిల్లలను ప్లేస్కూళ్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు.
1వ తరగతి నుంచి అక్షరాలు నేర్పించి చదివించాలి. మంచి పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. అక్షరాలు నేర్చుకునే వయసు వాస్తవానికి ఐదు సంవత్సరాలు దాటితేనే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో చేర్చుకునే వయసును ఆరు సంవత్సరాలుగా మార్చింది. ఎందుకంటే పిల్లలకు చెప్పేది వినటం, తిరిగి చెప్పటం, చెప్పింది అర్థం చేసుకోవడం తెలుస్తుంది. గ్రహణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో చాలా మంది చెప్పగానే అందుకునే వారు ఉంటారు. అందుకోలేని వారు ఉంటారు. అందుకో లేని వారు పూర్తిగా వెనుకబడి పోతున్నారు. అక్షరాలు అయితే టీచర్లు రాసి ఇచ్చి కిందా పైనా పడి వారితో తిరిగి రాయిస్తున్నారు. జస్ట్ అక్షరాలు పిల్లలు చదివేలా చేస్తున్నారు.
ఆ తరువాతే సమస్య...
తెలుగు అయితే గుణింతాలు నేర్చుకోవాలి. ఉదాహరణకు అమ్మ అనే అక్షరాలను పలకాలంటే గుణింతం రావాల్సిందే. అక్షరాలకు గుణింతాలు తోడైనప్పుడు వాక్యంగా పలకాలి. కానీ పిల్లలు అమ్మ బదులు ఆమ అని మాత్రమే పొడిపొడిగా పలికే పరిస్థితి ఉంది. రెండు అక్షరాలే కాకుండా మూడక్షలు పలకాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లీషులో ఏఎన్టీ అని పలకడం కూడా చేతకావడం లేదు. దీనినే ‘కూడ బలకడం’ అంటారు. అక్షరాలను కలిపి గుణింతాలతో రాయలేక పోతున్నారు. రాసినా చదవలేక పోతున్నారు. అంటే ప్రాథమిక స్థాయిలో చదివించే వ్యవహారం అటకెక్కింది. కొన్ని పదాలు రాసి ఒకటికి నాలుగు సార్లు గతంలో చదివించే వారు. ఇప్పుడు ఆ పద్ధతికి చరమగీతం పాడారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండటం లేదు
పిల్లలు ఎలా రాస్తున్నారు. ఎలా చదువుతున్నారు. హోం వర్క్ ఎలా చేస్తున్నారు. తమ వంతుగా వారు బాగా అక్షరాలు గుర్తించి చదవాలంటే ఏమి చేయాలనే ఆలోచన ఏ ఒక్క తల్లి, తండ్రిలోనూ లేదనే వాదన ఉపాధ్యాయ వర్గాల్లో ఉంది. కనీసం పిల్లవాడు చదువుతున్నాడో లేదో గుర్తించి టీచర్ కు ఫోన్ చేసి మా పిల్లోడికి చదవడం రావడం లేదు. ఎందుకని ఇలా జరుగుతోందని అడిగే తల్లి కానీ, తండ్రి కానీ లేడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
విద్యా కమిటీలు ఉన్నా ఉపయోగం లేదు
విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన విద్యా కమిటీలు కూడా తమ విధులు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కమిటీ సమావేశం ఉందని హెడ్ మాస్టర్ సమాచారం ఇస్తే స్కూలుకు రావడం, భోజనం చేయడం, వెళ్లే టప్పుడు చార్జీల డబ్బులు తీసుకుని సంతకం చేసి వెళ్లిపోవడం. ఇదీ జరుగుతున్న తంతు. ఈ రోజు మేము కూలి పనులు పోగొట్టుకుని వచ్చాం. కూలికి పోతే రూ. 500 నుంచి రూ. 1000లు వస్తాయి. మీటింగ్ కు వస్తే మాకేమొస్తాయి అంటూ టీచర్లతోనే విద్యా కమిటీ వారు మాట్లాడుతున్నారంటే వారికి విద్యార్థులపై ఉన్న బాధ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మీటింగ్ కు వచ్చిన సమయంలో నైనా తమ పిల్లలను పిలిపించి టీచర్ తో ఆ పిల్లల చదువు గురించి ఒక్క మాటైనా మాట్లాడటం లేదు.
చదువు చెప్పటం కంటే టీచర్లకు రికార్డు వర్కు ఎక్కువైంది
టీచర్లు పిల్లలకు అక్షరాలు నేర్పించి, చదివించే పనికంటే రికార్డులు రాసే పని ఎక్కువైంది. లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం, సిలబస్ ఎంత వరకు అయిపోయిందో ఎప్పటికప్పుడు తయారు చేసిన వివరాలు ఎంఈవోకు అందించడం వంటి పనులతో సరిపుచ్చుకుంటున్నారు. పైగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది పిల్లలు ఉన్నారనుకుంటే అటువంటి చోట కూడా ఒకే ఒక్క టీచర్ ఉండటం వల్ల కూడా పిల్లలకు అక్షరాలు రావడం లేదని విద్యా పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 18 సబ్జెక్టులు ఒకే ఉపాధ్యాయుడు చెప్పాలి. ఇది సాధ్యమయ్యే పనికాదని అధికారులకూ తెలుసు. కానీ ఆవేమీ పట్టించుకోరు. పిల్లలకు చదువు ఎందుకు రావడం లేదని మాత్రమే ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తారు.
బడి మానేసిన ఓ విద్యార్థి గాధ...
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగు కొత్తపల్లి గ్రామం. విద్యార్థి పేరు గోరంట్ల లక్ష్మీ వెంకట శివ. నాలుగవ తరగతిలో ఉండగా ఆ విద్యార్థి తండ్రి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తండ్రి చనిపోవడంతో స్థానికంగా జీవించడం చేతకాని ఆ విద్యార్థి తల్లి గోరంట్ల నాగమ్మ తన కొడుకు, కుమార్తెను తీసుకుని సమీపంలోని ఎర్రగొండపాలెం మండల కేంద్రానికి చేరింది. వెయ్యి రూపాయలకు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కూలిపనులకు వెళుతోంది. కుమారుడిని సి కొత్తపల్లిలోని ఎలిమెంటరీ స్కూలు నుంచి ఎర్రగొండపాలెంలోని గిరిజన గురుకు విద్యాలయంలో చేర్చాలనుకుంది. వాళ్ల వీళ్ల కాల్లు పట్టుకుని రెసిడెన్సియల్ స్కూలులో విద్యార్థి బీసీ కోటాలో సీటు సాధించింది. ఐదో తరగతిలో విద్యార్థిని చేర్చారు. గురుకులంలో ఇంగ్లీష్ మీడియం. సి కొత్తపల్లిలో తాను చదువుకున్న స్కూలులో తెలుగు మీడియం. నాలుగో తరగతి పూర్తయినా తెలుగు అక్షరాలు కానీ, ఇంగ్లీషు అక్షరాలు కానీ ఆ విద్యార్థికి రావు. క్లాసులు మాత్రం ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఐదవ తరగతిలో అక్కడి టీచర్లు ఏమి చెబుతున్నారో అర్థం కాక గురుకులం నుంచి పరారై ఇంటికి చేరుకున్నాడు. తల్లి ఎంత సర్థి చెప్పినా నేను స్కూలుకు పోనని మెండికేశాడు. తీరా స్కూలుకు వెళ్లి టీచర్లను కనుక్కుంటే వాడికి ఒక్క అక్షరం కూడా రాదు. ఇప్పుడు మేము అక్షరాల నుంచి నేర్పడం మొదలు పెట్టలేమని వారు చేతులు ఎత్తేశారు.
అక్కడి నుంచి టీసీ ఇవ్వాల్సిందిగా కోరితే ఐదవ తరగతి పూర్తయినట్లు ఇచ్చారు. టీసీ తీసుకుని ఆ తల్లి కుమారుడుని ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ హైస్కూలులో ఆరో తరగతిలో చేర్పించింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి టీచర్లు సిలబస్ పూర్తి చేసే క్రమంలో ముందుకు వెళుతున్నారే తప్ప అక్షరాలు రాని వారి గురించి పట్టించుకోవడం లేదు. చదవడం లేదు, రాయడం లేదు ఏమిటని టీచర్ కోపగించుకోవడంతో తాను స్కూలుకు వెళ్లనని, తనకు వాళ్లు చెప్పేది ఏమీ తెలియడం లేదని, చదవటం చేతకావడం లేదని విద్యార్థి మొండికేశాడు. ఇప్పుడు లక్ష్మీ వెంకట శివ ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ హైస్కూలులో ఏడవ తరగతిలో ఉన్నాడు. ఆరు నెలలుగా స్కూలుకు పోకుండా వాళ్ల అమ్మతో మిర్చి కోతలకు వెళుతున్నాడు. పిల్లోడికి రూ. 400లు మిర్చి కోస్తే ఇస్తారని తల్లి నాగమ్మ చెబుతోంది.
ఇలా ఎంతో మంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ప్రాథమిక దశలో అక్షరాలు రాయించి చదివించే కార్యక్రమం సరిగా జరగటం లేదు. ఈ కారణంగానే క్లాసులు ప్రమోట్ అవుతున్న కొద్దీ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు.
చదువు వచ్చినా... రాక పోయినా క్లాసులు ప్రమోట్ కావాల్సిందే...
పిల్లోడికి చదువు వచ్చిందా? లేదా? అనే దానితో సంబంధం లేదు. వయసు ఎంత వచ్చింది. వయసు ప్రకారం ఏ క్లాస్ లో ఉండాలి. అనేదే ప్రస్తుత ప్రభుత్వం చూస్తున్నది. పదో తరగతి వరకు ప్రమోట్ చేస్తూనే పోతోంది. గతంలో మాదిరి పుట్టిన తేదీని ఏదో ఒకటి వేసి స్కూలులో హెడ్ మాస్టర్ రాసుకునే వారు. ఇప్పుడు అలా కాదు. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తెచ్చి ఇస్తే వివరాలు స్కూల్లో నోట్ చేసుకుంటారు. వివరాలన్నీ ఆధార్ ఆధారంగా బయో మెట్రిక్ ద్వారా అప్ డేట్ అవుతుంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతూనే ఉంటుంది. దానికి అనుగుణంగా చదువు వచ్చిందా? లేదా? అనేది పక్కన బెడితే క్లాసులు ప్రమోట్ అవుతారు. ఆరు నుంచి పదో తరగతి మధ్యలోనే చదువు రాక చాలా మంది పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఒక వేళ ఏవో సిప్ లు చూసి రాసి పదో తరగతి పాసైతే ఆ విద్యార్థికి చదువు ఎందుకూ పనికి రాదు.
తిరిగి పాత విధానానికే ప్రభుత్వ నిర్ణయం
గతంలో హైస్కూలు విద్య ఎలాగైతే ఎలిమెంటరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హైస్కూలు గా ఉన్నాయో అదే విధానాన్ని తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఆదర్శ పాఠాలల పేరుతో కొత్తగా కొన్నింటిని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. చుట్టుపక్కల ఉన్న ఎలిమెంటరీ స్కూళ్లలోని 3,4,5 తరగతుల విద్యార్ధులను ఆదర్శ పాఠశాలలకు అనుసంధానిస్తారు. మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఈ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 6,7,8 తరగతుల్లో 30 లోపు విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మారుస్తారు. మూడు కిలో మీటర్ల దూరంలో హైస్కూలు ఉంటే అందులో ఈ తరగతులు విలీనం చేస్తారు. దగ్గరలో ఉన్నత పాఠశాల లేకపోతే 60 మంది పిల్లలు ఉన్న స్కూలును ఉన్నత పాఠశాలగా మారుస్తారు. అంటే దూరం తక్కువ ఉంటే తరగతుల్లో విద్యార్థుల మెర్జ్ జరుగుతుంది. లేదంటే ఆలోచిస్తారు. గతానికి ఇప్పటికీ ఈ విధానంలో పెద్ద మార్పు ఏమీ లేదు.