చంద్రమౌళి అంత్యక్రియలు..శోక సంద్రంగా మారిన వైజాగ్
యాక్చువల్‌గా కశ్మీర్ విహార యాత్ర నుంచి ఈ రోజు చంద్రమౌళి బృందం రావలసి ఉంది. కానీ ఇదే రోజు ఆయన అంతిమ యాత్ర చేయాల్సి వచ్చింది.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-04-25 13:02 GMT
విశాఖ శోకసంద్రమైంది. కశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టుల తూటాలకు బలైన చంద్రమౌళికి కడసారి కన్నీళ్లతో నివాళులర్పించింది. కులమతాలు, రాజకీయాలకతీతంగా కన్నీరొలికింది. ఉగ్రవాదుల దుశ్చర్యలను తీవ్రంగా గర్హించింది. చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.
ఇంటి నుంచి తరలిస్తున్నచంద్రమౌళి పార్ది దేహాం
వారం రోజుల విహార యాత్ర కోసమని విశాఖకు చెందిన స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ జేఎస్ చంద్రమౌళి దంపతులు, మరో ఇద్దరు స్నేహితుల కుటుంబీకులతో కలిసి ఈనెల 18న కశ్మీర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. 22న అక్కడ పహల్గాంలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారిలో చంద్రమౌళి కూడా ఉన్నారు. వాస్తవానికి విశాఖ నుంచి వెళ్లిన వీరంతా శుక్రవారం (ఏప్రిల్ 25న) విశాఖకు తిరిగి రావలసి ఉంది. అదే విషయాన్ని చంద్రమౌళి తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులకు, విశాఖలోని తోటి మిత్రులకు చెప్పారు. అందరితో ఎప్పుడూ ఎంతో సౌమ్యంగా, సరదాగా, నవ్వుతూ, నవ్విస్తూ, పదిమందికీ తనకు చేతనైన సేవ చేస్తూ తలలో నాలికలో మెలిగేవారు. అలాంటి చంద్రమౌళి కశ్మీర్ విహార యాత్ర నుంచి త్వరగా వచ్చేయాలని మిత్రులంతా ఆకాంక్షిస్తూ హ్యాపీ జర్నీ చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చంద్రమౌళి దుర్మరణం పాలయ్యారన్న చేదు నిజాన్ని ఆయన కుటుంబీకులతో పాటు స్నేహితులు కూడా జీర్ణించుకోలేకపోయారు. చంద్రమౌళి భౌతికకాయాన్ని కశ్మీర్ నుంచి బుధవారం రాత్రి విమానంలో విశాఖకు తీసుకొచ్చారు. అమెరికాలో ఉంటున్న ఆయన ఇద్దరు కుమార్తెలు గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చిన చంద్రమౌళి పార్థివదేహానికి నివాళులర్పించారు. గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బుధవారం రాత్రి నుంచి చంద్రమౌళి పార్థివదేహాన్ని నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచారు. శుక్రవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని పాండురంగాపురంలోని నివాసానికి తీసుకెళ్లి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని చూసిన భార్య నాగమణి, ఇద్దరు కుమార్తెలు శవపేటికపై పడి భోరున విలపించారు. వారితో పాటే ఆయన స్నేహితులు, బంధువులు పెద్ద పెట్టున రోదించారు.
తండ్రి భౌతిక కాయాన్ని చూసి రోదిస్తున్న చంద్రమౌళి కుమార్తె
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
చంద్రమౌళికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. చంద్రమౌళి సతీమణి నాగమణిని అనిత పరామర్శించి ఓదార్చారు. ఇంకా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు శుక్రవారం ఉదయమే నగరంలోని పాండురంగాపురంలో చంద్రమౌళి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. చంద్రమౌళి గురించి తెలిసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు, స్నేహితులు, బంధువులు, రాజకీయ ప్రముఖల నడుమ చంద్రమౌళి పార్థివదేహాన్ని ఆయన ఇంటి నుంచి నగర రోడ్లపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతిమయాత్ర పొడవునా.. చంద్రమౌళి అమర్‌రహే, జై భారత్, జైజవాన్ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. నగరంలోని జ్ఞానాపురం చావులమదుం శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళికి అంత్యక్రియలు నిర్వహించారు.
చంద్రమౌళి పాడె మోస్తున్న మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్
పాడె మోసిన మంత్రి, ఎంపీలు..
అంతకుముందు చంద్రమౌళి పాడెను ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌లు మోశారు. అనంతరం పార్థివదేహాన్ని అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కించారు. అక్కడ నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి హిందూ సంప్రదాయంలో చంద్రమౌళికి దహన సంస్కారాలు చేపట్టారు.
తిరిగొచ్చే రోజునే అంత్యక్రియలు..
విహార యాత్ర నుంచి తిరిగొచ్చే రోజే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆయన స్నేహితులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఆయన రాకకోసం ఎదురు చూస్తున్న తమకు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాల్సి రావడాన్ని తాము నమ్మలేకపోతున్నామని ఆయనతో కలిసి పనిచేసిన రామ్మోహన్ అనే రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో విలపిస్తూ చెప్పారు.