శ్రీసిటీలో 220 పరిశ్రమలకు అవకాశం.. పెట్టుబడులపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీసిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.

Update: 2024-08-19 12:05 GMT

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీసిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. 15 సంస్థలను ప్రారంభించిన ఆయన వెంటనే శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అధిక పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎం వారితో చర్చించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందుతుందని, ఆ సంపద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగానే ఐటీ రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలను ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక్కరైనా భారతీయుడు కచ్ఛితంగా ఉంటారని చెప్పుకొచ్చారు.

8వేల ఎకరాల్లో జోన్లు

‘‘శ్రీసిటీలో దాదాపు 8వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్‌లు వచ్చాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఒకే చోటు 30 సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యాం. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వచ్చాయి. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కాలా గొప్ప విజయం’’ అని అన్నారు చంద్రబాబు.

ఏసీ కూడా పైప్‌లైన్లతో..

కొత్త రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, రాజధాని నిర్మాణంలో రాజీ అన్న పదానికి కూడా తావులేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం నీరు, విద్యుత్, ఫైబర్ నెట్‌ను ప్రతి ఇంటికి అందిస్తున్నాం. త్వరలోనే గ్యాస్‌ ఒక్కటే కాకుండా ఏసీని కూడా పైప్‌లైన్‌ల ద్వారా అందించే దిశగా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నా. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. 2029 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. విజన్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఒకటి లేదా రెండో స్థానాల్లో నిలుస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

అన్ని సదుపాయాలు ఉన్నాయ్..

‘‘శ్రీసిటీలో వర్షం నీటిని 100 శాతం సేవ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. శ్రీసిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది’’ అని వివరించారు.

Tags:    

Similar News