కబడ్డార్, కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు
ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోండి..;
By : The Federal
Update: 2025-09-02 13:49 GMT
ఆంధ్రప్రదేశ్ లో కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఇవాళ(సెప్టెంబర్ 2) తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠినంగా వ్యవహారించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఏపీకి వచ్చాయని తెలిపారు అధికారులు. ఈ క్రాప్ ద్వారా ఎంత సాగవుతుంది.. ఎంత వినియోగం జరుగుతుందో లెక్కించాలని సూచించారు. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.